ఎమ్బీయస్‌ : బిజెపి టి-టిడిపి బాట పడుతుందా?

తెలంగాణ బిల్లు పార్లమెంటుకి ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేకుండా వున్నారు. సోనియా కనుసన్నల్లో నడిచిన కాబినెట్‌ చేతిలో వున్నంతకాలం అడ్డదారుల్లో, అడ్డగోలుగా, అడావుడిగా పరుగులు పెట్టించారు. వారి చేతిలో నుండి బయటపడి రాష్ట్రపతి దగ్గరకు…

తెలంగాణ బిల్లు పార్లమెంటుకి ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేకుండా వున్నారు. సోనియా కనుసన్నల్లో నడిచిన కాబినెట్‌ చేతిలో వున్నంతకాలం అడ్డదారుల్లో, అడ్డగోలుగా, అడావుడిగా పరుగులు పెట్టించారు. వారి చేతిలో నుండి బయటపడి రాష్ట్రపతి దగ్గరకు వెళ్లేసరికి స్పీడు బ్రేకర్లు పడసాగాయి. జైరాం రమేష్‌ లెక్క ప్రకారం సోనియా పుట్టినరోజుకే బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చేయాలి. అసలా స్టేటుమెంటు ఎలా యిచ్చాడో నాకు అర్థం కాదు. రాష్ట్రపతి తనకు బిల్లు రాగానే చూడకుండానే పంపించేసినా గవర్నరుకో, స్పీకరు ఆఫీసుకో పంపాలి. స్పీకరు అసెంబ్లీని సమావేశపరుస్తూ అందరికీ కబురు పెట్టాలి. దీనికి హీనపక్షం ఒక్కరోజైనా పట్టదా? అలాటప్పుడు సోమవారం 'అసెంబ్లీకి వస్తుంది' అనడమేమిటి, మహా అయితే గవర్నరుకి చేరుతుంది అనాలి. రాష్ట్రపతి భవన్‌ నుండి బయటకు బుధవారం రాత్రి బయటకు వచ్చింది. మన చీఫ్‌ సెక్రటరీకి డైరక్టుగా వచ్చేసిందని గురువారం తెలుగు పేపర్లు రాశాయి.  కాదు, హోం శాఖకు వెళ్లింది అని ''హిందూ'' రాసింది. చివరకు ఆ మాటే నిజమని గురువారం మధ్యాహ్నానికి తేలింది. తెలుగు పత్రికలు తప్పులు ఎందుకు రాయాలి?

ఉత్తుత్తినే ఊరించవద్దు ప్లీజ్‌…

ఈ సొల్లు కబుర్లే తెలంగాణలో ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. రాయల తెలంగాణ అనగానే యిద్దరు ఆత్మహత్య చేసుకున్నారట. మర్నాటికల్లా తూచ్‌ అన్నారు. ఆ ప్రాణాలు మళ్లీ వచ్చాయా? అలాగే సోమవారం బిల్లు రాలేదు అని యింకో యిద్దరు చేసుకుంటే..? శీతాకాలపు సమావేశాల్లో వచ్చేస్తుంది, జనవరి 1కి తెలంగాణ కల సాకారమవుతుంది.. యిలా కబుర్లు చెపితే ఓహో సంక్రాంతికి యింటికి వెళ్లిన సీమాంధ్రులు మళ్లీ రారన్నమాట అనుకుంటాడు బలహీనమనస్కుడైన తెలంగాణ కుర్రాడు. వాళ్లు మళ్లీ తిరిగివస్తే చావుకి తెగిస్తాడు. ఎందుకీ కబుర్లు? సాధ్యమైనంత త్వరగా చేస్తాం అన్న ఒక్క మాట చాలు కదా, లోక్‌పాల్‌ బిల్లు, మహిళా బిల్లు యిలాటి వాటిల్లో ముహూర్తాలు పెడుతున్నారా? ఇక్కడకి వచ్చేసరికి యిలాటి ప్రేలాపనలు, టి-కాంగ్రెసు నాయకులను సంబరాలు చేసుకోమనడం.. అంతా ఆటలా వుంది.

పార్లమెంటు పేరుకే ప్రారంభమైంది కానీ కార్యకలాపాలు ఏమీ జరగటం లేదు. 2 జి స్కామ్‌ నివేదిక చటుక్కున ఆమోదించేసినందుకు బిజెపి స్పీకర్‌పై ఫయిరవుతోంది. ఆమెపై అవిశ్వాసమంటోంది. సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస ప్రయత్నాలు సఫలమైనా, విఫలమైనా సర్కారును ఓ కుదుపు కుదిపారు. వాళ్లు నష్టనివారణ చర్యలకై సమయం వెచ్చించాల్సి వస్తోంది. సోనియా ఆశించినట్టు ప్రణబ్‌ గుడ్డిగా సంతకం పెట్టలేదు. రాజ్యాంగం ప్రకారం సరిగ్గా వుందా లేదా అని నిపుణులను అడిగారు. బుధవారం నాడు సోనియా స్వయంగా వెళ్లి కలవడం తెలంగాణ బిల్లు గురించే అంటున్నారు. అంటే బిల్లు చూడగానే చటుక్కున ఆమోదించే తరహాలో లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీలో చర్చలు ఏ తీరున సాగుతాయో తెలియదు. ప్రస్తుతరూపంపై తెలంగాణవాదులకూ అభ్యంతరాలున్నాయి. సమైక్యవాదులకు సరేసరి. అసెంబ్లీలో ఓటింగు జరిగినా, జరగకపోయినా చర్చలు జరిగి భిన్నాభిప్రాయాలు రికార్డవుతాయి కదా. పార్లమెంటుకి బిల్లు తిరిగి వెళ్లినపుడు వీటి ఆధారంగా అక్కడ చర్చలు జరుగుతాయి కదా. అప్పుడు బిజెపి ఎలా ప్రవర్తిస్తుంది అన్నదే అతి ముఖ్యం.

ప్రతిపక్షాలను దిగజార్చడమే సోనియా వ్యూహం

టి-బిల్లు పార్లమెంటుకి యిప్పుడే వెళుతుందని అనుకోవడం ఎంతటి అత్యాశో, యిప్పట్లో వెళ్లదని కాని, అసలు వెళ్లదని కాని అనుకోవడం కూడా అత్యాశే. 2013లో వెళ్లకపోతే 2014లో వెళ్లవచ్చు. దీనికోసం ప్రత్యేకసమావేశం ఏర్పరచవచ్చు. సోనియా చాలా పట్టుదలతో వున్నారని అందరికీ తెలుసు. దేనికి ఆ పట్టుదల? తెలంగాణ యివ్వాలనా? లేక తెలంగాణపై తక్కిన పార్టీలు ఆడే నాటకాన్ని బయటపెట్టాలనా? మొదటిదాని కంటె రెండోదే ఆమెకు ఎక్కువ రాజకీయప్రయోజనం కలిగిస్తుంది. కేంద్రప్రభుత్వ అసమర్థతపై ప్రజలకు ఎంత ఆగ్రహం వుందో మొన్న అసెంబ్లీ ఎన్నికలు చాటి చెప్పాయి. అధికధరలు మా కొంపముంచాయని సోనియా స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంటు ఎన్నికలతో బాటు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి కాబట్టి డబుల్‌ ఎఫెక్ట్‌. ఇలాటి పరిస్థితిలో ప్రభుత్వ వ్యతిరేకత వలన ప్రతిపక్షాలు లాభపడతాయి. వాళ్లను దెబ్బకొడితే, సగానికి చీలిస్తే అధికారపక్షం నిలబడుతుంది. 2009లో జరిగినది అదే. అయిదేళ్ల వైయస్‌ పాలనకు వ్యతిరేకంగా వున్న ఓట్లు చీలిపోకూడదని చంద్రబాబు తనకు బొత్తిగా పడని తెరాసతో కూడా జట్టుకట్టి (ఇప్పుడు చూడండి, బాబు, కెసియార్‌ ఎంత ఘోరంగా తిట్టుకుంటున్నారో! 

నాలుగున్నరేళ్ల క్రితం ఒకరినొకరు ఎలా కీర్తించుకున్నారో గుర్తుందా?) మహాకూటమి ఏర్పరచారు. ఏం లాభం? చిరంజీవి కొత్త పార్టీతో ముందుకు వచ్చారు. ఆయన కాంగ్రెసు ఓట్లు మాత్రమే చీలుస్తారని బాబు అనుకుంటే, కాంగ్రెసు, టిడిపి యిద్దరి ఓట్లూ చీల్చాడు. మధ్యలో జెపి లోకసత్తా అంటూ పోటీకి వచ్చి కొన్ని ఓట్లు ఆయనా పట్టుకుపోయాడు. చీలిపోయిన ప్రతిపక్షం వైయస్‌ మళ్లీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. జస్ట్‌ పాస్‌ మార్కులు వేశారని వైయస్సే చెప్పుకున్నారు.

ఇప్పుడు ప్రతిపక్షాలు మూడున్నాయి – టిడిపి, వైకాపా, తెరాస. చిరంజీవిని కలిపేసుకున్నారు కాబట్టి పిఆర్పీ సమస్య లేదు. తెలంగాణ విషయంలో  యీ మూడు పార్టీలు ఛాంపియన్లుగా చూపించుకుంటూ 'మేం యిమ్మనమని చెప్పినా యింకా యివ్వకుండా తాత్సారం చేస్తున్నారేం?' అంటూ కాంగ్రెసును ఛాలెంజ్‌ చేస్తూ వున్నాయి. మీ పని యిలా వుందా అని కాంగ్రెసు జులై 30 ప్రకటన వెలువరించింది. దెబ్బకు వైకాపా తెలంగాణ యూనిట్‌ ఎగిరింది. 2014 ఎన్నికల సమయానికి రాష్ట్రం సమైక్యంగానే వుంటే వైకాపాకు తెలంగాణలో అతి తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి. తెలంగాణ అంశం రావడానికి ముందు అది 20-25% సీట్లు తెచ్చుకునే శక్తిగా వుంది. ఇప్పుడు 10% సీట్లు కూడా తెచ్చుకుంటుందో లేదో. ఇక టిడిపి – తెలంగాణకు కట్టుబడింది అని పేరు తెచ్చుకుని కాస్త పుంజుకుంటున్న సమయంలో యీ ప్రకటన రావడంతో మళ్లీ రెండుకళ్ల, రెండు కొబ్బరిచిప్పల, యిద్దరు పిల్లల సిద్ధాంతానికి తిరిగి రావలసి వచ్చింది. సమైక్యం అని గట్టిగా అనకపోవడం వలన సీమాంధ్రలో వైకాపాతో పోటీ పడలేక, విభజనే అని గట్టిగా అనకపోవడం వలన తెలంగాణలో తెరాసతో పోటీ పడలేక చతికిల పడింది. సీమాంధ్ర టిడిపి నాయకులు సమైక్యం అంటూ కోర్టులో, వీధుల్లో చేస్తున్న పోరాటానికి బాబు ఆశీర్వాదం లేదని ఎవరూ నమ్మరు. తెలంగాణలో ముందే నమ్మరు. అందుకని టి-టిడిపి చప్పబడింది. సర్వేలలో బాబు స్కోరింగ్‌ కిరణ్‌ కంటె వెనకబడిందంటే రెండు పడవల ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలుస్తోంది.

తెలంగాణ ప్రకటనతో తెరాస లాభపడిందా?

ఇక మూడో ప్రతిపక్షమైన తెరాస – ప్రకటన వెలువడేవరకు తెరాస మహా ఉత్సాహంగా అన్ని పార్టీల నుండి నాయకులను తమ పార్టీలో కలుపుకుంటూ దూసుకుపోతోంది. 2014 ఎన్నికలలో 100 అసెంబ్లీ, 15 పార్లమెంటు సీట్లు తెచ్చుకుని తెలంగాణ సాధించే ఎజెండా పెట్టుకుని, కాంగ్రెసు, టిడిపిలను దుయ్యబడుతూ తెలంగాణకు ఏకైక ఛాంపియన్‌గా వెలగడానికి ప్రణాళికలు రచిస్తోంది. ప్రకటన రాగానే మానిఫెస్టోలో ఏం రాయాలో తెలియక బిత్తరపోయింది. పోనీ విలీనం అయిపోదామనుకున్నా కాంగ్రెసు ఆసక్తి కనబరచటం లేదు. అందువలన ప్రతిపక్షంగానే పోరాడాలి. వేటి కోసం? పునర్నిర్మాణం కోసం అనే స్లోగన్‌ ప్రజలకు ఓ పట్టాన బుర్రకెక్కదు. హైదరాబాదుపై ఆంక్షలు, విద్యాలయాల్లో ఎడ్మిషన్లు, ఉద్యోగస్తుల స్థానికత వివాదం, ఆస్తులు అప్పుల పంపకం జనాభా ప్రాతిపదికనా? మరో రకంగానా? యివన్నీ సాంకేతిక విషయాలు. వీటిపై జనాలకు అవగాహన కల్పించి వారిని జాగృతం చేయడం సులభమైన విషయం కాదు. 'మనకో రాష్ట్రం కావాలి' అనేది సులభంగా అర్థమయ్యే నినాదం. ఒకసారి రాష్ట్రమంటూ వచ్చేసిన తర్వాత దానికి గ్లామర్‌ తగ్గిపోతుంది. అలాగే తెలంగాణలో అందరి కంటె తెరాసకు ఎక్కువ సీట్లు వచ్చినా, ప్రకటనకు ముందు రాదగినన్ని రావు. ఆ మేరకు కాంగ్రెసు లక్ష్యం నెరవేరినట్లే.

ప్రతిపక్షాల బలాన్ని హరించే క్రమంలో కాంగ్రెసు బలం కూడా క్షీణించదా? అంటే తప్పక క్షీణిస్తుంది. కానీ ఎంతోకొంత మిగులుతుంది. సీమాంధ్ర ఎంపీల సంగతే చూడండి – అవిశ్వాసం పెట్టినవారి సంఖ్య కంటె పెట్టనివారి సంఖ్యే ఎక్కువ కదా. అసెంబ్లీలో కూడా సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ సమైక్యానికే ఓటేస్తారన్న గ్యారంటీ ఏముంది? ఆనం వివేకానందరెడ్డిలా హాస్యం చిందించేవారు సమైక్యం అంటూనే 'అధిష్టానం చెప్పినట్లు చేయాలి కదా' అనేస్తారు. చాప చినిగినా, చదరమంత మిగులుతుందని వాళ్ల ఆశ. మొన్నటిదాకా తెలంగాణ మంత్రులు యిలాగే నడుచుకున్నారు. ఇప్పుడు సీమాంధ్ర మంత్రులు ఆ బాటలో నడుస్తున్నారు. కాంగ్రెసు చెట్టు పేరు చెప్పుకుని చెల్లుబాటు అవుదామనుకునే నాయకులు మన రాష్ట్రంలో పుష్కలంగా వున్నారు. ఓటర్లకు కూడా సోనియాపై, కాంగ్రెసుపై ఎంత కోపం వున్నా చివరకు ఎటు ఓటేస్తారో తెలియదు. అప్పటికి ఏ హామీలు గుప్పిస్తారో, ఏం మాయ చేస్తారో తెలియదు. 

పార్లమెంటులో బిజెపిని ఎక్స్‌పోజ్‌ చేయాలిగా…

అందువలన ఆంధ్రలో దిబ్బయిపోతామన్న భయం పక్కన బెట్టి, అసెంబ్లీ మొహానికి ఓ సారి బిల్లు చూపించేసి, కాంగ్రెసు పార్లమెంటుకు తెప్పించి అక్కడ బిల్లు ప్రవేశపెడుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ జాతీయస్థాయిలో ప్రతిపక్షమైన బిజెపిని ఎక్స్‌పోజ్‌ చేయవలసిన అవసరం వుంది. బిజెపికి రాష్ట్రస్థాయిలో బలం లేనపుడు తెలంగాణ బిల్లు ద్వారా దాన్ని యిరకాటంలో పెట్టడం దేనికి? అనుకోవచ్చు. ప్రస్తుతం సీమాంధ్రలో సోనియాపై వున్న ఆగ్రహం, ఆమెకు బుద్ధి చెప్పగల మోదీపై వ్యామోహంగా మారితే ఆంధ్రలో నాలుగైదు సీట్లు, తెలంగాణలో రెండు, మూడు సీట్లు బిజెపి గెలుచుకోవచ్చు. అది నివారించాలంటే బిజెపిని కూడా యిరుకున పెట్టాలి. తెలంగాణకై మేం మద్దతు యిస్తున్నాం అని బిజెపి స్పష్టంగా చెపుతున్నపుడు యీ బిల్లు విషయంలో దానికి వచ్చే యిబ్బంది ఏముంది? ఉంది. ఎందుకంటే యీ బిల్లు సీమాంధ్రులకు పూర్తి వ్యతిరేకంగా వుంది. వాళ్లు అడిగిన ఒక్క కోరికా నెరవేరలేదు. ఏవో కొన్ని అరకొర హామీలు తప్ప వారికి దక్కినది తక్కువ, పోగొట్టుకున్నది ఎక్కువ. సీమాంధ్రులను అసంతృప్తి పరచి, తెలంగాణ యిప్పించడం పార్టీకి శ్రేయస్కరం కాదని మోదీ ఆలోచన. హైదరాబాదు సభలోనే ఆయన ఆ విషయం చాటి చెప్పాడు. మోదీ వచ్చాకనే ఆంధ్రలో బిజెపి యూనిట్‌ కాస్త యాక్టివ్‌ అయింది. 'భద్రాచలం మాది' వంటి ఉద్యమాలు చేసింది, రాష్ట్ర బిజెపి నాయకత్వం పూర్తిగా తెలంగాణ నాయకుల చేతిలో వుంది కాబట్టి వారిని ధిక్కరించి, ఢిల్లీ వెళ్లి 'హైదరాబాదులోని కేంద్ర సంస్థల్లో సగం సీమాంధ్రకు తరలించాలి' వంటి డిమాండ్లు వినిపించింది. 

రాష్ట్ర బిజెపి నాయకుల నడిగితే అబ్బే అదేం లేదు అనే అంటారు, ఎందుకంటే వాళ్లంతా తెలంగాణ వారే. ఈ మధ్యే సీమాంధ్ర బిజెపి నాయకులంటూ ఒకళ్లిద్దరు ప్రకటనలలో, టీవీలో చర్చలలో కనబడుతున్నారు. అంతిమంగా జాతీయ నాయకులు ఎటు మొగ్గితే అటు మొగ్గవలసిన వారే వీరంతా! వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరాటం చేద్దామని స్థానిక నాయకత్వం వూహూ వుబలాటపడిపోతూ వుంటే కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో ఒక ముఖ్యనాయకుడి చేత రిపోర్టు తెప్పించుకుంది. అతను చెప్పినదిది – 'తెలంగాణలో తెలంగాణ ఉద్యమప్రభావం వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలతో బాటు మెదక్‌, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బలంగా వుంది. మెహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాదు సిటీ, ఆదిలాబాద్‌ జిల్లాలలో చాలా భాగం, నిజామాబాద్‌లో కొంత భాగంలో సెంటిమెంటు బాగా తక్కువగా వుంది. మొత్తం 119 సీట్లలో యివి 60-70 సీట్లు వుంటాయి. హైదరాబాదు పరిసరాల్లో 34 సీట్లున్నాయి. వీటన్నిటిలో ఆంధ్రప్రాంతం నుండి వచ్చి స్థిరపడిన వారి జనాభా గణనీయంగా వుంది. 2009 ఎన్నికలలో గ్రేటర్‌ హైదరాబాదు పరిధిలోని 25 స్థానాలలో 24 వాటిల్లో టిడిపి రెండో స్థానంలో వుంది. ఈ సారి ఆంధ్ర నుండి వచ్చి స్థిరపడినవారు భయంచేత టిడిపికి ఓట్లు వేసే అవకాశం వుంది. తక్కిన 35 సీట్లలో తెలంగాణ సెంటిమెంటు తక్కువగా వుంది. 2012 ఉపయెన్నికలో బిజెపి మెహబూబ్‌నగర్‌లో గెలిచినా పరకాలకు వచ్చేసరికి 9 వేలు మాత్రం తెచ్చుకుంది. టిడిపికి 31 వేల ఓట్లు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో టిడిపితో పొత్తు పెట్టుకోవడం వలన బిజెపి లాభపడి, 2020 నాటికైనా స్వతంత్రంగా బలం పుంజుకుంటుంది. తెరాసతో బిజెపి పొత్తు కుదరడం అసాధ్యం. వారు కాంగ్రెసు వైపే చూస్తున్నారు. 

వంతపాడితే ఆంధ్రలో మంగళం పాడినట్లే

ఈ బిల్లును యథాతథంగా పార్లమెంటులో పాస్‌ చేయిద్దామని కాంగ్రెసు ప్రయత్నించినపుడు బిజెపి వంతపాడితే అదీ సీమాంధ్రుల ఆగ్రహానికి గురవుతుంది. అంతేకాదు, తెలంగాణవాదుల ఆగ్రహానికి కూడా… ఆంక్షల విషయంలో తెరాస కాంగ్రెసును, బిజెపిని సమానదోషులుగా చూపి బిజెపి తెలంగాణలో దక్కే ఆ కాస్త ప్రయోజనం కూడా దక్కకుండా చేస్తుంది. అందువలన బిజెపి సవరణలు ప్రతిపాదించక తప్పదు. ఎలాటి సవరణలు సూచిస్తుందో యిప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణల మధ్య కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపంలా తయారయింది. 'తెలంగాణ యిమ్మన్నాం కానీ సీమాంధ్రకు అన్యాయం చేయమనలేదు' అంటూ బిజెపి ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసి మంత్రుల ముఠాకు నివేదిక యిస్తామంది. ఆ నివేదిక తయారైందో లేదో తెలియదు. బహిర్గతం కాలేదు. బిల్లు ముసాయిదా బయటకు వచ్చాక కూడా అది ఏకపక్షంగా వుంది, ఆంధ్రకు కాస్తయినా విదల్చండి అనడానికి కూడా ధైర్యం చాలటం లేదు. అదే సమయంలో శభాష్‌, మేం దీనికి పూర్తిగా మద్దతు యిస్తాం అని జాతీయ నాయకులు అనటమూ లేదు.

ఈ విషయంలో టిడిపిని కాపీ కొడుతోంది. పార్లమెంటులో చర్చకు వచ్చినపుడు సీమాంధ్ర టిడిపి ఎంపీలు ఎలాగూ సమైక్యం అంటారు. టి-టిడిపివారు మాత్రం విభజన కావాలి అంటూనే బిల్లుకు అనుకూలంగా ఓటు వేయకుండా 'ఇది కాదు పద్ధతి. సమన్యాయం జరగలేదు' అని వాదిస్తారు. టిడిపి 'సమన్యాయం', 'సమన్యాయం' అంటుంది తప్ప అదేమిటో చెప్పదు. ఎలా వుండాలో చెప్పదు. చెప్పండి అంటే 'మాకు చేతకాదు అని సోనియా దణ్ణం పెట్టి దిగిపోయి చంద్రబాబుకి అధికారం అప్పగిస్తే అప్పుడు చెపుతాం' అంటున్నారు టిడిపి నాయకులు. బిజెపికి కూడా రేపు పార్లమెంటులో అదే చెప్పవచ్చు. 'ఇది కాదు విభజించే విధానం. మీరు ఒక్క పనీ సరిగ్గా చేయలేరు. మీరు దిగిపోండి. మేం అందర్నీ మెప్పించేట్లా విభజించి చూపిస్తాం' అనవచ్చు.పై నివేదిక ప్రకారం చూస్తే బిజెపి టిడిపితో పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికలలో పోటీ చేసే అవకాశం వుంది. టిడిపికి కావలసినదీ అదే. సమన్యాయం జరగలేదనో ఏదో కారణం చెప్పి బిజెపి తెలంగాణ బిల్లుకు అవరోధం కల్పించగలిగితే సీమాంధ్రలో బిజెపికి ఆదరం పెరుగుతుంది. టిడిపి తోడయితే గణనీయమైన సంఖ్యలో సీట్లు సంపాదిస్తుంది. ప్రస్తుతం వున్న జీరో నుంచి నాలుగు పార్లమెంటు సీట్లు వచ్చినా మేలే కదా! అలా కాకుండా గుడ్డిగా బిల్లును సమర్థించినా తెలంగాణలో అది తెచ్చుకునేది అన్ని వుండవు. తెరాస, కాంగ్రెస్‌, కొద్దో గొప్పో  గెలిచే టిడిపిల తర్వాతనే దాని స్థానం!

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

[email protected]