మోదీ మ్యాజిక్‌ పనిచేసిందా? లేదా?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమంటే బిజెపి నాయకులు ఔనని, కాంగ్రెసు నాయకులు లేదనీ చటుక్కున చెప్పేస్తారు. మనం మామూలువాళ్లం కాబట్టి చప్పున చెప్పలేం. అసలు ఫలితాలు వెలువడుతూండగానే కాంగ్రెసు తరఫున వచ్చినవాళ్లు మోదీ ప్రభావం…

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమంటే బిజెపి నాయకులు ఔనని, కాంగ్రెసు నాయకులు లేదనీ చటుక్కున చెప్పేస్తారు. మనం మామూలువాళ్లం కాబట్టి చప్పున చెప్పలేం. అసలు ఫలితాలు వెలువడుతూండగానే కాంగ్రెసు తరఫున వచ్చినవాళ్లు మోదీ ప్రభావం ఏమీ లేదని చెప్పనారంభించారు. ఛత్తీస్‌గఢ్‌లో పోటాపోటీగా ఫలితాలు వస్తున్నంతసేపు, 'ఏమైంది మోదీ ఎఫెక్ట్‌?' అంటూ ఎద్దేవా చేశారు కూడా. చివరకు సందిగ్ధం వదలి 10 సీట్ల  తేడాతో బిజెపి గెలిచాక ఆగారు. పై ప్రశ్నకు సమాధానం వెతికే ముందు ఫలితాల తీరుతెన్నులలో విశేషాలను ఓ సారి పరికిద్దాం.

4 రాష్ట్రాలలోని మొత్తం 508 స్థానాల్లో కాంగ్రెసు 21% సీట్లు, బిజెపి 70% సీట్లు గెలుచుకున్నాయి. 

దేశంలో రెండో అతి పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో 51 జిల్లాలలో 17 జిల్లాలలో కాంగ్రెసు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 16 జిల్లాల్లో ఒక్కో సీటు, 13 జిల్లాలలో రెండేసి సీట్లు గెలిచింది. మొత్తం 230 సీట్లకు అది గెలిచినది 58, (అర్జున్‌ సింగ్‌, దిగ్విజయ్‌ సింగ్‌ల కొడుకులు నెగ్గారు) అంటే బిజెపి కంటె 107 తక్కువ!  బిజెపి ఎమ్మెల్యేలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. 30 మందిలో 10 మంది మంత్రులు ఓడిపోయారు. అయినా మొత్తం మీద బిజెపికి గతంలో కంటె ఎక్కువసీట్లు కట్టబెట్టారు, కారణం ముఖ్యమంత్రిపై ఆరోపణలు లేవు. 2009లో ఉమాభారతి వేరే పార్టీ పెట్టి ఓట్లు చీల్చడంతో బిజెపికి 37% ఓట్లు వచ్చాయి. ఈ సారి ఆమె బిజెపిలో కలవడంతో లాభించి 47% ఓట్లు రాగా కాంగ్రెసుకు 32% నుండి 38% పెరిగాయి. 

రాజస్థాన్‌లో – అశోక్‌ గెహలోత్‌ ప్రభుత్వం మొదటి మూడేళ్లు ప్రజలను పట్టించుకోలేదు. తర్వాత మేల్కొని రెండేళ్లపాటు సంక్షేమపథకాలు చేపట్టినా అవి సరిపోలేదు. మొత్తం 200 స్థానాలుంటే కాంగ్రెసు స్కోరు 96 నుంచి 21కి దిగజారిపోయింది. 12 జిల్లాల్లో ఒక్కటీ గెలవలేదు. 2009లో బిజెపి కంటె 2% ఎక్కువగా 36% ఓట్లతో గెలిచిన కాంగ్రెసు యీసారి 34% తెచ్చుకుంది. బిజెపి 12% ఎక్కువ ఓట్లు తెచ్చుకుని 162 సీట్లు గెలుచుకుంది. గెహలోత్‌ సొంత జిల్లాలో 90% సీట్లు బిజెపి గెలిచింది.
మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు తమకు పెట్టని కోట అని కాంగ్రెసు అనుకుని తన లెక్కలన్నీ ఆ కోణంలో చూస్తుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఆదివాసీ జనాభా ఎక్కువగా వున్నా కాంగ్రెసు మట్టి కరిచింది. ఢిల్లీలో ఎస్సీ కాంగ్రెసు నాయకులు కూడా అనామకుల చేతుల్లో ఓడిపోయారు. రాజస్థాన్‌లో గిరిజన బెల్టులోని 28 స్థానాల్లో 17 బిజెపి గెలిచింది. 70% ముస్లింలున్న కమాన్‌ అసెంబ్లీ స్థానంలో బిజెపి అభ్యర్థి  నటవర్‌ సింగ్‌ కొడుకునే ఓడించాడు.

ఛత్తీస్‌గఢ్‌లో – బిజెపికి గతంలో కంటె ఒకటి తగ్గి 49 సీట్లు వచ్చాయి కానీ 5గురు మంత్రులు ఓడారు. కాంగ్రెసుకు ఒకటి పెరిగి 39 వచ్చాయి. ఇతరులు 13% ఓట్లు పట్టుకుపోగా బిజెపికి 44%, కాంగ్రెసుకు 43% వచ్చాయి. అజిత్‌ జోగి కావాలని కాంగ్రెసు అభ్యర్థులకు వ్యతిరేకంగా తన కాండిడేట్లను పెట్టడం వలననే యితరులకు 13% ఓట్లు వచ్చాయని అంచనా. పెద్ద లీడర్లందరూ ఓడిపోయారు.

ఢిల్లీలో షీలా దీక్షిత్‌ తను డీలా పడడానికి కారణం – కాంగ్రెసు పార్టీ తనకు సహకరించకపోవడమే అని ఆరోపించింది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రెసిడెంట్‌ జెపి అగర్వాల్‌ ఎన్నికలలో ఉత్సాహంగా పాల్గొనలేదని ఆరోపించినా, ఆమె అసలు లక్ష్యం సోనియా, రాహుల్‌లే. ఎందుకంటే సాధారణంగా పార్టీ అధినాయకత్వం ఢిల్లీలో ప్రచారం చేయవలసిన రాష్ట్ర, జాతీయ నాయకులు లిస్టు తయారుచేసి వీరిలో ఎవరిని మీ నియోజకవర్గాల్లో ప్రచారానికి పంపమంటారు? అని అడుగుతారు. వాళ్లలోనుండి అభ్యర్థులు ఎంచుకుంటారు. ఓటర్లలో బెంగాలు నుండి వచ్చినవారు ఎక్కువగా వుంటే బెంగాలీ కాంగ్రెసు లీడరును పంపమని.. యిలా అడుగుతారు. ఈ సారి ఆ కసరత్తు జరగనే లేదు. అభ్యర్థులు తమకు తామే తంటాలు పడవలసి వచ్చింది. తన నియోజకవర్గం నుండి కాంగ్రెసు ఓటర్లున్న కొన్ని ప్రాంతాలను పునర్విభజన పేరుతో పక్క నియోజకవర్గాన్ని తరలించి తన ఓటమికి కారకులయ్యారని, అసెంబ్లీ ఎన్నికలయ్యేదాకా ఆగమని అడిగినా ఆగలేదనీ షీలా ఫిర్యాదు. ''గత ఐదేళ్లగా ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ కాంగ్రెసు కలిసి పనిచేయలేదు'' అని కాంగ్రెసు జనరల్‌ సెక్రటరీ జనార్దన్‌ ద్వివేది అనేశారు.

ఢిల్లీలో కాంగ్రెసు అభ్యర్థులకు పార్టీ ఫండ్స్‌ అందలేదు. 1998లోనే అభ్యర్థికి 25 లక్షల రూ.లు యిచ్చేవారు. ఈ సారి ఏమీ యివ్వలేదు. – ఆప్‌ భయమో ఎందుచేతో! కాంగ్రెసుకు 25% ఓట్లు, ఆప్‌కు 32%, బిజెపికి 34% ఓట్లు వచ్చాయి. సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెసు ఎప్పుడూ తిననంత దెబ్బ తింది. ఇద్దరే యిద్దరు మంత్రులు గెలిచారు. ముఖ్యమంత్రి కూడా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన అరవింద్‌ కేజ్రీవాల్‌ చేతిలో  25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఢిల్లీ విజయంతో ఉత్సాహం పెరిగిన ఆప్‌ (ఆమ్‌ ఆద్మీ పార్టీ) మహారాష్ట్ర యూనిట్‌ వచ్చే ఏడాది మహారాష్ట్రలో పోటీ చేయడానికి నిశ్చయించుకుంది. ''35 జిల్లాలలో 33 జిల్లాలలో మేం చురుగ్గా వున్నాం. చక్కెర ఫ్యాక్టరీల వేలం కుంభకోణం, ఇరిగేషన్‌ కుంభకోణం బయటపెట్టాం.'' అంటోంది.

ఆప్‌ను మధ్యతరగతివారే సమర్థిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఢిల్లీ పరిసరాల ప్రాంతాలలోని మురికివాడలలోని జనమంతా వారిని ఆదరించారు. పోష్‌ ఏరియాల్లో కూడా మురికివాడలుంటాయి. డబ్బున్నవాళ్ల యిళ్లల్లో పనిచేసే వారందరూ వాటిలో నివసిస్తారు. వాళ్లందరూ ఆప్‌కు ఓటేశారు. అందుకే న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో కూడా ఆప్‌ గెలిచింది. ఆప్‌ అభ్యర్థులు తమ వద్దకు రాలేకపోయినా వీరు ఓట్లేశారు. 

ఎన్నికలలో గమనించవలసిన మరో అంశం ఏమిటంటే – కాంగ్రెసును ఓడించడానికి కంకణం కట్టుకున్న ఓటరు ఆ శక్తి బిజెపికి మాత్రమే వుందనుకుని, తమ ఓట్లను యితరులపై వృథా చేయలేదు. అందుకే యితర పార్టీలకు ఢిల్లీలో 4 నుంచి 3కి, మధ్యప్రదేశ్‌లో 16 నుండి 7కి, రాజస్థాన్‌లో 26 నుండి 16కి తగ్గాయి (బియస్పీకి 6 నుంచి3 తగ్గాయి, సంగ్మా పార్టీ 5 గెలిచింది). ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం యిద్దరు గెలిచారు. (వారిలో ఒకరు బియస్పీ)

చివరగా చెప్పాలంటే – ఛత్తీస్‌గఢ్‌లో 12 స్థానాలున్న బస్తర్‌ ప్రాంతంలో కితంసారి బిజెపి 11 స్థానాలు గెలిచింది. కానీ మావోయిస్టుల దాడిలో కాంగ్రెసు నాయకులు చనిపోవడంతో సానుభూతి పవనాలతో యీ సారి అక్కడ జరిగిన మొదటి విడత ఎన్నికలలో కాంగ్రెసుకే ఎక్కువ ఓట్లు పడ్డాయని గ్రహించిన బిజెపి స్థానిక నేతలు మోదీని రప్పించి సభలు ఏర్పాటు చేశారు. కాంగ్రెసువారు అలాటి ప్రయత్నాలు చేయలేదు. రెండో విడతలో బిజెపి పుంజుకుంది. చివరకు కాంగ్రెసుకు 8, బిజెపికి 4 వచ్చాయి.
ఈ ఫలితాలకు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెసు స్వయంకృతాపరాధం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ముఖ్యమంత్రులు అందించిన మంచి పరిపాలన కారణాలు అనవచ్చు. మోదీ ప్రభావం అత్యధికంగా రాజస్థాన్‌లోనే కనబడింది. అక్కడ మోదీ సభలకు చాలా బాగా హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో తక్కువే. ఢిల్లీలో అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆప్‌తో పంచుకోవలసి వచ్చింది. బిజెపికున్న సౌకర్యాలతో పోలిస్తే ఆప్‌ చాలా వెనకబడివున్నా అన్ని సీట్లు గెలిచిందంటే, మోదీ వేవ్‌ వుందని చెప్పలేము. ఎందుకంటే మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో మోదీ సభలకు జనం గొప్పగా రాలేదు. నవంబరు 18 న భోపాల్‌ సభకు 4 వేల మందే వచ్చారు – అక్కడున్న ఎమ్మెల్యేలందరూ బిజెపివారే అయినా! అదే రోజున సాగర్‌లో 400 మంది మాత్రమే హాజరయ్యారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో స్థానిక ముఖ్యమంత్రుల పలుకుబడే బిజెపికి విజయం చేకూర్చింది. 

దీని అర్థం ఏమిటంటే – కాంగ్రెసు పాలిత రాష్ట్రాలలో ప్రజలు విసిగిపోయి వున్నపుడు, ఆప్‌ వంటి గట్టి ప్రత్యామ్నాయం లేకపోతే, మోదీ మ్యాజిక్‌ పనిచేస్తుంది. సమర్థవంతమైన బిజెపి పాలన వున్న రాష్ట్రాలలో మోదీ ప్రచారం సాయపడుతుంది. మోదీ ఎఫెక్టు గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఎన్టీయార్‌ కొటేషన్‌ అరువు తెచ్చుకోవాలి. 'ఒక సినిమా జయాపజయాలను హీరో నిర్ణయించలేడు. సక్సెస్‌ లేదా ఫ్లాప్‌ రేంజ్‌ను ప్రభావితం చేయగలడంతే!' అన్నాడాయన. మామూలుగా చిన్న హీరోతో 5 వారాలు ఆడవలసిన మంచి సినిమా పెద్ద హీరోని పెడితే 8 వారాలాడుతుంది. చిన్న హీరోని పెట్టి తీసిన చెత్త సినిమా 2 కోట్లు నష్టం తెస్తే, పెద్ద హీరోతో అయితే 20 కోట్ల నష్టం తెస్తుంది. మోదీ సొంత రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం కంటె తక్కువ సీట్లు తెచ్చుకున్నారు. కానీ కాంగ్రెసు వ్యతిరేకత కారణంగా ఆయన యితర రాష్ట్రాలలో బలమైన ప్రభావం చూపగలుగుతున్నాడు. మొన్న ఎన్నికలు జరిగిన చోట ప్రాంతీయపార్టీలు లేవు. అవి వున్నచోట మోదీ ప్రభావం ఎలా వుంటుందో తెలియదు. కేంద్రప్రభుత్వాన్ని ఓడించడానికి మోదీ పార్టీకి, రాష్ట్రప్రభుత్వానికి ఓడించడానికి స్థానిక ప్రాంతీయపార్టీకి ఓటేయవచ్చేమో! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

[email protected]