సలీమ్‌తో దర్శకుడిగా బ్యాడ్ ఇమేజ్‌ని తెచ్చుకొన్నాడు వైవిఎస్ చౌదరి. నిప్పు సినిమాతో ఆర్థికంగా నష్టపోయాడు. అయినా సరే కోలుకొని… అతి కష్టమ్మీద రేయ్ సినిమాని పూర్తి చేశాడు. మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ని తెలుగు తెరకు పరిచయం చేసే బాధ్యతను నెత్తిమీద వేసుకొన్నాడు. ఈ సినిమాకి రూ.30 కోట్లు ఖర్చుపెట్టాడని టాక్. ఓ కొత్త హీరోపై ఇంత బడ్జెట్టా..? అని టాలీవుడ్ ముక్కున వేలేసుకొంది. ఎంత బాగా ఆడినా ఆ మొత్తం సంపాదించుకోవడం చాలా కష్టం.
అయినా సరే, పెద్ద రిస్క్ తనపై వేసుకొన్నాడు. ఈ సినిమా పూర్తయినా విడుదల చేసే ఛాన్స్ మాత్రం వైవిఎస్‌కి రాలేదు. అత్తారింటికిది దారేది, తుఫాన్, ఎవడు… ఇలా వరసగా మెగా హీరోల చిత్రాలే ఉన్నాయి. వీటితో పాటు తన సినిమాకీ విడుదల చేయడం వైవిఎస్ కు ఇష్టం లేదు. అత్తారింటికి, తుపాన్… వచ్చి వెళ్లిపోయినా ఎవడు మాత్రం రాలేదు. అదొచ్చి వెళ్లిపోయిన తరవాత నెమ్మదిగా తన సినిమాని వదలాలనుకొన్నాడు. కానీ ఎవడు విడుదల తేదీ సందిగ్థంలో పడిపోయింది. దాంతో… రేయ్ కూడా ఆగిపోఇయంది.
సాయిధరమ్ రెండో సినిమా పిల్లా నువ్వు లేని జీవితం మాత్రం రెడీ అయి, విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు రేయ్‌ని ఇంకొన్నాళ్లు ఇలాగే ఆపితే.. పిల్లానువ్వు.. సినిమా ముందు విడుదలైపోతుంది. అంటే రెండో సినిమా ముందుగా వస్తుందన్నమాట. అలా జరిగితే సాయిధరమ్ మొదటి సినిమా అన్న క్రేజ్ రేయ్‌కి రాదు. ఏ క్రేజ్ కోసమైతే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడో అది తన సినిమాకి దక్కకుండా పోతుంది. 'నువ్వు మరీ లేట్ చేస్తే, మా సినిమా ముందు విడుదల చేసేస్తాం..' అని దిల్ రాజు, అల్లు అరవింద్‌లు కాస్త గట్టిగానే చెబుతన్నార్ట.
దాంతో వైవిఎస్ కి ఏం చేయాలో పాలుపోడం లేదు. ఎవడు కోసం చూసుకోకుండా.. రేయ్‌ని రిలీజ్ చేసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే వైవిఎస్ కూడా రేయ్ సినిమాని సాధ్యమైనంత త్వరలో విడుదల చేయాలని కంకణం కట్టుకొన్నాడు. వీలైతే సంక్రాంతి బరిలో తీసుకురావాలనుకొంటున్నాడు. సంక్రాంతికి పోటీ మామూలుగా లేదు. మహేష్, బన్నీ, నితిన్ సినిమాలు ఉన్నాయి. వీటిమధ్య రేయ్ నిలుస్తుందా? లేదా? అనేది అనుమానం. సంక్రాంతి తరవాత చూద్దాంలే అంటే.. దిల్ రాజు ఆడగం లేదు. దాంతో ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది వైవిఎస్ పరిస్థితి. పాపం.. ఎన్నికష్టాలో..?