సాధారణంగా తాజ్‌మహల్‌తో పోలిక వస్తూ వుంటుంది. నీ పట్ల నా ప్రేమ నిరూపించుకోవడానికి తాజ్‌మహల్‌ను మించిన కట్టడం కట్టి చూపిస్తా, – నన్ను చక్రవర్తిని చేస్తే…! అంటాడు ప్రేమికుడు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని సత్నామీ కులస్తులు మాత్రం కుతుబ్ మీనార్ కంటె ఎత్తయిన స్తంభం కావాలని పంతం పడుతున్నారు. సత్నామీలు దళితులలో ఒక వర్గం. వారి ఆధ్యాత్మిక గురువు గురు ఘాసీదాస్ మరణించి చాలాకాలమైంది. ఆయన పేర మఠాలు వెలిశాయి. వాళ్ల ఆరాధనకు గుర్తుగా జైత్‌ఖంభ్ (జయస్తంభం) కట్టడం ఆనవాయితీ. అలాటి స్తంభాలు సత్నామీలు బహుళంగా వున్న ప్రాంతాల్లో అనేకం కనబడతాయి. 2000 సం||రంలో మధ్యప్రదేశ్‌నుండి విడివడిన ఛత్తీస్‌గఢ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన అమిత్ జోగి సత్నామీ. ఈ గురువు అనుయాయి. ''మన ఘనత చాటేందుకు నేను ప్రభుత్వ ఖర్చుతో గిరోద్‌పురిలో కుతుబ్ మీనార్ కంటె రెట్టింపు ఎత్తున్న జైత్‌ఖంభ్‌ను కడతాను. ఛత్తీస్‌గఢ్‌లో ఎక్కణ్నుంచి చూసినా అది కనబడేట్లా చేస్తాను.'' అని అజిత్ 2002లో ప్రకటించాడు. అయితే 2003 అసెంబ్లీ ఎన్నికలలో అతను ఓడిపోయి బిజెపి అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టు మూలపడింది.
రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలలో 80% వున్న సత్నామీల ఓట్లు కావాలంటే యీ జైత్‌ఖంభ్ కట్టాల్సిందే అనుకున్న బిజెపి ప్రభుత్వం 2008 ఎన్నికలకు ఏడాది ముందు దీని నిర్మాణం చేపట్టింది. 20 అంతస్తులతో 2012కి పూర్తయింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ''అన్నప్రకారం కట్టాం కదా, మాకు ఓట్లేయండి'' అంటున్నారు బిజెపి వారు. కానీ సత్నామీలు సంతోషంగా లేరు. ''అజిత్ కుతుబ్ మీనార్‌కు రెట్టింపు ఎత్తు స్తంభం కడతానన్నాడు. ఇది దాని కంటె కాస్త ఎత్తుందంతే. అది 72.5 మీటర్లయితే, యిది 77 మీటర్ల ఎత్తు.'' అని ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే తడిసి మోపెడైందని బిజెపి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ బాధ. దీనికి బజెట్ వేసుకున్నది 15 కోట్లు. చివరకు చూస్తే మూడున్నర రెట్లయింది. అసెంబ్లీలో దీని గురించి పెద్ద గొడవైంది. అవినీతి జరిగిందని, నిర్మాణ నాణ్యత బాగా లేదని అనేక ఆరోపణలు వచ్చాయి. 77 మీటర్లకే యింత గొడవైతే ఇక 145 మీటర్లయితే ఎంత గొడవయ్యేదో వూహించండి.
మధ్యప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా ప్రకారం వారికి 16% రిజర్వేషన్ వుండేది. రాష్ట్రం విడిపోయాక జనాభా నిష్పత్తి ప్రకారం అది 12%కి తగ్గించేశారు. అబ్బే అలా ఒప్పుకోం, మాకు 16% వుండాల్సిందే అని సత్నామీలు ఆందోళన చేస్తున్నారు. (ఆంధ్ర, తెలంగాణ విడిపోయాక దళితుల రిజర్వేషన్లలో మార్పులు వస్తాయేమో చూడాలి). రాజ్యాంగం ప్రకారమే యీ నిష్పత్తి వుంటుంది కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరు. కానీ సత్నామీలు అదేమీ వినడం లేదు. ''మాకు 16% రిజర్వేషన్ యిచ్చేదాకా యీ టవర్‌ను ప్రారంభించడానికి ఒప్పుకోం.'' అంటున్నారు. అందువలన ఏడాది క్రితమే అది పూర్తయినా యిప్పటిదాకా ప్రారంభోత్సవం కాలేదు. 51 కోట్ల పెట్టుబడి వృథాయే. వీళ్ల అసంతృప్తిని సొమ్ము చేసుకోవడానికి అజిత్ జోగి ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ''ఇది సత్నామీల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మా కాంగ్రెసును గెలిపిస్తే ఎత్తు పెంచుతాం, రిజర్వేషన్ కోటా పెంచుతాం'' అని వాగ్దానాలు చేస్తున్నాడు.
– ఎమ్బీయస్ ప్రసాద్