డిసెంబరు 15న డిఎంకె జనరల్ కౌన్సిల్ మీటింగు జరిగింది. ఆ తర్వాత 4 రోజులకు ఎడిఎంకె జనరల్ కౌన్సిల్ మీటింగు జరిగింది. రెండు చోట్లా ఒకే రకమైన తీర్మానాలు చేశారు – 2014 పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెసు, బిజెపిలలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని! ఎడిఎంకె కాస్త ముందుకు వెళ్లి అన్ని సీట్లకూ స్వతంత్రంగానే పోటీ చేస్తామనీ. తమిళనాడు ప్లస్ పాండిచ్చేరి కలిపి 40 పార్లమెంటు సీట్లు పొంది ఎన్నికల అనంతరం ఎవరితో కావాలంటే వారితో పొత్తు పెట్టుకుంటామనీ ప్రకటించింది. ఆ మేరకు నిర్ణయాధికారాన్ని పార్టీ జయలలితకు ధారపోసింది.
డిఎంకె సభలో మాత్రం వ్యవహారం ఇంత సజావుగా సాగలేదు. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోకూడదని స్టాలిన్‌కు గట్టి పట్టుదల వుండడంతో బాటు, బిజెపితో అయితే ఫర్వాలేదని మనసులో వుంది. అయితే వేదికపై స్టాలిన్ కాకుండా ఇతర ప్రముఖ నాయకులు టిఆర్ బాలు, ఎస్ఎస్ పళనిమాణిక్యం కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోకూడదని గట్టిగా వాదించారు. కరుణానిధి వారి అభిప్రాయానికి వత్తాసు పలుకుతూ కాంగ్రెసు విశ్వాసఘాతకురాలని, 2జి స్కామ్‌లో రాజాను, కనిమొళిని జైల్లో పెట్టిందని తిట్టిపోశారు. ‘సిబిఐ చేసింది తప్ప మాదేముంది? అంటారు కాంగ్రెసు నాయకులు. సిబిఐ ఎవరి చేతిలో ఆయుధమో ప్రజలకు తెలియదా?’ అని హుంకరించారు కరుణానిధి.
స్టాలిన్ అనుచురుడు అన్బళగన్ బిజెపితో కలిస్తే మంచిదని సభాముఖంగా సూచించాడు. అయితే 1999 నుండి ఐదేళ్లపాటు డిఎంకెతో కలిసి కేంద్రాన్ని పాలించిన బిజెపి ప్రస్తుత నాయకత్వం 2జి స్కామ్ వలన డిఎంకె పేరు మట్టిలో కలిసిందని, వారితో జతకడితే మోడీ ‘క్లీన్’ ఇమేజి దెబ్బ తింటుందని భావించింది. అది గ్రహించిన కరుణానిధి ‘‘గతంలో ఎన్డిఏ ప్రభుత్వంలో వున్నామంటే కారణం వాజపేయి! ఆయన ఉదాత్తవ్యక్తి. పెద్దమనిషి. ఇప్పుడాయన లేడు. ఈ అడ్వానీలో మానవత్వం లేదు. వారితో మనకు పొత్తు అక్కరలేదు. ఎవరు మనకు కావాలనుకుంటే వాళ్లతోనే వెళదాం.’’ అని ప్రకటించారు. తమిళనాడులో 12% ఓట్లు ముస్లిముల చేతుల్లో వున్నాయి. గతంలో వాజపేయి ఉదారస్వభావుడని చెప్పి డిఎంకె వాళ్లను ఒప్పించింది. ఇప్పుడు మోడీతో అలా కుదరదు. పార్లమెంటు ఎన్నికల మాట ఎలా వున్నా 2016లో జరగబోయే ఎసెంబ్లీ ఎన్నికలు డిఎంకెకు ముఖ్యం. బిజెపికి కూడా ఆ విషయం తెలుసు. అందుకనే మన రాష్ట్రపు బిజెపి నాయకత్వం లాగానే తమిళనాడు బిజెపి నాయకత్వం కూడా ‘మేం డిఎంకె, ఎడిఎంకె ఎవరితోనూ పొత్తు పెట్టుకోం, ఒంటరిగానే పోటీ చేసి మోడీ ఇమేజితో విజయం సాధిస్తాం’ అని బీరాలు పలుకుతోంది.
కరుణానిధి ప్రకటనపై తమిళనాడు కాంగ్రెసు అధ్యక్షుడు జ్ఞానదేశికన్ మండిపడ్డారు. ‘‘మాది నమ్మకద్రోహం అని డిఎంకె ఎలా అనగలదు? 2006 నుండి 2011 వరకు మైనారిటీలో వున్న డిఎంకె ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదా? 2జి స్కామ్ తర్వాత యుపిఏ2 నుండి డిఎంకె వైదొలగిన తర్వాత కూడా 2013లో కనిమొళి రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వలేదా? అంతెందుకు మొన్న ఏర్కాడు అసెంబ్లీ ఉపయెన్నికలో డిఎంకె అభ్యర్థికి తోడ్పడమని కరుణానిధి కాంగ్రెసుతో సహా అందరికీ ఉత్తరాలు రాశారు. వచ్చే లోకసభ ఎన్నికలలో మద్దతు ఇమ్మనమని కాంగ్రెసు డిఎంకెను కోరిందా?’’ అని అడుగుతున్నారు.
ఏది ఏమైతేనేం? చూడబోతే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)