ఇందిరా గాంధీ కాలంలో యిలాగే జరిగిందా? అంతా ఆవిడ మాట మీద జరిగేది. జరగకపోతే ఆవిడ వెంటనే రియాక్టయేది. సంబంధిత వ్యక్తులను పిలిచి మాట్లాడేది. అవసరమైతే ఆవిడే వెళ్లేది. ఉదాహరణకు 1969 విభజనోద్యమం జరిగినపుడు ఆవిడ రహస్యంగా హైదరాబాదుకు మెరుపు పర్యటన జరిపి నాయకులను పిలిపించి, సంగతేమిటని అడిగింది. (తర్వాత పేపర్లో వచ్చింది). 1972 విభజనోద్యమం జరిగినపుడు అందర్నీ ఢిల్లీకి రప్పించి ఒక్కచోట కూర్చోబెట్టి చర్చించి సమస్యలకు పరిష్కారం కనిపెట్టింది. ఇప్పుడీ సోనియా – సోనియా ఎవరికి ఎప్పుడు ఎంతసేపు ఎపాయింట్మెంట్ యిస్తుందో తెలియదు. ఇచ్చాక ఏమీ మాట్లాడదు, వినేసి వూరుకుంటుంది. ఆవిడ మనసులో మాట ఏమిటో తెలియదు. వేర్వేరు అభిప్రాయాలు చెప్పినవారిని ఒకేసారి ఒకేచోట కూర్చోబెట్టి భేదాభిప్రాయాలను సార్ట్ ఔట్ చేయదు. ఏకాంత సేవలా ప్రతీ వారూ విడిగా ఆ దేవత వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకోవడం, ఆవిడకు అర్థమయిందో లేదో, అసలా సబ్జక్టు తెలుసో లేదో, ఆమోదించిందో లేదో తెలియక జుట్టు పీక్కోవడం.
ఇందిరా గాంధీ అయితే యీ దేశపు బిడ్డ, తాతల కాలం నాటి నుండి యింట్లో రాజకీయవాతావరణమే. మరి సోనియాది యీ దేశం కాదు, యిక్కడి వ్యవహారాలపై చాలాకాలం దాకా యింట్రస్టు లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో భర్త ప్రధాని అయ్యాక అతని రాజకీయాల్లోకి ఆమె తలదూర్చలేదు. ఇల్లు, పిల్లలు చూసుకుంది. తన ఇటాలియన్ స్నేహితులకు వ్యాపారాలకు సహకరించింది. అనుకోకుండా భర్త పోవడంతో హతాశురాలై అన్నీ వదిలేసి ప్రశాంతంగా వుందామనుకుంది. అయితే పివి అంటే పడని కాంగ్రెసువారు ఆమెను సతాయించి, రాజకీయాల్లోకి లాక్కుని వచ్చారు. వద్దుమొర్రో అంటూనే ఆమె కాంగ్రెసు సారథ్యం వహించింది. లోకసభ ఎంపీగా ఎన్నికయి కూడా ప్రధాని బాధ్యత నిర్వర్తించలేనంటూ మన్మోహన్‌కు అప్పగించింది. కుమార్తె ప్రేమవివాహం చేసుకుంది. అల్లుడు ఆశపోతు. అనేక ఆర్థికనేరాల్లో చిక్కుకుని తలకాయనొప్పి తెచ్చిపెడుతున్నాడు. కొడుకు చూడబోతే తండ్రి వారసత్వం నిలిపేట్టు లేడు. రాజకీయాలను తప్పనిసరి తద్దినంగా చూస్తున్నాడు. అప్పుడప్పుడు కనబడడం, ఎమోషనల్‌గా ఏదో మాట్లాడడం, మాయమై పోవడం. అతను ఎక్కడికి వెళితే అక్కడ పరాజయం తప్పదన్నట్టు తయారైంది వ్యవహారం. ఇవన్నీ చాలనట్టు సోనియాకు తీవ్ర అనారోగ్యం దాపురించింది.
ఇలాటి పరిస్థితిలో ఆవిడ ఇండియా హిస్టరీ, జాగ్రఫీ ఏం చదువుతుంది? పోలవరం, భద్రాచలం, మునగాల..కృష్ణా, తుంగభద్ర, నెట్టెంపాడు… అంటే ఆవిడ బుర్రకేం ఎక్కుతుంది? అసలా పేర్లే నోరు తిరగవు ఆవిడకు. మనవాళ్లు వెళ్లి యిన్ని టిఎంసి నీళ్లు దోచుకున్నారు, అన్ని టిఎంసిలు దాచుకున్నారు అంటే ఆవిడ చదివిన అత్తెసరు చదువుకి అంతటి టెక్నికల్ విషయాలు తలలో దూరతాయా? కొడుకుని అడిగి తెలుసుకుందామా అంటే అతని చదువూ అంతంతమాత్రమే! రాజకీయ నాయకులందరికీ చదువు రాదు. సాంకేతిక విద్యపై అవగాహన వుండదు. కానీ వాళ్లు ప్రజల్లో తిరుగుతారు. వాళ్ల కష్టసుఖాలు తెలుసుకుంటారు. ఆ విధంగా వీళ్లకేదో చేయాలన్న తపన బయలుదేరుతుంది. సోనియా, రాహుల్‌లకు అలాటి ఫీలింగ్సే లేవు. కాంగ్రెసుకు పెట్టనికోటగా వుండి, యుపిఏ 2 నిలబడడానికి కారణభూతమైన మన రాష్ట్రం నాలుగు నెలలుగా అల్లకల్లోలంగా వుంది. వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఉద్యోగస్తులు నెలల తరబడి సమ్మె చేశారు. ప్రజాజీవనం స్తంభించింది. గతంలో తెలంగాణలో సకలజనుల సమ్మె జరిగింది. అప్పుడు కానీ, యిప్పుడు కానీ యీ తల్లీకొడుకులు తొంగి చూశారా? మీకేం ఫర్వాలేదు, మేం ఉన్నాం అంటూ అనునయంగా ఒక్కమాట అన్నారా? తుపాన్లు వచ్చి తీవ్ర నష్టం వాటిల్లింది. వచ్చి ఓదార్చారా? ఓ ప్రకటన చేశారా? మీరు ఏమై పోయినా ఫర్వాలేదు, మా దర్బారు మేం నడుపుకుంటాం అన్నట్టు కదలకుండా, మెదలకుండా కూర్చున్నారు.
ఇక చుట్టూ వున్న వందిమాగధగణం ఏదో ఒక పని చేస్తున్నట్టు కనబడాలి కాబట్టి ఉత్తుత్తి స్టేటుమెంట్లు యిచ్చేస్తున్నారు. ఈ జయరాం రమేష్ చూడండి, సోమవారం నాడు అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చేస్తుందని పెద్ద స్టేటుమెంటు పడేశాడు. అంటే రాష్ట్రపతి గారు బెంగాల్ పర్యటన నుండి వచ్చీ రాగానే కాళ్లూ, చేతులూ కూడా కడుక్కోకుండా, కళ్లు మూసుకుని తెలంగాణ బిల్లుపై సంతకం పెట్టేసి పోస్టుబాక్సులో పడేసి వస్తారనుకోవాలా? '70 పేజీల బిల్లు ముసాయిదాను కాబినెట్ సమావేశంలో టేబుల్ ఐటంగా పెట్టారేమిటి? అసలు చదవాలా వద్దా? చదవందే మా అభిప్రాయం ఏం చెప్తాం?' అని సీమాంధ్ర కాబినెట్ మంత్రులు మొత్తుకుంటే 'మీ మొహం మీరు చదివేదేమిటి, చెప్పేదేమిటి? మీ బదులు మేమే ఆలోచించేశాం, మీరేం చెప్పినా మేం వినంగాక వినం, మా అభిప్రాయం మార్చుకోం. మీరు చదవడం వేస్టు' అని చిదంబరం దబాయించేసినట్టు జైరాం రమేష్ రాష్ట్రపతిని దబాయించేద్దా మనుకున్నాడా? అసలు యీ జైరాం రమేష్ యింత మేధావి రూపెత్తడం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. తనకు తెలియని విషయం లేదన్నట్టు మాట్లాడతాడు. గతంలో మణి శంకర అయ్యర్ యిలాగే వుండేవాడు. ఇప్పుడు ఎక్కడో మూలపడి వున్నాడు.
ఈ జైరాం నదీజలాల పంపిణీ గురించి మనకు లెక్చర్లు యిచ్చేబదులు కావేరీ జలాల గురించి తన రాష్ట్రానికి, తమిళనాడుకి జరిగే వివాదాన్ని పరిష్కరించమనండి చాలు. శ్రీవారికి పోలవరం అంటే యిష్టం లేదట. గిరిజనుల పాకలు మునిగిపోతాయట. మునిగిపోతే వేరే చోట ఆవాసం కల్పిస్తారు, కల్పించాలి, కల్పించేట్లు చేయాలి. రోడ్డు వేసినా, ఫ్యాక్టరీ కట్టినా ఎవరో ఒకళ్లు అంతకుముందు అక్కడ వున్నవాళ్లని లేవగొట్టక తప్పదు. వాళ్లకు నష్టపరిహారం యివ్వకతప్పదు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ల జీవితాలు మెరుగుపడతాయి కూడా! గిరిజనుల విషయంలో – వాళ్లలో చదువుసంధ్యలు తక్కువ కాబట్టి డబ్బు యిస్తే దుర్వ్యయం చేస్తారన్న భయంతో స్థలానికి స్థలం యివ్వాలని రూలుంది. ఆ బాధ్యత నిర్వర్తిస్తే తప్ప పనులు చేస్తే తప్ప రెండవ విడత నిధులు యివ్వం అని కేంద్రం పట్టుబడితే తప్పు లేదు. కానీ ఆ ప్రాజెక్టు డిజైన్ మార్చాలి అనడానికి యీయనెవడు? ఎందరో నిపుణులు చర్చించి ఫైనలైజ్ చేసి వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టాక యిప్పుడు అదేదో సినిమాలో సుత్తి వేలులాగ 'నీ ఫేసు నాకు నచ్చలేదు' అంటే అదో కారణమా? ఎప్పుడో శాంక్షన్ అయిన పోలవరం, దుగ్గరాజపట్నం వంటి ప్రాజెక్టులను యిప్పుడు మళ్లీ ప్రకటిస్తూ అదేదో సీమాంధ్రులకు ఫేవర్ చేస్తున్నట్లు నటించడం చూస్తూంటే మండుతోంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2013)