‘‘అటల్ బిహారీ వాజపేయిని నేనే ప్రధానమంత్రిని చేశాను.. అబ్దుల్ కలాం ను నేనే రాష్ట్రపతిని చేశాను..’’ వంటి మాటలు ఎక్కడ వినిపించినాసరే.. మనకు ముందుగా గుర్తుకువచ్చే పేరు నారా చంద్రబాబునాయుడు.
ఎదుటివాళ్లు నవ్వుకుంటారనే భయం, సంకోచం కూడా లేకుండా ఆయన ఇప్పటికీ అలాంటి డాంబికాల మాటలు బోలెడు పలుకుతూ ఉంటారు. ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. అదే రేంజిలో పవన్ కూడా డబ్బా కొట్టుకుంటున్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా బలమైన నాయకత్వం కావాలని తాను కోరుకున్నానని, అదే సమయంలో మోడీ నాయకత్వం వచ్చిందని పవన్ చెబుతున్నారు.
మోడీజీ నాయకత్వంలో దేశం మరింతగా బలోపేతం కావడానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తానని జనసేన తరఫున చెప్పామంటూ ఆయన ఢిల్లీలో సెలవిచ్చారు. ఇంతకూ జనసేనకు ఎంత బలం ఉన్నది గనుక.. ఆయన ఏం చేయగలరు గనుక.. మోడీని మళ్లీ ప్రధాని చేస్తానని అనగలుగుతున్నారో అర్థం కావడం లేదు!
ఇలాంటి గప్పాలు కొట్టుకోవడంలో చంద్రబాబునాయుడు పేరుమోశారు. ఆయన మీద ఈ విషయంలో అనేకానేక సెటైర్లు కూడా ఉన్నాయి. బిల్ గేట్స్ కు కంప్యూటర్ చంద్రబాబే నేర్పించారని, బిల్ క్లింటన్ ను చంద్రబాబే అమెరికా అధ్యక్షుడు చేశారని ఆయన మీద జోకులు వేస్తుంటారు. ఆయన మాటలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. భారతదేశానికి తానే ఐటీని పరిచయం చేశాను అన్నట్టుగా ఆయన చెబుతుంటారు. హైదరాబాదు నగరం ఇప్పుడిలా ఉన్నదంటే.. కేవలం తాను చేసిన కృషి మాత్రమే అని కూడా అంటుంటారు. ఇప్పుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ చెబుతున్న మాటలు కూడా అలాగే ఉన్నాయి.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు. బిజెపి పరిస్థితి కూడా రాష్ట్రంలో కనాగష్టంగా ఉంది. ఈ ఇద్దరూ కలిసినా సరే.. కనీసం ఒక్క ఎంపీసీటునైనా దక్కించుకోగలరని అనుకోవడం భ్రమ. నేను ఎన్డీయేలో భాగస్వామిని, నాకు మోడీ, అమిత్ షాలు ఎంతో సన్నిహితులు అని చెప్పుకుంటూ తిరగడమే తప్ప.. పవన్ చేయగల మరొక పని లేదు.
ఎన్డీయే మరింత బలోపేతం కావడానికి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తానని సెలవిస్తున్న ఈ జనసేనాని.. మొన్నటికి మొన్న కర్ణాటక ఎన్నికల్లో ఏం చేశారు? మనకు పొరుగునే ఉన్న రాష్ట్రం కావడంతో పాటు తెలుగు వారు కూడా అధికంగా ఉండే ప్రాంతం.. పవన్ కల్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ కూడా అధికం కావడంతో.. ఆయనను అక్కడ ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా కమలదళం ఆహ్వానించినా కూడా పవన్ అటువైపు వెళ్లలేదు.
ఇంక ఆయన ఎన్డీయే విజయానికి తన తోడ్పాటు ఇస్తారని నమ్మడం ఎలాగ? తన సొంత ప్రయోజనాలకు ఎన్డీయేను వాడుకోవడం తప్ప సహకరిస్తారని అనుకోవడం ఎలాగ? అదే పవన్ కల్యాణ్ అదివరకటి ఎన్నికల్లో తనకు ఏమాత్రం పార్టీపరమైన సంబంధం లేకపోయినా.. కొందరు వ్యక్తుల కోసం కర్ణాటక ఎన్నికల బరిలోకి వెళ్లి ముమ్మర ప్రచారం నిర్వహించారు.
అందుకు ఆయన ప్యాకేజీలు పుచ్చుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ.. భాగస్వామి ఎన్డీయేకోసం వెళ్లలేదు. ఇలాంటి నేత మోడీని మళ్లీ పీఎం చేసేస్తానని అనడం కామెడీగా ఉందని ప్రజలు ఎద్దేవాచేస్తున్నారు.