ఎమ్బీయస్‌ : ఆసాం స్టాండర్డ్‌ టైమ్‌

మన దేశంలో తూర్పు వైపు వున్న చివరి ప్రదేశంలో సూర్యోదయానికి, పశ్చిమాగ్రంలో వున్న ప్రదేశంలో సూర్యోదయానికి మధ్య రెండు గంటల వ్యత్యాసం వుంటుంది. అయినా భారతదేశం మొత్తానికి కలిపి ఇండియన్‌ స్టాండర్డ్‌ టైమ్‌ (ఐఎస్‌టి)…

మన దేశంలో తూర్పు వైపు వున్న చివరి ప్రదేశంలో సూర్యోదయానికి, పశ్చిమాగ్రంలో వున్న ప్రదేశంలో సూర్యోదయానికి మధ్య రెండు గంటల వ్యత్యాసం వుంటుంది. అయినా భారతదేశం మొత్తానికి కలిపి ఇండియన్‌ స్టాండర్డ్‌ టైమ్‌ (ఐఎస్‌టి) అని ఒకటే పెట్టుకున్నాం. దీనివలన ఈశాన్య రాష్ట్రాలలో పని గంటలు వ్యర్థమై ఆ ప్రాంతాలు నష్టపోతున్నాయని ఆసాం నాయకులు అంటున్నారు. 

బ్రిటిషు హయాంలో టీ ఎస్టేటు నడిపే బ్రిటిషు వ్యాపారస్తులు భారతీయ కాలమానాన్ని ఒక గంట ముందుకు జరిపి దానికి ''గార్డెన్‌ టైమ్‌'' అని పేరు పెట్టారు. ఆ టైము ప్రకారం కార్మికులచేత పని చేయించుకునేవారు. దానివలన సూర్యకాంతిని పరిపూర్ణంగా వినియోగించుకునేవారు. 1990లో యీ పద్ధతి మారిపోయి అందరూ ఐఎస్‌టికి వచ్చేశారు. దానివలన ఏడుగంటలకు పని ప్రారంభించినా ఉపయోగం లేకుండా వుంది. 

అందువలన ఆసాం, తదితర ఈశాన్య రాష్ట్రాలకు వేరే టైమ్‌ జోన్‌ ఏర్పాటు చేసి దాని ప్రకారం టీ ఎస్టేటులో పని పెందరాళే ప్రారంభింపచేస్తే సమయం, పగటి వెలుగు ఆదా అయి లాభాలు వస్తాయని జహ్ను బారువా అనే ఆస్సామీ సినిమా దర్శకుడు వాదిస్తున్నారు. ఆసాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌ యీ వాదనతో ఏకీభవిస్తూ తన ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో వుందని చెప్పారు.    

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ – న్యూస్‌, వ్యూస్‌, రివ్యూస్‌ – (జనవరి 2014)

[email protected]