ఎమ్బీయస్‌ : అక్కినేనికి నివాళి

అదేమిటో వరసగా ఎలిజీలు రాయవలసి వస్తోంది. అంజలి, సుచిత్రా సేన్‌, యివాళ అక్కినేని. సెప్టెంబరు 2013 లో అక్కినేని పుట్టినరోజు సందర్భంగా 'అక్కినేని మ్యాటినీ ఐడాల్‌ మాత్రమే కాదు, సోషల్‌ ఐకాన్‌ కూడా' అనే…

అదేమిటో వరసగా ఎలిజీలు రాయవలసి వస్తోంది. అంజలి, సుచిత్రా సేన్‌, యివాళ అక్కినేని. సెప్టెంబరు 2013 లో అక్కినేని పుట్టినరోజు సందర్భంగా 'అక్కినేని మ్యాటినీ ఐడాల్‌ మాత్రమే కాదు, సోషల్‌ ఐకాన్‌ కూడా' అనే థీమ్‌ మీద వ్యాసం రాశాను. అక్కినేనిని ఆ కోణంలో చూపినందుకు చాలామంది అభిమానులు అభినందించారు. చదువూ, సంస్కారం ఎరగని కుర్రవాడిగా జీవితం మొదలుపెట్టిన అక్కినేని తనను తాను మలచుకుంటూ, తొలుచుకుంటూ, చెక్కుకుంటూ పోయి తెలుగుతనానికి ప్రతీకగా నిలిచారు. తెరమీద పాత్రలతోనే కాకుండా, బయటి జీవితంలో కూడా హీరోగా నిలిచి, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలుగు ప్రజానీకానికి నేర్పారు. ఇంట్లో తలిదండ్రుల కంటె, బళ్లో గురువుల కంటె, గుళ్లో ఆచార్యుల కంటె – సినిమా హీరోలు నేర్పినదే మనకు తలకెక్కుతుంది. 60 ఏళ్లగా  తెలుగు సమాజం యీ విధంగా రూపుదిద్దుకోవడానికి ఎయన్నార్‌, ఎన్టీయార్‌ యిద్దరూ కారకులే. దాన్ని ఎస్టాబ్లిష్‌ చేసిన ఆ వ్యాసం వెలువడిన నెల్లాళ్లకు ఆయనకు క్యాన్సర్‌ సోకిందని పుకారు వచ్చింది. నిజమా? అయ్యోపాపం అనుకుంటూండగా ఆయన బహిరంగంగా దాన్ని వెల్లడించి 'వీడురా హీరో' అనిపించారు. తన అనారోగ్యం గురించి పరోక్షంగా ప్రస్తావించేవాళ్ల జాలి భరించలేక, 'అవును, నాకు క్యాన్సర్‌ వచ్చింది. ఏం జరగాలో అది జరుగుతుంది. టేకిట్‌ యీజీ' అని ఆయనే చెప్పి ఆ రకంగా వ్యక్తిత్వవికాసంలో మరో పాఠం మనకు అందించారు. 

ఆ ప్రకటన వచ్చేనాటికి ఆయనకు 90 ఏళ్లు. 'నాగేశ్వరరావుగారు పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు. కాలూచేయీ ఆడుతూండగానే, జ్ఞాపకశక్తి యింత బాగా పని చేస్తూండగానే వెళ్లిపోతే హుందాగా వుంటుంది. కథానాయకుడి కథకు సరైన ముగింపులా వుంటుంది' అనుకుంటూండేవాణ్ని. అయితే ఆయన క్యాన్సర్‌ మాట చెప్పగానే యీయన యింకో ఐదారేళ్లు బతికి తీరాలి అనుకున్నాను. ఎందుకంటే ఒక రోగాన్ని ఎదుర్కుంటాను అని హీరో ధీరోదాత్తంగా చెప్పాక, విలన్‌ జయిస్తే ఎలా? వ్యాధి కొమ్ములు వంచి 'ఏడిశావులే, నిన్ను చూసి నేనేం భయపడలేదు' అని చెప్పి మరీ వెళ్లాలి. క్యాన్సర్‌ సోకిన యితరులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి. 'ఆరోగ్యసూత్రాలు జాగ్రత్తగా పాటించి గతంలో గుండెజబ్బు జయించాడీయన. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయ్యాక 45 ఏళ్లు బతికి రికార్డు నెలకొల్పాడు. అలాగే క్యాన్సర్‌ను కూడా అదుపు చేశాడు. మనం కూడా జాగ్రత్తగా వుంటే, మనమూ కొంతకాలం లాగించేయవచ్చు.' అనిపించుకుని పోవాలి – అని గట్టిగా అనుకున్నాను. అలా జరగలేదు. అదీ బాధ. 

20 రోజుల క్రితం ''సాక్షి'' ఫన్‌డే డెస్క్‌వాళ్లు ఫోన్‌ చేసి ఎయన్నార్‌పై ప్రత్యేకసంచిక వేద్దామనుకుంటున్నాం. ఐదారుగురు సినీవిమర్శకులు వ్యాసాలు రాస్తున్నారు. మీరు కూడా ఎయన్నార్‌-ఎన్టీయార్‌లను పోలుస్తూ ఆర్టికల్‌ రాసి పంపగలరా? అన్నారు. సరే అన్నాను. ఇంకో నాలుగు రోజులకు 'కాస్త త్వరగా పంపగలరా? ఆయన పరిస్థితి అటోయిటో అన్నట్టుగా వుందట. అవసరమైతే మెయిన్‌ పేపరులోనే వాడేయవలసి వస్తుంది' అన్నారు. చాలా బాధపడ్డాను. ఆర్టికల్‌ పంపేసిన సాయంత్రమే నాగార్జున టీవీలోకి వచ్చి ఆరోగ్యం బాగానే వుంది, చింతించవద్దు అని ప్రకటన చేశారు. హమ్మయ్య, యీయన బతికి బావుండి వీలైతే మన ఆర్టికల్‌ చదువుతారేమో అనుకున్నాను. గతంలో నేను రాసిన రచనలు, చేసిన టీవీ ప్రోగ్రాంలు ఆయన మెచ్చుకున్నారు. సెప్టెంబరు 2012లో అమెరికాలో తానావాళ్లు ఆయనకు లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ ఎవార్డు యిచ్చినపుడు తయారైన డాక్యుమెంటరీ గురించి యిదివరకు రాశాను. ఆయనంటే ఎవరో తెలియని అమెరికా వాళ్లకు ఆయన గురించి ఇంగ్లీషులో 9 ని||లలో చెప్పడానికి ఎస్‌.వి.రామారావుగారి చేత తానా వాళ్లు డాక్యుమెంటరీ చేయించారు. ఆయన కోరికపై నేను స్క్రిప్టు రాయడం, మా అమ్మాయి వాయిస్‌ఓవర్‌ యివ్వడం జరిగాయి. నాగేశ్వరరావుగారికి రెండూ బాగా నచ్చాయి. హైదరాబాదు తిరిగి వచ్చాక మాకు సత్కారం కూడా చేశారు. ఆ డాక్యుమెంటరీ లింకు గ్రేట్‌ ఆంధ్ర ఇంగ్లీషు వెర్షన్‌లో పెట్టాం, వీలైతే చూడండి. 

అంతకు ముందు జానపద సినిమాలు ఆయన కెరియర్‌కు ఎలా దోహదపడ్డాయో, ఆయన జానపద సినిమాలకు ఎంత కంట్రిబ్యూట్‌ చేశారో ఉపన్యసిస్తే మెచ్చుకున్నారు. ''ఇదీ అసలు కథ'' టీవీ కార్యక్రమం ఆయన నటించిన, తీసిన సినిమాల మూలకథలను పోల్చి చూపించినపుడు ఎంతో సంతోషపడ్డారు. ''మాంగల్యబలం'' కార్యక్రమం చూసి ''నేను ఆ సినిమాలో హీరోని, సహనిర్మాతను. అయినా మీరు చెప్పిన చాలా విషయాలు నాకే తెలియవు.'' అని నిజాయితీగా చెప్పారు. టాలెంటు వున్నవాళ్లను, నిజాయితీగా కష్టపడేవాళ్లను గుర్తించడం, గౌరవించడం ఆయనకు బాగా తెలుసు. సరుకు లేకుండా హంగామా చేసేవాళ్లకు వేదిక నుండే చుఱకలు వేసేవారు. ఈ వ్యాసంతో బాటు ఆయన నన్ను సన్మానిస్తున్న ఫోటో ఒకటి యిస్తున్నాను. ఆయన చేత సన్మానాలు అందుకున్న వారు వేలల్లో వుంటారు. (ఆ అంకె లక్షకు కూడ చేరిందేమో తెలియదు). ఒక్కోప్పుడు నిర్వాహకులు ఆయన చేత తమ కార్యకర్తలకు కూడా శాలువాలు కప్పించేస్తూ వుంటారు. అలాటి సమయాల్లో ఆయన వేరే ఎటో చూస్తూ శాలువా మెడలోకి దాదాపు విసరడం చూశాను. ''విజయగీతాలు'' పుస్తకావిష్కరణ సభలో ఆ పుస్తకం తయారీలో నా కృషి గురించి ఎస్‌వి రామారావుగారు వివరించిన తర్వాత ఆయన నన్ను సత్కరిస్తున్న విధం చూడండి. ఇలాటివి చూసినపుడు మనం పడిన కష్టం మర్చిపోతాం. 

ఆయన ఆరోగ్యంగా వున్నారని తెలియగానే ఎన్టీయార్‌తో ఆయనను పోల్చిన వ్యాసం చదువుతారేమో అని ఆశపడ్డాను. అయితే వ్యాసప్రచురణ వాయిదా పడుతూండడంతో ఆయన ఆరోగ్యం డోలాయమానంగా వున్నంతకాలం 'సాక్షి' వాళ్లు వేయరని అనుమానం వచ్చింది. ఎందుకంటే ముందే వేసేస్తే ఆయన పోయినపుడు వేయడానికి యీ మేటర్‌ అందుబాటులో వుండదు. పోయిన తర్వాత ఫన్‌డేలో వేయాలంటే చాలా గ్యాప్‌ వచ్చేస్తుంది. మరి మెయిన్‌ పేపర్లో వేస్తారో, లేక ప్రముఖుల నివాళులు వేశాక చోటు లేదని మానేస్తారో ఏమీ తెలియదు. నా ఆర్టికల్‌ ప్రచురణకు, ఆయన మరణానికి లింకు వుందని తేటతెల్లం కావడంతో నాలో ఆవేదన కలిగింది. ఆర్టికల్‌ వేసే సందర్భమే రాకుండా ఆయన నాలుగు కాలాలపాటు బతికితే అంతే చాలనిపించింది. ఇన్నాళ్లూ ఆయన సాధించవలసిన విజయాలు యింకేవీ లేవనుకునేవాణ్ని. 'అక్కినేనికి ఎక్కడానికి మెట్లు లేవు – మిక్కిలినేనికి దిగడానికి మెట్లు లేవు' అనే జోక్‌ (అంత్యప్రాసకోసం కాకపోతే మిక్కిలినేనిని అంతలా ఎందుకు తీసిపారేశారో తెలియదు) వింటూ వచ్చాను.  తెలుగు చిత్రపరిశ్రమను హైదరాబాదుకు తరలించడం, గుండె ఆపరేషన్‌ చేయించుకుని కూడా ఎవర్‌గ్రీన్‌గా నిలవడం, స్టూడియో కట్టడం, స్టూడియో ఆర్థికకష్టాల్లో పడినప్పుడు మళ్లీ సినిమాలు నిర్మించి నిలదొక్కుకోవడం.. అక్కినేని యిలా ఎన్నో శిఖరాలు అధిరోహించాడు. క్యాన్సర్‌  రాకుండా వుంటే ఏమో కానీ, క్యాన్సర్‌ అనే ఛాలెంజ్‌ వచ్చి నిలబడింది కాబట్టి, దాని కూడా ఓడించి పంపడానికి కాస్త టైము పడుతుంది కదా. అందుకని ఇంకో ఐదారేళ్లు, పోనీ మూడు నాలుగు.. హీనపక్షం రెండేళ్లు.. వుండాలని, కాన్సర్‌తో కాక ఏ గుండెపోటుతోనో వెళ్లిపోవాలని ప్రగాఢంగా వాంఛింఛాను.

కానీ కాలధర్మాన్ని కాదనడానికి మనం ఎవరం? ఒకటే ఓదార్పు. ఆయన కొద్దినెలలు మాత్రమే కెమో థెరపీ వలన బాధపడి వుంటారు. చివరిదాకా సినిమా నటుడిగానే వున్నారు. ఆఖరి రోజులు మాత్రమే చక్రాల కుర్చీలో వున్నారట. చేతికర్ర సాయంతో ఆయన నడవడం చూసే దుస్థితి మనకు దాపురించలేదు. శరీరం క్షీణించి, మతితప్పిన స్థితిలో పోలేదు. లోపల జబ్బు ఎలా వున్నా మనిషి నున్నగా, గుండ్రంగా వుండగానే సెలవు తీసుకున్నారు. జ్ఞాపకశక్తి కూడా చివరిదాకా బాగుంది. మా వరప్రసాద్‌ తనకు నచ్చిన పాటల సిడిలు రెండు యిస్తే నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ఫోన్‌ చేసి 'అవి వినేశాను. ఇంకో రెండు పంపుతారా?' అని అడిగారట. అంటే జీవితపు చరమథలో కూడా సంగీతం వింటూనే శాశ్వతనిద్రకు వుపక్రమించారన్నమాట. అంతకంటె వేరే అదృష్టం వుందా?

వ్యక్తిగా, నటుడిగా ధృవతారలా మిగిలిన ఆయనకు యిదే నా నివాళి. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2014)

[email protected]