మాటల ఊబిలో చిక్కుకున్న అన్నా చెల్లెళ్లు!

తెలంగాణ రాజకీయం రసకందాయంలో నడుస్తోంది. భాజపా ప్రచార సభలో అమిత్ షా తమ పార్టీని గెలిపిస్తే గనుక.. రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని చాలా ఘనంగా ప్రకటించారు. అమిత్ షా ప్రకటన పట్ల…

తెలంగాణ రాజకీయం రసకందాయంలో నడుస్తోంది. భాజపా ప్రచార సభలో అమిత్ షా తమ పార్టీని గెలిపిస్తే గనుక.. రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని చాలా ఘనంగా ప్రకటించారు. అమిత్ షా ప్రకటన పట్ల సాధారణ పౌరుల్లో మాత్రం మిశ్రమ స్పందనే వ్యక్తమవుతుందని అనుకోవాలి. బీసీలు కూడా పూర్తిగా ఆయన మాటను నమ్మారని అనుకోవడం కుదర్దు.

ఎందుకంటే.. ఎన్నికల సీజను వరకు పార్టీని మంచి ఫైర్ తో నడుపుతున్న బీసీ నాయకుడు బండి సంజయ్ ను తప్పించి.. కిషన్ రెడ్డి చేతిలో పగ్గాలు పెట్టిన అధిష్ఠానం.. గెలిచిన తర్వాత బీసీని సీఎం చేస్తుందా? నిజంగానే గెలిచే అవకాశం ఉంటే అసలు ఈ హామీ ఇస్తుందా అని వాదించే వారు కొందరు! బీసీని ప్రధానిగానే చేసిన పార్టీ.. సీఎంను చేయకుండా మాటతప్పదు- అని వాదించే వారు కొందరు ఉన్నారు.

అయితే ఈ ‘బీసీ సీఎం’ ప్రకటనకు కౌంటర్లు ఇవ్వడంలో కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు వివాదాల ఊబిలో చిక్కుకుంటున్నారు. అమిత్ షాకు కౌంటర్ ఇవ్వబోయి.. ముఖ్యమంత్రిగా చేయాలంటే కులంకాదు, గుణం ముఖ్యం అని మాట జారారు కేటీఆర్. ఇది కమల దళపతులకు మరింత కలిసొచ్చింది. అంటే బీసీల్లో ఎవ్వరికీ గుణం లేదని అంటున్నావా.. అంటూ ఇప్పుడు బిజెపి నాయకులు రెచ్చిపోతున్నారు. ఇది బీసీలను అవమానించడమేనని, ఆ వ్యాఖ్యలపై కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలని బండి సంజయ్ రెచ్చిపోతున్నారు.

అదే సమయంలో కల్వకుంట్ల కవిత కూడా అమిత్ షాకు కౌంటర్ యివ్వబోయి భంగపడ్డారు. బీసీని సీఎం చేస్తాననే మాటలు ఎన్నికల స్టంట్ మాత్రమేనని ఆమె అన్నారు. అయితే.. ఎన్నికల స్టంటు అంటే ఏమిటో వారి ఫ్యామిలీకే బాగా తెలుసునని బాజపా నాయకులు ట్రోల్ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఎస్సీని సీఎం చేస్తానని వారు ప్రదర్శించిన ఎన్నికల స్టంట్ ను తెలంగాణ ప్రజలు మొత్తం చూశారని అంటున్నారు.

నిజానికి అమిత్ షా ‘బీసీ సీఎం’ ప్రకటన ప్రజల్లో పెద్దగా తేగల మార్పు ఏమీ ఉండదు. ఆ ఒక్క మాటతో ఆ పార్టీ అధికారంలోకి రావడం కూడా జరగదు. ఇలాంటి నేపథ్యంలో దాని పట్ల స్పందించకుండా ఉంటే పరువు మిగిలేదని.. ఇప్పుడు అనవసరంగా కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు విమర్శలు ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.