చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కిందన్న ఆనందం ఆమెకు లేదు. మంత్రి పదవిని ఆస్వాదిద్దామని అనుకునే లోపే ….ఒక దాని వెంట మరొకటి సమస్యలు చుట్టుమడుతున్నాయి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళా విశేషం ఏంటో గానీ, రజనీకి మొదటి రోజు నుంచే తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుతం ఆమె దుర్ఘటనలపై సీఎం జగన్, ప్రభుత్వ అభిప్రాయాల్ని విడుదల చేసే పాత్ర పోషించాల్సి వచ్చింది.
ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి, మీడియాకు మధ్య సంధానకర్త అవతారమెత్తారు. అంటే జర్నలిస్టు పాత్ర పోషిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం, ఆ తర్వాత తిరుపతి రుయాలో తొమ్మిదేళ్ల బాలుడి శవాన్ని తరలించడంలో చోటు చేసుకున్న అమానవీయం, తాజాగా తన జిల్లాలోనే రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై అత్యాచార ఘటన …ఇలా వరుస దుర్ఘటనలపై వైద్యారోగ్యశాఖ మంత్రిగా స్పందించాల్సి వస్తోంది.
రేపల్లె రైల్వేస్టేషన్‌లో వలస కూలీపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణే కరువైందని ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపల్లెలో మహిళపై అత్యాచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్‌గా తీసుకున్నారని విడదల రజనీ తెలిపారు.
నిందితులకు కఠిన శిక్ష పడే వరకు తమ ప్రభుత్వం వదిలిపెట్టదని ఆమె హెచ్చరించారు. పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితు లను అదుపులోకి తీసుకున్నట్టు విడదల రజనీ చెప్పారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని రేపల్లె ఆస్పత్రి అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారన్నారు.
బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఏం చేస్తున్నావు కోడలా అంటే ఉలకపోసి ఎత్తుకుంటున్నా అత్తా అని వెనుకటికెవరో అన్నట్టుగా… విడదల రజనీ మాటలున్నాయి. వైద్యారోగ్యశాఖ మంత్రిగా రాష్ట్రంలో తన శాఖకు సంబంధించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడానికి సమయం కుదరనట్టుంది.
ప్రతిరోజూ అత్యాచారాలు, అమానవీయ ఘటనలపై ప్రభుత్వ స్పందన, సీఎం జగన్ మనోభావాలను మీడియాకు చేరవేయడానికే రజనీకి పుణ్యకాలం కాస్త సరిపోయేలా ఉంది. అఘాయిత్యాలు ఆగిపోతే తప్ప రెగ్యులర్ పనులపై కొత్త వైద్యారోగ్యశాఖ మంత్రి దృష్టి పెట్టే పరిస్థితి వుండదేమో!