తెలుగుజాతి అన్నగా పరిగణించిన నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అనేది కేవలం నందమూరి కుటుంబ సభ్యుల చేతుల్లో మాత్రమే ఉండాలనే డిమాండ్ ఇప్పుడు కొత్తగా పుట్టినది కాదు. అన్న ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి.. చంద్రబాబు నాయుడు పార్టీ మీద పెత్తనాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారాన్ని హస్తగతం చేసుకున్న తొలినాళ్ల నుంచి కూడా వినిపిస్తూనే ఉంది.
నందమూరి కుటుంబం చేతుల్లో మాత్రమే పార్టీ పగ్గాలు ఉండాలనే డిమాండ్ బలంగా వినిపించినా పట్టించుకోనందువల్లనే.. వెన్నుపోటుకు చంద్రబాబుతో చేయి కలిపిన హరికృష్ణ తర్వాత విభేదించి.. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అంత పురాతనమైన పార్టీ అభిమానుల సహేతుకమైన డిమాండ్.. ఇప్పుడు మరొకసారి తెరమీదకు వచ్చేసరికి.. చంద్రబాబు తైనాతీలు, చినబాబు భజన చేసేవాళ్లు ఒక్కసారిగా కంగారుపడుతున్నారు.
ప్రకాశం జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సాగుతున్న సమయంలో జిల్లాలో పలుచోట్ల తెలుగుదేశం రంగులతో, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో వెలిసిన ఫోటోలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ‘‘నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్, అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే’’ అనే నినాదాలతో రాత్రికి రాత్రే ఫ్లెక్సిలు వెలిశాయి.
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వాడుకుని, తర్వాత పూర్తిగా పక్కన పెట్టేసిన చంద్రబాబు పట్ల తెలుగుదేశంలోని కమ్మ వారిలోనే చాలా మందికి విముఖత ఉంది. కుల పోలరైజేషన్ తో పార్టీలు ఏర్పడుతున్నప్పుడు.. వేరే గతిలేక మాత్రమే.. కమ్మ వారంతా తెలుగుదేశాన్ని సమర్థిస్తున్నారు.
అయితే ఇప్పటికీ వారిలో చాలా మందికి పార్టీకి నందమూరి కుటుంబం సారథ్యం వహించాలనే కోరిక ఉంది. ఆల్రెడీ చంద్రబాబుతో వియ్యమందిన బాలకృష్ణ అంత సీరియస్ గా రాజకీయాలను పట్టించుకునే నాయకుడు కాదు. ఇక వారందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఆశాదీపం. అందుకే కాబోలు.. ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఫ్లెక్సిలు వేశారు. ఇది పార్టీలోని లోకేష్ వ్యతిరేక వర్గం పని అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే.. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాత్రం.. ఈ పాపాన్ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో వేసేందుకు కుటిలయత్నం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వ్యూహాల పరంగా సేవలందిస్తున్న సంస్థ ఐ-ప్యాక్ మీదకు ఈ పాపం నెట్టేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు ప్రణీత్ రెడ్డి తన అనుచరులతో కలిసి.. ఐప్యాక్ సహకారంతో ఈ ఫ్లెక్సిలను ఏర్పాటుచేయించినట్లు జనార్ధన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
విద్వేషాలను రెచ్చగొట్టడానికే ఈ పనిచేశారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను పొగిడినంత మాత్రాన.. నారా లోకేష్ అసలు స్థానం ‘కొసరోడు’ మాత్రమేనని తెలియజేసినంత మాత్రాన విద్వేషాలకు లోనయ్యేవారు ఎవరుంటారనేది ఆయనకే తెలియాలి. ఈ విషయం మీద పోలీసులకు ఫిర్యాదుచేస్తాం అంటున్నారు. లేకపోతే న్యాయపోరాటం కూడా చేస్తారట. ఇక్కడ ఏం అన్యాయం జరిగిందని న్యాయపోరాటం అంటున్నారో కూడా అర్థం కావడం లేదు.