తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని శభాష్ అని అభినందించాలి. ఎల్లో మీడియా అమ్మకానికి అతీతం కాదని ఆయన నిరూపించారు. ఈనాడు పత్రికను కాస్త పక్కన పెడితే, దాని తోక పత్రిక నిత్యం వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతూనే వుంటుంది. అయితే రాష్ట్రమంతా వైసీపీపై దుష్ప్రచారం చేసే ఆ పత్రిక… చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి విషయంలో మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకుని వార్తలు రాస్తుంటుంది.
చెవిరెడ్డిపై వ్యతిరేకంగా చిన్న వార్త రాయాలన్నా ఆ పత్రికకు భయం. ఎందుకంటే ఆ పత్రిక ప్రతి అక్షరానికి చెవిరెడ్డి వెల కట్టారని తిరుపతి జిల్లాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. దీంతో కిమ్మనకుండా చెవిరెడ్డి పరువు ప్రతిష్టల్ని కాపాడే బృహత్తర బాధ్యతను ఆ ఎల్లో పత్రిక భుజాన వేసుకుంది. తాజాగా తిరుపతి రూరల్ పరిధిలోని పేరూరులో మండలాధ్యక్షుడైన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ తగిలింది. ఈయన చెవిరెడ్డి పెద్దకుమారుడు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగనున్నారు.
ఈ నేపథ్యంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మోహిత్‌రెడ్డిని ఆ గ్రామ వార్డు సభ్యుడు గిరిధర్ గౌడ్ తండ్రి ఈశ్వరయ్యతో పాటు స్థానికులు సమస్యలపై నిలదీశారు. గ్రామంలో నాలుగేళ్లుగా డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోలేదని, ఇప్పటికైనా పరిష్కరించాలని ఆయన్ను చుట్టుముట్టినట్టు ఈనాడు పత్రికలో వార్త వచ్చింది. సాధారణంగా వైసీపీ ప్రజాప్రతినిధులను ఎవరు నిలదీసినా ఎల్లో పత్రికల్లో వార్తలు రావడం సహజం.
కానీ చెవిరెడ్డిని నిలదీయడంపై చంద్రబాబు భక్తుడైన ఆర్కే పత్రికలో చిన్న వార్త కూడా లేకపోవడం గమనార్హం. ఇదే పత్రికలో ఇవాళ కృష్ణా జిల్లా ఉయ్యూరులో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారని లబ్ధిదారులు నిలదీస్తున్నట్టు ఫొటోతో కూడిన వార్త, అలాగే కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రాపురంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు నిరసన సెగ తగిలినట్టు వార్తలొచ్చాయి. రామచంద్రాపురం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా వుందని, వర్షాకాలం మురుగునీరు పోయే మార్గం లేదని ఎమ్మెల్యే చంటిబాబును మహిళలు నిలదీశారు.
కానీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన తనయులపై ఈగ వాలనివ్వకుండా ఆర్కే పత్రిక జాగ్రత్తలు తీసుకుంది. చెవిరెడ్డిపై ప్రేమా? లేక ఆయన యాడ్స్ రూపంలో ఇచ్చే డబ్బుపైనా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఎల్లో పత్రికకు డబ్బు ఇస్తే… నోర్మూసుకుని వారి ప్రయోజనాలు కాపాడ్తాయని చెవిరెడ్డి నిరూపించారు. ఈ వాస్తవాన్ని చెవిరెడ్డి ప్రతి సందర్భంలోనూ చాటి చెబుతున్నారు. ఇటీవల చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక రగడ జరిగింది. ఇదే ఇతర నియోజకవర్గాల్లో జరిగి వుంటే… లేనివి, ఉన్నవి కల్పించి రాసేవారు.
చెవిరెడ్డి నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి, ఆ పత్రిక కళ్లు మూసుకుంది. అంతే మరి, డబ్బుకు పచ్చ పత్రిక దాసోహమైంది. అమ్ముడు పోయే పత్రిక ఉండగా, కొనే చెవిరెడ్డి లాంటి వాళ్లు ఎప్పటికీ ఉంటారు. ఇది చేతకాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఊరికే అందరితో తగువు పెట్టుకుంటున్నారు. కనీసం చెవిరెడ్డి లాంటి వారికైనా ఇప్పుడు తన వద్ద క్రియాశీలక పాత్ర ఇచ్చారు. జగన్‌పై దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట వేసే బాధ్యతను చెవిరెడ్డి తీసుకుంటారని ఆశిద్దాం.