మన దేశాల్లో విధానాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అయితే అమలులో మాత్రం అవకతవకలు ఉంటాయి. ఒకటని కాదు.. ప్రతి దాంట్లోనూ ఇదే పరిస్థితి. విధానాల విషయంలో కాస్త లిబరల్ గా ఉండి, వాటి అమలు విషయంలో మాత్రం కచ్చితంగా ఉంటే సత్ఫలితాలు సాధించవచ్చు. అయితే స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచే కొద్దీ విధానాలను స్ట్రిక్ట్ చేస్తారు కానీ, అమలును మాత్రం గాలికి వదులుతూ ఉంటారు.
ఏదైనా విధానం అమల్లో ప్రభుత్వాలు కాస్త స్ట్రిక్ట్ గా ఉంటాయంటే.. అది కేవలం పన్నుల వసూలు మార్గాల విషయంలో మాత్రమే! అది కూడా సామాన్యుల నుంచి దండుకునే అవకాశాల గురించి మాత్రం ప్రభుత్వాలు బోలెడంత కసరత్తు చేస్తాయి. పెద్దవాళ్ల స్థాయిలో అనేక ఆర్థిక అవకతవకలు జరిగే దేశంలో.. చిన్న వాళ్లు మాత్రం తప్పించుకునే ఛాన్సే ఉండదు. అన్ని రకాలుగానూ బిగించేయడానికి దొరికింది సామాన్యులే.
ఈ రకం పరిస్థితులు ఉండే దేశంలో ఫాస్టాగ్ అమలు చర్చనీయాంశంగా మారింది. గత రెండేళ్లుగా ఫాస్టాగ్ ను గట్టిగానే అమలు చేస్తూ ఉన్నారు. కార్లను కొనేటప్పుడే వాటికి ఫాస్టాగ్ స్టిక్కర్లను అతికిస్తూ వస్తున్నారు. షోరూమ్ నుంచినే ఫాస్టాగ్ స్టిక్కర్లతో కార్లు డెలివరీ అవుతున్నాయి! రెండేళ్లుగా ఇలాంటి పరిస్థితే ఉన్నా.. ఫాస్టాగ్ ద్వారా మాత్రమే టోల్ వసూళ్ల గురించి ప్రభుత్వం అనేక గడువులు ప్రకటించింది.
అదిగో.. ఇదిగో.. అంటూ ఏడాదిన్నర సమయాన్ని గడిపేశారు. అయితే.. ఫాస్టాగ్ అమలు వరకూ వచ్చే సరికి బోలెడన్ని సమస్యలున్నాయి. ఆ సమస్యలకు కేంద్ర ప్రభుత్వం ఆలోచించిన పరిష్కారం ఫైన్!
ఎంత దారుణం అంటే.. ఫాస్టాగ్ లేకపోతే ఫైన్ అన్నారంటే, తప్పనిసరిగా చేసేందుకు అనుకోవచ్చు! పొరపాటున ఫాస్ట్ టాగ్ లో బ్యాలెన్స్ లేకపోయినా.. రెట్టింపు టోల్ ధర చెల్లించి వెళ్లాలట! ఇదెక్కడి న్యాయం అసలు?
ఒక్కోసారి దేన్నైనా రీచార్జ్ చేసుకోవడం మరిచిపోతూ ఉంటాం. అది మానవ సహజం. ప్రైవేట్ కంపెనీలు, టెలికాం ఆపరేటర్లు, డీటీహెచ్ ఆపరేటర్లు కూడా.. రీచార్జ్ డేట్ దాటిపోతే.. బాబ్బాబూ రీచార్జ్ చేసుకోండి అంటూ బతిమాలుతూ ఉన్నాయి. అంతే కానీ.. మీరు ఈ రోజులోగా రీచార్జ్ చేసుకోకపోతే మీకు పెనాల్టీ, రెట్టింపు ధర చెల్లించి రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.. అంటూ ఏ కార్పొరేట్ సంస్థ కూడా ప్రజలకు షరతులు పెట్టడం లేదు!
లాభం కోసం వ్యాపారం చేసే ప్రైవేట్ సంస్థలు ప్రజలను బతిమాలుకుంటూ ఉన్నాయి. అయితే ప్రజల కోసం పని చేసే ప్రభుత్వ వ్యవస్థలు మాత్రం… మీ ఖాతాలో డబ్బు లేదో, మా ఖాతాకు రెట్టింపు చెల్లించాల్సిందే! అంటూ షరతు పెట్టడం ఎంత వరకూ సమంజసం?
అసలు టోల్ గేట్ వసూళ్లకు లెక్క ఏమిటి? ఏ ప్రాతిపదికన ఇలా సంవత్సరాలకు సంవత్సరాలు ప్రతి 90 కిలోమీటర్లకూ డబ్బులు వసూలు చేస్తున్నారు? ఏ సమాచార హక్కు చట్టం ద్వారా అయినా ప్రభుత్వం ఈ విషయాలపై చెప్పగలదా?
పీపీపీ విధానంలో వేసిన రోడ్ల నిర్వహణ ఖర్చుకు, వాటిపై పెట్టిన పెట్టుబడిలను రాబట్టుకోవడానికి టోల్ విధానాన్ని పెట్టారనుకుంటే.. దానికంటూ ఎక్కడో ఒక చోట పరిమితి ఉండాలి. లక్ష కోట్ల రూపాయలు పెట్టి ఒక జాతీయ రహదారి వేశారనుకుందాం. ఆ రహదారిపై పెట్టిన పెట్టుబడులను టోల్ రూపంలో దండుకున్న తర్వాత అయినా.. ఆ వసూళ్లను ఆపాలి కదా? అలా కదా.. టోల్స్ శాశ్వతం.. అని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తేల్చి చెప్పారు.
పెట్టిన ఖర్చులు వసూలు అయిన రోడ్లలో కూడా టోల్ చార్జీలు తగ్గించే ఆలోచన లేదని, ఏ రోడ్డు మీద అయినా శాశ్వతంగా టోల్ కట్టాల్సిందే అని ఆయన కుండబద్ధలు కొట్టారు. తద్వారా తమ వ్యాపార దృక్పథాన్ని చాటుకున్నారు.
ఏ మాత్రం తార్కికంగా లేని టోల్ వసూళ్లకు ఇప్పుడు ఫాస్టాగ్ ముచ్చట ఒక నిలువు దోపిడీ. ఆ దోపిడీకి సహకరించకపోతే, అందుకు తగ్గట్టుగా డబ్బులు పెట్టుకోకపోతే.. రెట్టింపు సుంకం చెల్లించుకుని.. మరింతగా దోపిడీకి గురవ్వాల్సిందే, పారాహుషార్!