తెలంగాణ రాష్ట్రంలో గులాబీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు, భూ కేటాయింపుల పేరుతో జరుగుతున్న అవకతవకలు, అయినవారికి దొరికినంత భూమిని దోచిపెట్టే వ్యవహారాలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరువు తీస్తున్నాయి.
భారతదేశం మొత్తానికి కూడా తెలంగాణను ఒక రోల్ మోడల్ గా చూపిస్తానని, తెలంగాణ మోడల్ అభివృద్ధి అనే నినాదంతో దేశవ్యాప్తంగా విజయాలు సాధిస్తానని కేసీఆర్ అంటున్నారు. అయితే ‘తెలంగాణ మోడల్ అభివృద్ధి’ అంటే విచ్చలవిడిగా భూబాగోతాలకు పాల్పడడమేనా అనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
పప్పులు, బెల్లాలు లాగా, అయిన వారందరికీ భూములను పంచిపెట్టడమే విధానంగా కెసిఆర్ సర్కారు పాలన సాగిస్తోందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. భూపందేరాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు కోర్టులలో ఆగిపోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టులో అక్షింతలు వేస్తున్నాయి. మొత్తంగా కలిపి కెసిఆర్ పరువు మంటగలుస్తోంది.
తాజాగా భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం కోసం కోకాపేట దగ్గర 11 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం హైకోర్టులో పడింది. దాదాపు 500 కోట్ల విలువైన భూమిని, కేవలం 37 కోట్ల రూపాయలకే భారత రాష్ట్ర సమితి పార్టీకి ధారాదత్తం చేయడం మీద హైదరాబాదులోని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపై వారి వాదనలు వినిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ విషయంలో ఒకవైపు జీవో కూడా జారీ అయిందని పిటిషనర్ పద్మనాభరెడ్డి చెబుతున్నారు. సదరు స్థలంలో భారాస కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయని ఆయన వెల్లడిస్తున్నారు. అయితే ప్రభుత్వం తరఫు న్యాయవాది మాత్రం వ్యవహారం ఇంకా మంత్రిమండలి ముందు ఉన్నదని చెప్పడం విశేషం. ఇంకా మంత్రిమండలి ముందే ఉన్నట్లయితే కేసు ఆపరిపక్వ దశలో ఉన్నట్లే కదా అని వ్యాఖ్యానించిన కోర్టు, భూమి పూజ కూడా జరిగిందని తెలిసిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
భారాసకు కేటాయించుకున్న భూమి విషయంలో మాత్రమే కాదు. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం హెటెరో సంస్థకు అనుబంధంగా ఉండే సాయి సింధు ఫౌండేషన్ కు కారు చవకగా 15 ఎకరాల భూమిని లీజు కింద కేటాయించిన తీరును కోర్టు తప్పు పట్టింది. ఈ కేటాయింపులను ఏకంగా రద్దు చేసింది. అదేవిధంగా కమ్మ సంఘం భవన నిర్మాణం కోసం కేటాయించిన భూములను కూడా స్టే విధించింది.
ఇప్పుడు పార్టీకి కేటాయించిన భూములు వివాదాస్పదం అవుతున్నాయి. అంతా సంపన్నులు ఉండే కులసంఘానికి భూమిని చవకగా ఎందుకు కట్టబెట్టారని కోర్టు ప్రశ్నించింది. ఈ తీరుగా భూమి పందేరాలతో కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోతున్నదని విమర్శకులు అంటున్నారు.