ఛత్తీస్‌గఢ్‌లో బలాబలాలు

90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్‌లో గత ఎన్నికల్లో బిజెపికి 50 సీట్లు రాగా, కాంగ్రెసుకు 3 వచ్చాయి. 2003 నుండి పాలిస్తున్న బిజెపి ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు పాలనాదక్షతకు పేరుపడ్డారు. ఈ సారి కూడా నెగ్గితే ఆయన…

90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్‌లో గత ఎన్నికల్లో బిజెపికి 50 సీట్లు రాగా, కాంగ్రెసుకు 3 వచ్చాయి. 2003 నుండి పాలిస్తున్న బిజెపి ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు పాలనాదక్షతకు పేరుపడ్డారు. ఈ సారి కూడా నెగ్గితే ఆయన హేట్రిక్ చేసినట్టు అవుతుంది. నెగ్గగలరా? సిఎన్‌ఎన్-ఐబిఎన్ సర్వే ప్రకారం బిజెపికి 61-71, కాంగ్రెసుకు 16-24 వస్తాయని అంచనా. ఇది నిజంగా సాధ్యపడుతుందా అని కొందరు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్ స్వాభిమాన్ మంచ్ (సిఎస్‌ఎమ్) అనే పార్టీ బిజెపి ఓట్లు కొంతమేరకు గుంజుకుంటుందన్న భయం వుంది. ఆ సంస్థను నాలుగేళ్ల క్రితం తారాచంద్ సాహు అనే బిజెపి నాయకుడు స్థాపించాడు. ఛత్తీస్‌గఢ్‌లో మొదటినుండీ వున్న సాహు(నూనె వర్తకులు), కూర్మీలు (ఓబిసిలో వర్గంలోకి వచ్చే రైతులు) జనాభాలో సగం మంది వున్నా బిజెపి పాలనలో బయట నుండి వచ్చినవారు బలపడి స్థానికులపై పెత్తనం చలాయిస్తున్నారని అతని నినాదం. 

మధ్యప్రదేశ్‌నుండి యిదే వాదనతో ఛత్తీస్‌గఢ్ విడివడ్డాక కూడా యిలాటి  వివాదాలు వస్తూనే వున్నాయన్నది గమనార్హం. బిజెపి అతన్ని పార్టీ నుండి వెలివేసింది. తారాచంద్ పోయాక అతని కొడుకు నడుపుతున్న యీ పార్టీ యీ ఎన్నికలలో సిపిఐ, జెడి(యు)లతో పొత్తు పెట్టుకుని  బిజెపి అవకాశాలను దెబ్బ తీస్తుందని ఒక అంచనా. 2003లో కాంగ్రెసు నుండి వెలివేయబడిన విద్యాచరణ్ శుక్లా, శరద్ పవార్ ఎన్‌సిపితో పొత్తు పెట్టుకుని 90 సీట్లలో పోటీ చేసి కాంగ్రెసు ఓట్లు చీల్చాడు. తను ఒక్కటే గెలిచినా, అనేక చోట్ల కాంగ్రెసును ఓడించాడు. అప్పుడు కాంగ్రెసు అతన్ని పార్టీలో మళ్లీ చేర్చుకోవాల్సి వచ్చింది. 

ఇప్పుడు ఆ పని సిఎస్‌ఎమ్ చేయవచ్చు. బియస్‌పి గత ఎన్నికలలోనే సీట్లు గెలుచుకుంది. ఈ సారి కూడా 2 గెలుచుకోవచ్చు. సిపిఐ ఓ రెండు. దేశమంతా కాంగ్రెసు అవినీతి గురించి ప్రతిపక్షాలు ఉద్యమిస్తూ వుంటాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెసే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. రమణ్ సింగ్ కాబినెట్‌లోని మంత్రులు తమ ఆస్తుల వివరాలను ప్రకటించినపుడు గత ఐదేళ్లలో వాళ్ల ఆస్తులు విపరీతంగా పెరిగిన తీరు చూసి అందరూ విస్తుపోయారు. దానే కాంగ్రెసు ఎన్నికల అంశంగా చేసుకుంటోంది. బిజెపికి హ్యేట్రిక్ దక్కకుండా చేయాలన్న పట్టుదతో వున్న కాంగ్రెసు  అధిష్టానం అజిత్ జోగి భార్యకు, కుమారుడికి టిక్కెట్లు యిచ్చి అతనితో రాజీ కుదుర్చుకుంది. 2014 పార్లమెంటు ఎన్నికలలో అతనికి టిక్కెట్టు యిస్తానంది. బస్తర్ జిల్లాలో అజిత్ జోగి మద్దతు లాభించవచ్చు. బస్తర్ ఎవరు గెలిస్తే వాళ్లే రాష్ట్రాన్ని పాలిస్తారని ఒక నానుడి. మొత్తం మీద కొత్తవాళ్లకు చాలామందికి టిక్కెట్లు యిచ్చారు. కానీ కాంగ్రెసు బలహీనతలు ఏమిటంటే – ముఖ్యమంత్రిగా ఎవరినీ చూపించటం లేదు. యుపిఏ అవినీతికి విస్తృతప్రచారం వుంది కాబట్టి ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెసు అవినీతి వ్యతిరేక ప్రచారం పని చేయడం లేదు. ప్రజాదరణ లేని కొందరు సిటింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు యిచ్చారు. 

బిజెపికి 25% సిటింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు యివ్వలేదు. సంక్షేమపథకాలను విజయవంతంగా అమలు చేసింది. బలహీనతల గురించి చెప్పాలంటే పార్టీలో అంతర్గత కలహాలున్నాయి. అభివృద్ధి ఫలాలు హైవేకు దగ్గరగా వున్న గ్రామాలకు అందాయి తప్ప యింకా అనేక గ్రామాల్లో తాగునీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు లేవు. పారిశ్రామికవేత్తలకు చౌక ధరలకు భూమి, గనులు కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి పట్ల వ్యతిరేకత లేకపోయినా యితర మంత్రుల్లో కొందరి పట్ల ఏహ్యత వుంది. ఎలా చూసినా కాంగ్రెసు కంటె బిజెపి మెరుగైన స్థితిలో వుండడానికి కారణం – గిరిజన ప్రాంతాల్లో ఆరెస్సెస్ చేస్తున్న కృషి. రాష్ట్ర జనాభాలో 30% మంది గిరిజనులు, 12% మంది దళితులు వున్నారు. వీరిలో చాలామంది క్రైస్తవమతం తీసుకున్నారు. ప్రభుత్వమద్దతుతో ఆరెస్సెస్ యీ ప్రాంతాల్లో 100 వనవాసి కళ్యాణ్ ఆశ్రమాలు, వెయ్యి సరస్వతీ శిశు మందిరాలు, 500 ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుపుతూ వారిని తిరిగి హిందూమతంలోకి ఆకర్షిస్తోంది. వీళ్లు పోలింగు రోజున ఓటర్లను బూత్‌దగ్గరకు తీసుకురాగలరు. అందువలన బిజెపియే గెలుస్తుందని అనుకోవచ్చు కానీ సర్వేలో చెప్పినంత గొప్పగా గెలవకపోవచ్చు.