ఎమ్బీయస్‌ : సుచిత్రా సేన్‌ – 1

గతవారం మరణించిన మహానటి సుచిత్రా సేన్‌ గురించి పేపర్లలో, టీవీల్లో వచ్చిన వార్తలు చూసే వుంటారు. వాటికి అనుబంధంగా యీ వ్యాసం రాస్తున్నాను. హిందీలో మీనాకుమారి, తెలుగులో సావిత్రి – యిద్దరూ సుచిత్రా సేన్‌…

గతవారం మరణించిన మహానటి సుచిత్రా సేన్‌ గురించి పేపర్లలో, టీవీల్లో వచ్చిన వార్తలు చూసే వుంటారు. వాటికి అనుబంధంగా యీ వ్యాసం రాస్తున్నాను. హిందీలో మీనాకుమారి, తెలుగులో సావిత్రి – యిద్దరూ సుచిత్రా సేన్‌ నుండి స్ఫూర్తి పొందినవారే. తెలుగువాళ్లకు నాగేశ్వరరావు-సావిత్రి ఎలాగో బెంగాలీ వాళ్లకు ఉత్తమ్‌ కుమార్‌- సుచిత్రా సేన్‌ జంట అలాటిది. ఇద్దరూ కలిసి 30 సినిమాలు వేశారు. అవి కాక ఆమె యింకో ముప్ఫయి సినిమాలు వేసిందంతే. కానీ దేశంలోని నటీనటులందరూ సుచిత్ర అభినయానికి జోహారు అన్నవాళ్లే. అలా అందరి మెప్పూ పొందిన హిందీ నటుడు సంజీవ్‌ కుమార్‌. ఇద్దరూ కలిసి ''ఆంధీ''లో పోటీ పడ్డారు. ఆ సినిమాలో వేయడానికి సుచిత్ర మొదట్లో పెద్దగా ఆసక్తి చూపలేదు కానీ తర్వాత సమ్మతించి మంచిపని చేసింది. ఆమె మరణించగానే టీవీలన్నీ ఆ సినిమాలో పాటలే దంచేశాయి. 

హిందీ సినిమాలలో వేయడానికి ఆమె ఉత్సుకత చూపలేదనే అనుకోవాలి. అయినా బెంగాలీలైన హిందీ డైరక్టర్లు కొందరు ఆమెను ఒప్పించారు. సినిమాల్లోకి వచ్చిన మూడేళ్లలోనే ''దేవదాసు'' (1955) వేసింది. బెంగాలీ, హిందీలలో గొప్ప సినిమాలు తీసిన బిమల్‌ రాయ్‌ పార్వతి పాత్ర ఆఫర్‌ చేశారు. దేవదాసు దిలీప్‌ కుమార్‌ వేయగా, చంద్రముఖి వైజయంతిమాల వేశారు. పార్వతి పాత్రలో సుచిత్ర యిమిడిపోయింది.  కొన్నాళ్లకు హిందీరంగంలో స్థిరపడిన బెంగాలీ దర్శకుడు హృషీకేశ్‌ ముఖర్జీ ప్రయోగాత్మకంగా తీసిన ''ముసాఫిర్‌'' (1957) సినిమాలో ఓ చిన్న పాత్ర వేసింది. ఆ సినిమాలో హీరో అని చెప్పాలంటే – ఒక యింట్లో ఒక వాటా. ఒకరి తర్వాత మరొకరు ఆ యింట్లో దిగుతారు. వారి కథల సమాహారమే సినిమా. కథ రాయడానికి హృషీకేశ్‌ ముఖర్జీకు మరొక బెంగాలీ దర్శకరచయిత ఋత్విక్‌ ఘటక్‌ సహకరించారు. మొదటి ఎపిసోడ్‌లో కొత్తగా పెళ్లయి ఆ వాటాలో దిగిన అమ్మాయిగా సుచిత్ర వేసింది. ఆ ఏడాదే ఎస్‌. ముఖర్జీకి చెందిన ఫిల్మిస్తాన్‌ వాళ్లు తీసిన ''చంపాకలీ''లో భరత్‌ భూషణ్‌కు జోడీగా వేసింది.  బెంగాలీ దర్శకుడు శంకర్‌ ముఖర్జీ తీసిన ''సర్‌హద్‌'' (1960) సినిమాలో దేవ్‌ ఆనంద్‌తో వేసింది. దేవదాసు తప్ప యివి ఎవరికీ గుర్తు లేవు. కాస్త బాగా గుర్తుండేది – ''బొంబాయి కా బాబూ''. (1960) దర్శకుడు రాజ్‌ ఖోస్లా బెంగాల్‌నుండి హీరోయిన్‌ను తీసుకురావడానికి ఒక ప్రత్యేక కారణం తోస్తుంది.

ఆ సినిమాలో హీరో జులాయి. జూదంలో ఒకతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత పశ్చాత్తాప పడతాడు. అతని స్థానంలో తను ఓ గ్రామంలో వున్న వాళ్ల యింటికి వెళతాడు. ఎప్పుడో యింటి నుండి పారిపోయి వచ్చిన పిల్లాడు బుద్ధిగా తిరిగి వచ్చాడని కుటుంబమంతా సంతోషిస్తుంది. ముఖ్యంగా అతని చెల్లెలు.  ఆమెయే కథానాయిక. హీరో ఆ కుటుంబానికి ఎంతో సాయపడుతూ, హీరోయిన్‌ను ప్రేమిస్తాడు. కానీ ఆమె యితన్ని తన అన్నగా భావిస్తుంది కాబట్టి అలాటి భావనలు పెట్టుకోదు. ఎంతో మానసిక సంఘర్షణకు గురైన హీరో చివరకు తన ప్రేమ చంపుకుని, ఆ చెల్లెలు కాని చెల్లెలికి వేరేవాళ్లతో పెళ్లి చేసి పంపేసి, తనెవరో చెప్పి పోలీసులకు లొంగిపోతాడు. ఈ సినిమాలో హీరో దేవ్‌ ఆనంద్‌. రొమాంటిక్‌ హీరోగా పేరు పొందినవాడు. కథానాయికగా ఏ ఆశా పరేఖ్‌నో, సాధనానో, వహీదానో పెట్టి, చెల్లెల్లా చూపించి ఆమెకు అతనిపై ప్రేమ పుట్టలేదని చూపిస్తే అతని యిమేజికి దెబ్బ. 

ఈ సినిమాలో అన్నా-చెల్లెలుగా వేసినవాళ్లను మరో సినిమాలో ప్రేమికులుగా చూపిస్తే ప్రేక్షకులు ఆమోదించరని భయం. మన ''రక్తసంబంధం''లో ఎన్టీయార్‌-సావిత్రి అన్నా చెల్లెలుగా నటించారు. అదే ఏడాది రిలీజైన ''గుండమ్మ కథ''లో ప్రేమికులుగా నటించారు. తెలుగు ప్రేక్షకులు ఆమోదించారు. కానీ హిందీవాళ్లకు భయాలు ఎక్కువ. ఇదే దేవ్‌ ఆనంద్‌ తర్వాతి రోజుల్లో ''హరేరామ హరేకృష్ణ'' సినిమాలో తన చెల్లెలుగా నటించిన జీనత్‌ అమాన్‌తో తర్వాతి సినిమాల్లో ప్రియుడుగా నటించాడు. హిందీ రంగంలో హీరోయిన్‌ అయితే యీ చిక్కులుంటాయని ఏ యిమేజి లేని హీరోయిన్‌ అయితే బెటర్‌ అనుకుని బెంగాల్‌ నుండి సుచిత్రా సేన్‌ను తెచ్చి వుంటారు. కొత్త రకంగా వున్న ఆ సినిమా పెద్దగా ఆడలేదు. పాటలు బాగుంటాయి. హీరో హీరోయిన్ల (!) మధ్య 'దీవాన్‌ మస్‌తానా..' అనే డ్యూయట్‌ కాని డ్యూయట్‌ చాలా పాప్యులర్‌. ఆ పాట చిత్రీకరణ చూస్తే పాత్రల దృక్పథాల వైరుధ్యం తెలుస్తుంది.

సుచిత్ర తర్వాత వేసిన హిందీ సినిమా ''మమతా'' (1966). ఇది ఆమె మూడేళ్ల క్రితం బెంగాలీలో వేసిన ''ఉత్తర ఫల్గుణి'' అనే సినిమాకు హిందీ రీమేక్‌. దాన్ని డైరక్టు చేసిన బెంగాలీ డైరక్టరు అసిత్‌ సేనే దీన్నీ డైరక్టు చేశారు. దీనిలో ఆమెది ద్విపాత్రాభినయం. ఒక విద్యాధికుణ్ని ప్రేమించిన మధ్యతరగతి అమ్మాయి గర్భవతి అవుతుంది. అతను బారిస్టరు చదవడానికి విదేశాలకు వెళ్లిన సమయంలో ఒక దుర్మార్గుడి పాల బడుతుంది. తవాయిఫ్‌గా (రసికుల కోసం పాటలు పాడే కళాకారిణి) మార్చబడుతుంది. బారిస్టర్‌ తిరిగి వచ్చి ఆమె కోసం వెతికి, చివరకు కనుగొంటాడు. బాధపడతాడు. తన కూతుర్ని అతనికి అప్పగించి పెంచమంటుంది. కూతురు బాగా చదువుకుని లాయరు అవుతుంది. బారిస్టరు వద్ద తనతో బాటు పనిచేసే అతన్ని ప్రేమించి పెళ్లాడబోయే సమయానికి, తల్లిని పీడిస్తున్న ఆ దుర్మార్గుడు కూతుర్ని హింసించబోతాడు. తల్లి అతన్ని చంపేసి కోర్టులో లొంగిపోతుంది. చాలా సెంటిమెంటల్‌ సినిమా. తల్లి సుచిత్రకు జోడీగా అశోక్‌ కుమార్‌, కూతురు సుచిత్రకు జోడీగా ధర్మేంద్ర నటించారు. గొప్ప మ్యూజికల్‌ హిట్‌. బాక్సాఫీస్‌ హిట్‌ కూడా. ఈ కథాంశం నచ్చి తమిళంలో ''కావ్యతలైవి'' అని తీస్తే షావుకారు జానకి వేశారు. తెలుగులో జమున వేస్తే (పేరు ''వనజ-గిరిజ'' అని గుర్తు) ఆడలేదు.

''మమతా'' విజయం తర్వాత కూడా ఆమెకు హిందీలో పెద్దగా ఆఫర్లు రాలేదు. రాజ్‌ కపూర్‌ ఆఫర్‌ యిచ్చినా సుచిత్రా ఒప్పుకోలేదంటారు. బెంగాలీ వాళ్లకు హిందీ వాళ్లు తమను తొక్కేస్తారనే ఫీలింగు చాలా వుంది. బెంగాలీలో టాప్‌ పొజిషన్‌లో వున్న ఉత్తమ్‌ కుమార్‌ ''ఛోటీసీ ములాకాత్‌'' అనే హిందీ సినిమాను భారీస్థాయిలో వైజయంతిమాల హీరోయిన్‌గా హిందీలో నిర్మించాడు. దానికి మూలం ''అగ్నిపరీక్ష'' అని ఉత్తమ్‌, సుచిత్రా వేసిన బెంగాలీ సినిమా. దాని ఆధారంగా తెలుగులో ''మాంగల్యబలం'' తీస్తూ ఎన్నో మార్పులు చేశారు. హిందీ సినిమాను బెంగాలీ సినిమా ఆధారంగానే తీశారు. ఆ సినిమా ఘోరమైన ఫ్లాప్‌. దానికి కారణం ఉత్తమ్‌ కుమార్‌పై అసూయతో హిందీ హీరోలు చేసిన కుట్ర అని బెంగాల్‌లో చెప్పుకుంటారు. సుచిత్రకు కూడా అలాటి ఫీలింగే వుందేమో తెలియదు. హిందీ సినిమాలకు దూరంగానే వుంది. కొన్నాళ్లకు ''ఆంధీ'' ఆఫర్‌ వచ్చింది. కమలేశ్వర్‌ అనే నవలా రచయిత ''కాలీ ఆంధీ'' అనే నవల రాశారు. దాని ఆధారంగా గుల్జార్‌ యీ సినిమా తీశారు. ఇందిరా గాంధీ జీవితంపై తీసిన సినిమా అని అప్పుడూ అనుకున్నారు. ఇప్పుడూ అదే చెప్తున్నారు. కాదు, తారకేశ్వరీ సిన్హా (ఫిరోజ్‌ గాంధీకి సన్నిహితురాలైన కాంగ్రెసు ఎంపీ) గురించి అని యిటీవల ఒకరు రాశారు. సినిమా వచ్చిన కొత్తల్లోనే కమలేశ్వర్‌ను అడిగితే ఆయన స్పష్టంగా రాశారు – 'ఇది ఇందిరా గాంధీ గురించి కాదు, జనసంఘ్‌ పార్టీ నాయకురాలైన మహారాణి గాయత్రీదేవి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాశాను' అని. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2014)

[email protected]