చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పరువు నష్టం కేసులో సినీ నటులు రాజశేఖర్, జీవిత దంపతులకు నాంపల్లి కోర్టు జైలు శిక్షతో పాటు 5వేల జరిమానా విధించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై రాజశేఖర్ దంపతులు తప్పుడు ఆరోపణలు చేశారని.. ప్రముఖ నిర్మాత చిరంజీవి బంధువు అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు.
వివరాల్లోకి వెళ్లితే.. హీరో రాజశేఖర్, జీవిత దంపతులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ప్రోత్సహకాలు పొందుతూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్తంతో వ్యాపారం చేస్తోందని వారు ఆరోపించారు. దీంతో వారు అసత్య ఆరోపణలు చేశారంటూ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోలతో పాటు.. మీడియాలో వచ్చిన కథనాలను కూడా జత చేసి కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం ఈ కేసులో నాంపల్లి కోర్టు తీర్పు తాజాగా తీర్పు వెలువరించింది.
కాగా రాజశేఖర్, జీవిత దంపతులు జరిమానా చెల్లించడంతో పై కోర్టులో అప్పీలుకు అవకాశమిస్తూ న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన టైంలో జీవిత, రాజశేఖర్ దంపతులు పొలిటికల్ గా అప్పట్లో చిరంజీవికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా చేసిన విషయం తెలిసిందే.