ఎమ్బీయస్‌ : కుంభస్థలానికే గురిపెట్టిన ఆప్‌

జయప్రకాశ్‌ నారాయణ్‌గారిని ఆమ్‌ ఆద్మీ అరవింద్‌తో పోలుస్తూ పులివెందుల లాటి నియోజకవర్గంలో పోటీ చేయకుండా తన నివాసం కూడా లేని కూకట్‌పల్లి వంటి సేఫ్‌ నియోజకవర్గాన్ని వెతుక్కున్నారని, అదే అరవిందయితే షీలా దీక్షిత్‌తో తలపడ్డారని…

జయప్రకాశ్‌ నారాయణ్‌గారిని ఆమ్‌ ఆద్మీ అరవింద్‌తో పోలుస్తూ పులివెందుల లాటి నియోజకవర్గంలో పోటీ చేయకుండా తన నివాసం కూడా లేని కూకట్‌పల్లి వంటి సేఫ్‌ నియోజకవర్గాన్ని వెతుక్కున్నారని, అదే అరవిందయితే షీలా దీక్షిత్‌తో తలపడ్డారని మెచ్చుకోవడం జరిగింది. ఆ సాహసం అరవింద్‌తో ఆగిపోకుండా, ఆ పార్టీలోని మరొక నాయకుడు కుమార్‌ విశ్వాస్‌ అమేఠీలో రాహుల్‌ గాంధీతో నిలబడతాననడంతో పార్టీపై మరింత ఆసక్తి రగిలింది. 

దేశమంతటికీ తెలుసు – రాహుల్‌ గాంధీని ప్రధాని చేయడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెసు పార్టీ పనిచేస్తోందని. ఆ లక్ష్యం కోసం వాళ్లు రాష్ట్రాలను చీలుస్తారు, అవినీతిపరులను కాపాడతారు, తమ పార్టీ ప్రధాని పరువు తీస్తారు. అతనే ప్రధాని అభ్యర్థి అనే పట్టాభిషేక ప్రకటన వచ్చేయడం ఖాయం. అది స్పష్టంగా వుంటుందా, లేక అన్యాపదేశంగా వుంటుందా అన్నదే సస్పెన్సు. పదేళ్లగా అవినీతిలో కూరుకుపోయినట్లు ఆబాలగోపాలానికి తెలిసిపోయిన పార్టీ యొక్క ప్రధాని అభ్యర్థి అవినీతి వ్యతిరేక కార్యక్రమం చేపట్టడం జోకాతిజోకు. పార్లమెంటు అవసానథలో వుండగా 9 బిల్లులు పాస్‌ చేయించి, వాటిని చూపి మనను మురిపిస్తారట. చట్టాలకేం, తట్టలకొద్దీ వున్నాయి. అమలు చేసి చూపడమే కావాలి. ములాయం, మాయావతి, లాలూ – ఎవరితో బేరం కుదిరితే వారిపై సిబిఐ కేసులు వెనకసీట్లోకి వెళతాయి. లేకపోతే ముందు సీట్లోకి వస్తాయి. కాంగ్రెసు ప్రతిష్ట ఎంత దిగిజారిందంటే – ఎవరైనా వారితో కుమ్మక్కయ్యారని తెలిస్తే చాలు ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అది చూసి ప్రతీ పార్టీ తాము తప్ప యితర పార్టీలు కాంగ్రెసుతో లోపాయికారీగా పొత్తు పెట్టుకున్నాయని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో రాహుల్‌ గాంధీ వచ్చి బిల్లు కాగితం చింపేస్తే, గంభీరమైన (తనకు వచ్చినంత మేరకు..! అతని మొహంలో భావాలు పలకవు, పోర్షన్‌ అప్పచెప్పినట్టు వుంటుంది) ఉపన్యాసం యిచ్చేస్తే అవినీతిపై పోరాటం చేసినట్టు జనాలు నమ్ముతారా?

ఇన్నాళ్లూ బిజెపి తమ అవినీతిపై పోరాటం చేస్తున్నా వాళ్లకూ మచ్చలున్నాయి. పైగా మతతత్వ పార్టీ అనే ముద్ర వుంది. అందుచేత వాళ్లను ఎదుర్కోవడం సులభం అనుకున్నారు కాంగ్రెసువాళ్లు. అంతలో ఆప్‌ రంగంలోకి దిగింది. వాళ్లకు చరిత్ర లేదు. ఫ్లాష్‌బ్యాక్‌ అంటూ వుంటే చీకటి తప్పులు వుంటాయి, వాటిని బయటపెట్టవచ్చు. ఆప్‌పై మతతత్వం అనే ఆరోపణా పని చేయదు. వీళ్లు ఆచరణవాదులు కారు అనే విమర్శ ఒక్కటీ చేయాలంతే. పైగా కాంగ్రెసు, బిజెపి రెండూ యువత ఓటుకై పోటీ పడుతున్నాయి. మధ్యలో ఆప్‌ వచ్చి యువతను విపరీతంగా ఆకర్షించింది. యువతను తనవైపు తిప్పుకోవాలంటే రోగిష్టి సోనియాను పక్కన బెట్టి, యువ (వాళ్ల దృష్టిలో పెళ్లి కానివాళ్లంతా యువకుల కిందే లెక్కనుకుంటా) రాహుల్‌ను ముందుకు తెస్తే చాలనుకున్నారు. 50 ఏళ్లకు లోపున్న వాళ్లంతా యువకులు అయిపోరు. కొంతమంది యువకులు – పుట్టుకతో వృద్ధులు, నూతిలోని కప్పలు, మొద్దు రాచ్చిప్పలు – అని శ్రీశ్రీ అన్నట్టు మన రాహుల్‌ గాంధీ కాంగ్రెసు నూతిలో వుండి బెకబెకలాడే కప్ప. మామూలు కప్పలు రాత్రంతా బెకబెక లాడగలవు. కానీ యీ హైక్లాసు కప్ప మూణ్నెళ్ల కోసారే బెకబెక మంటుంది. విషయపరిజ్ఞానంలో మొద్దురాచ్చిప్పతో పోల్చవచ్చనే అనిపిస్తుంది. రాచ్చిప్పలు (రాతి గిన్నె) యీ మధ్య మ్యూజియంలో తప్ప బయట కనబడటం లేదు. ఇదివరకు యిళ్లల్లో కూడా వుండేవి. రాచ్చిప్పలో ఉప్పు వేసి వుంచితే ఎన్నాళ్లయినా కరిగిపోదు. అంటే ఆ పాత్ర ఏదీ గ్రహించదు, యింటరాక్ట్‌ కాదు. అందుకే ఏం చెప్పినా బుర్రకు ఎక్కనివాణ్ని మొద్దు రాచ్చిప్ప అని టీచర్లు తిట్టేవారు. చంద్రబాబుగారు యింత కవిత్వపరంగా చెప్పకుండా సింపుల్‌గా మొద్దబ్బాయి అనేశారు. 

ఈ మొద్దబ్బాయిని ఎదుర్కోవడానికి కుమార్‌ విశ్వాస్‌ అనే యువకుడు ఆమ్‌ ఆద్మీ తరఫున అమేఠీలో బరిలోకి దిగాడు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజున అరవింద్‌ పక్కనే నిలబడిన అతని మొహం ప్రజల మెదళ్లలో నాటుకుపోయింది. చూడ్డానికి చురుగ్గా వున్నాడు. అమేఠీలో కుర్రాళ్లతో క్రికెట్‌ ఆడుతున్నాడు. సెక్యూరిటీ సమస్యలు లేవు కాబట్టి ఎక్కడికైనా తిరగగలడు. వేరే పనేమీ పెట్టుకోకుండా అమేఠీని చుట్టబెడుతూ కూర్చోగలడు. మరి రాహుల్‌ గారికి ఢిల్లీలో అనేక రాచకార్యాలుంటాయి. దేశంలోని అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెసు అభ్యర్థులను ఎంపిక చేయడం, నిధులు సమకూర్చడం, టిక్కెట్ల పంపిణీలో జరిగే కొట్లాటలను నివారించడం – యిలా బోల్డు పనులు. అమేఠీలో కాపురం పెడితే అక్కడ నెగ్గవచ్చేమో కానీ, తక్కిన చోట్ల కొల్లేరవుతుంది. పెట్టకపోతే అమేఠీ తప్ప వేరే వ్యాపకమేమీ లేని కుమార్‌ విశ్వాస్‌ రాహుల్‌కి తలనొప్పిగా మారవచ్చు. మెజారిటీ తగ్గించవచ్చు. కాలం, కర్మం కలిసిరాకపోతే షీలా దీక్షిత్‌లా డీలా పడవచ్చు. 

ఆ ప్రమాదాన్ని నివారించడానికి ప్రియాంకను రంగంలోకి దించింది కాంగ్రెసు. ఆమె దేశమంతా పర్యటించి, కాంగ్రెసును బలోపేతం చేస్తుందని మొదట్లో ఊహాగానాలు వచ్చినా 'అబ్బే లేదు, రాయబరేలీ, అమేఠీ మాత్రమే తిరుగుతుంది' అని పార్టీ స్పష్టం చేసింది. సోనియాకు అనారోగ్యం కాబట్టి ఆవిడ తన నియోజకవర్గంలో తిరగలేదు. మన రాహుల్‌ తిరగగలడు కానీ టైము లేదు. అందువలన ప్రియాంకకు అప్పచెప్పారు. ఆవిడైతే గ్లామరస్‌గా కనబడుతుంది, యూత్‌ఫుల్‌గా వుంటుంది, కుమార్‌ విశ్వాస్‌ను అదుపులో వుంచుతుందని వీళ్ల ఐడియా. చిక్కేమిటంటే – కుమార్‌ విశ్వాస్‌ ప్రధాన ఆయుధమే అవినీతి. ప్రియాంకా ప్రధాన లోపమే ఆమె భర్త రాబర్ట్‌ వాధ్రా అవినీతి! ఆమె ప్రచారానికి వచ్చి కనబడగానే అతను వెంటనే గుర్తుకు వస్తాడు. ఆమ్‌ ఆద్మీ అంటే మ్యాంగో పీపుల్‌ అని వెక్కిరించిన అతని కొటేషన్‌ చాలు – సామాన్య ఓటర్ల గుండెలు భగ్గుమనిపించడానికి! 'రాహుల్‌ని గెలిపిస్తే యిదిగో యీ ప్రియాంక మొగుడిలాటి వారిదే రాజ్యం' అన్న ప్రచారం చెప్తే సరిపోతుంది – అవినీతి అంశంపై కాంగ్రెసును దెబ్బ తీయడానికి.

కాంగ్రెసు కుమార్‌ విశ్వాస్‌ను తేలికగా తీసుకోలేదని ప్రియాంకాను రంగంలోకి దింపడంతో అర్థమయింది. రాహుల్‌ జాతీయనాయకుడైతే, విశ్వాస్‌ యింకా నియోజకవర్గ నాయకుడు కూడా కాలేదు. అప్పుడే అంత భయం ఏమిటి అంటే అదంతే. చరిత్రలో అనేక చిత్రాలు జరిగాయి. 1972లో రాయబరేలీలో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా రాజ్‌ నారాయణ్‌ అనే సంయుక్త సోషలిస్టు పార్టీ (ఎస్‌ఎస్‌పి) లీడరు నిలబడ్డాడు. వట్టి బఫూన్‌లా తోచేవాడు. ఓడిపోయాడు కానీ ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ కోర్టుకి వెళ్లాడు. ప్రభుత్వోద్యోగిగా వున్న ఒక వ్యక్తి ఇందిర ఎన్నిక సభల్లో వాలంటీరుగా పని చేశాడని ఫోటో సాక్ష్యాలు చూపాడు. అలహాబాదు హైకోర్టులో విచారణ జరిగింది. 1975లో తీర్పు వచ్చింది – ఇందిర ఎన్నికను పక్కన పెట్టేశారు జడ్జి. కావాలంటే ఇందిర ప్రధాని పదవిని యింకోరికి అప్పగించి, సుప్రీం కోర్టుకి వెళ్లి అక్కడ నెగ్గితే మళ్లీ ప్రధానిగా రావచ్చు. దరిమిలా లాలూ అయితే యిలాటి సందర్భాల్లో భార్య రాబ్డీని ఉపయోగించుకున్నాడు. కానీ ఇందిర భర్త ఫిరోజ్‌ అప్పటికే చచ్చిపోయాడు. వేరే ఎవర్నీ నమ్మలేక, అధికారం వదులుకునే ధైర్యం చేయక ఎమర్జన్సీ ప్రకటించి దేశంలో నియంతృత్వ పాలన తెచ్చిపెట్టింది. దేశమంతా అట్టుడికింది. 19 నెలలు అలా గడిచాక, నియంత అనిపించుకోవడం యిష్టం లేక 1977లో ఎన్నికలు ప్రకటించింది. ఆ ఎన్నికలలో మళ్లీ రాయబరేలీలో నిలబడింది. రాజ్‌ నారాయణ్‌ మళ్లీ నిలబడ్డాడు. ఈసారి ఓటింగులోనే ఓడించాడు. లోకమంతా ముక్కున వేలేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో వున్న ఇందిర ఎక్కడ? ఈ బఫూన్‌ ఎక్కడ? అని. కానీ ఇందిర ఓడిపోవడం వాస్తవం. ఆవిడ మళ్లీ ఉత్తరాదికి వెళ్లకుండా చిక్‌ మగళూరు నుండి, మెదక్‌ నుండి పోటీ చేసింది. ఇందిరకే దిక్కు లేనపుడు కేవలం ఇందిర పోలికలతో వున్నంతమాత్రాన ప్రియాంక రాహుల్‌ను ఉద్ధరించగలదా?

కాంగ్రెసుకు వున్నది సోనియా, రాహుల్‌, ప్రియాంక.. అంతేగా! మరి ఆమ్‌ ఆద్మీకి..? కొత్తగా వచ్చేవాళ్లందరూ నాయకులే. ఇప్పుడు వస్తున్న ఊపుతో అది అన్ని రాష్ట్రాలలోనూ తన అదృష్టాన్ని పరీక్షించ దలచుకుంది. పార్టీ సభ్యత్వం పెంచడానికి టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఓ నెంబరు యిచ్చి మిస్‌డ్‌ కాల్‌ యిస్తే చాలంది. నాలుగు రోజుల్లో దేశం మొత్తం మీద 10 లక్షల మంది సభ్యత్వం అడిగారట. మన రాష్ట్రం నుండి లక్షమందిట! వీళ్లంతా వచ్చి ఓట్లేస్తే ఆప్‌ అభ్యర్థి నెగ్గినా నెగ్గకపోయినా 3-4% ఓట్లు అటూయిటూ అయ్యాయంటే అభ్యర్థుల రాతలు తారుమారవుతాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రెండు రాష్ట్రాలలో ఆప్‌ విశేషంగా కృషి చేస్తుందని చెప్పవచ్చు. రాజస్థాన్‌లో బిజెపి ఘనవిజయం తర్వాత ఆప్‌కు దానిపై పెద్దగా ఆశ పెట్టుకోలేదు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వవ్యతిరేకత అంతగా లేదని యిటీవలి ఎన్నికలు చాటాయి కాబట్టి అక్కడ ఆప్‌ అవకాశాలు పరిమితమే. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు లెఫ్ట్‌, తృణమూల్‌ మధ్య చీలిపోయారు. అక్కడ అవినీతి ఆరోపణలు తక్కువే కూడా. 

యుపి ప్రభుత్వంపై అనేకవర్గాలు మండిపడుతున్నాయి కాబట్టి, ప్రతిపక్ష నాయకురాలు మాయావతిపై కూడా అవినీతి ఆరోపణలు పుష్కలంగా వున్నాయి కాబట్టి ఆప్‌ పుంజుకోవచ్చు. ఆప్‌ యిక్కడ జయప్రకాశ్‌ నారాయణ్‌ పేరును బాగా వాడుకోబోతోంది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన జయప్రకాశ్‌ సోషలిస్టు భావాలతో 'సంపూర్ణ క్రాంతి' పేరుతో మహా ఉద్యమం నడిపారు. ఆ ఉద్యమం ద్వారానే ములాయం, లాలూ, పాశ్వాన్‌ వంటి నాయకులు వెలుగులోకి వచ్చారు. ఆయన పేరు చెప్పుకుని అధికారం తెచ్చుకున్న యీ నాయకులు కాంగ్రెసును మించిన అవినీతికి పాల్పడి, జయప్రకాశ్‌ పేరు భ్రష్టు పట్టించారనే నినాదం చేపట్టింది ఆప్‌. ఆసాంలో జనవరి చివరిలో పెద్ద సభ ఏర్పాటు చేయబోతున్నారు. అన్నా హజారే ఉద్యమంలో పాలు పంచుకున్న అఖిల్‌ గొగోయ్‌ను కన్వీనర్‌గా పెట్టారు. అన్నిటికన్నా ఎక్కువ దృష్టి పెట్టినది అరవింద్‌ మాతృరాష్ట్రమైన హరియాణాపై. ఆప్‌ సిద్ధాంతకర్త యోగేంద్ర యాదవ్‌ను హరియాణా యిన్‌చార్జిగా నియమించి, ఆయనను అక్కడికి యిప్పటికే పంపేసింది. రాబర్డ్‌ వధేరా అవినీతికి భూపేందర్‌ సింగ్‌ హూడా నేతృత్వంలోని అక్కడి కాంగ్రెసు ప్రభుత్వం ఎలా దోహదపడిందో వెలుగులోకి తెచ్చిన అశోక్‌ ఖేమ్కా రాజకీయాల్లో చేరనని చెప్పినా, ఆయన లేవనెత్తిన ప్రశ్నల వలన ఆప్‌ తప్పక లాభపడుతుంది. 

ఢిల్లీలో అన్ని పార్లమెంటరీ సీట్లకు పోటీ చేయడం ఎలాగూ ఖాయం. దాని తర్వాత అరవింద్‌ గురువైన అన్నా హజారే సొంతరాష్ట్రమైన మహారాష్ట్రపైనే వుంది ఫోకస్‌. మాయాంక్‌ గాంధీ వంటి ఆప్‌ నాయకులు చాలామంది అక్కడివారే. ఆదర్శ్‌ కుంభకోణం వంటి కాంగ్రెసు-ఎన్‌సిపి అవినీతి చేష్టలతో జనం విసిగివున్నారు కాబట్టి ఆప్‌కు అక్కడ అవకాశాలు బాగానే వున్నాయన్న అంచనాతో అక్కడి 48 స్థానాలకూ ఆప్‌ పోటీ చేయబోతోంది. ఇది వినగానే ఆప్‌ ఎన్నికల వాగ్దానంగా విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తానని ఎలాగూ చెపుతుంది కాబట్టి మనమే ముందుగా తగ్గించేయాలని కాంగ్రెసు ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌ తన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాడు. గుజరాత్‌లో మోదీపై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు పెద్దగా లేకపోయినా, ఆప్‌ గుజరాత్‌ను వదల దలచుకోలేదు. జనవరి 26 న మహాత్మాగాంధీ జన్మస్థలమైన పోర్‌బందర్‌ నుండి 'ఝాడూ చలో యాత్ర' అని ప్రారంభించి గుజరాత్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బార్దోలి వరకు వెళతారట. 

ఇక దక్షిణాదికి వస్తే బెంగుళూరులో నెటిజన్లు ఎక్కువ కాబట్టి, ఆప్‌కు వాళ్లు మొదటినుండీ సహాయపడుతూ వున్నారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో వాళ్లలో చాలామంది నెలల తరబడి సెలవు పెట్టి ఢిల్లీ వెళ్లి వాలంటీర్లుగా పనిచేశారట. అలా వెళ్లలేనివాళ్లు బెంగుళూరు నుండే ఢిల్లీ ఓటర్లకు ఫోన్‌ చేసి ఆప్‌కు ఓటేయమని నచ్చచెప్పారట. ఇన్ఫోసిస్‌ డైరక్టర్లలో ఒకరైన వి. బాలకృష్ణన్‌ తన పదవి వదిలేసి జనవరి 1 న ఆప్‌లో చేరడంతో వాళ్లకు మంచి ఉత్సాహం వచ్చింది. కర్ణాటకలో అవినీతికి తక్కువేమీ లేదు. అవినీతి కారణంగానే ఎడ్యూరప్పను బిజెపి పార్టీ నుండి బహిష్కరించింది. మోదీ సారథ్యం చేపట్టాక మళ్లీ అదే ఎడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానించి, అవినీతి మాట ఎలా వున్నా ఓట్లు మాకు ముఖ్యం అని చాటుకుంది. జెడియస్‌ సారథి దేవెగౌడ అవినీతి ఎప్పటినుండో తెలుసు. ఇక కొత్తగా వచ్చిన కాంగ్రెసు ముఖ్యమంత్రి సిద్దరామయ్య అవినీతిని పారద్రోలుతానంటూనే కళంకితులైన వారిని తన కాబినెట్‌ మంత్రులుగా యీ మధ్యే తీసుకున్నాడు. 

కేరళలో ఓటర్లు ఎప్పుడూ పార్టీలపరంగా చీలిపోయి వుంటారు. అక్కడ కాలూనుకోవడం కష్టమే. అయినా చొరవ తీసుకుని ఆప్‌ నాయకుడు ప్రశాంత్‌ భూషణ్‌ సిపిఎం నాయకుడు అచ్యుతానందన్‌ యింటికి వెళ్లి మాట్లాడి వచ్చారు. అచ్యుతానందన్‌ అవినీతికి బద్ధవిరోధి అనీ, తన పార్టీలోని అవినీతిపరులతో కూడా నిరంతరం పోట్లాడారని అందరికీ తెలుసు. ఆ పార్టీపై సానుభూతి లేనివారు సైతం అచ్యుతానందన్‌ను అభిమానిస్తారు. వారు ఆప్‌ వైపు మొగ్గే సూచన వుందంటున్నారు. ఇక తమిళనాడులో రెండు పార్టీల మధ్యనే రాజకీయం తిరుగుతుందని అందరికీ తెలుసు. అక్కడ కూడా చొరబడదామని ఆప్‌ ప్రయత్నించి 12 జిల్లాల్లో యూనిట్లు పెట్టింది. ఇక మన రాష్ట్రానికి వస్తే యిక్కడ అవినీతికి, ప్రభుత్వవ్యతిరేకతకు లోటు లేకపోయినా, విభజన-సమైక్యవాదాల హోరులో తక్కిన అంశాలు ఏవీ ప్రజల దృష్టిని ఆకర్షించటం లేదు. ఈ సందడి తగ్గాక ఆప్‌కు అవకాశాలు పెరగవచ్చు. చూదాం.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2014)

[email protected]