ముఖ్యమంత్రి పదవిపై జనసేనాని పవన్‌కల్యాణ్ కామెంట్స్‌పై టీడీపీ ఆగ్రహంగా వుంది. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు పవన్‌కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో మీడియాతో పవన్ మాట్లాడుతూ పలు కీలక అంశాలపై మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తపరిచే వరకూ టీడీపీ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి. అయితే సీఎం పదవిపై పవన్ కామెంట్స్ టీడీపీకి ఏ మాత్రం రుచించడం లేదు.
ఢిల్లీలో పవన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“రాష్ట్రంలో వైసీపీని గద్దె దించేందుకు అన్ని శక్తులు ఏం కావాలన్నదే నా అభిప్రాయం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో నేను చెప్పలేను. ఎవరి పార్టీ కార్యకర్తలు తమ నేతే ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అనుకుంటారు. ఎన్నికల తర్వాత పార్టీల బలాబలాలు, ప్రజల్లో స్పందన, వారి మద్దతును బట్టి ఏ పార్టీ నేత సీఎం అవుతారనేది తేలుతుంది” అని పవన్‌కల్యాణ్ అన్నారు.
2014లో మాదిరిగా రాజకీయ సమీకరణలుంటాయని పవన్‌కల్యాణ్ అంటున్నారే తప్ప, అప్పట్లా చంద్రబాబే సీఎం అవుతారని మాత్రం చెప్పలేదు. పైగా తమ పార్టీ వాళ్లు తనను సీఎం కావాలని కోరుకుంటున్నారని ఆయన అనడం టీడీపీకి చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. బాబు సీఎం క్యాండిడేట్ కాదనే ప్రచారాన్ని టీడీపీ సహించలేకపోతోంది. అన్నీ తానే ఊహించుకుని పవన్‌కల్యాణ్ ఏదేదో మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబే సీఎం అభ్యర్థి అని, తనను ఎందుకు ఎన్నుకుంటారని మాట్లాడిన పవన్‌కల్యాణ్, ఢిల్లీ వెళ్లగానే మాట మార్చడం ఏంటని వారు నిలదీస్తున్నారు.
చంద్రబాబు కాకుండా, మరొకరిని సీఎం అభ్యర్థిగా అంగీకరించే ప్రశ్నే లేదని, అసలు ఆ ఊహను కూడా టీడీపీ అంగీకరించదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. జగన్‌ను గద్దె దించాలనే లక్ష్యంతో తనకు తానుగా టీడీపీతో చేతులు కలిపేందుకు పవన్ ముందుకొస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత తేలుతుందని పవన్ ఎలా మాట్లాడ్తారని వారు నిలదీస్తున్నారు.