ఐరన్‌లెగ్‌ ఫాదర్‌ అంటున్నారంతా!

రిటైరయ్యే సమయం దగ్గర పడే కొద్దీ ఆదరాబాదరాగా లంచాలు మేస్తూ.. రిమైనింగ్‌ జీవితం మొత్తం స్థిరపడిపోవడానికి అడ్డగోలు సంపాదనకు ఆశపడే ఆమాంబాపతు గాళ్లు మనకు అడుగడుగునా కనిపిస్తారు. సినిమా రంగం కూడా అందుకు అతీతం…

రిటైరయ్యే సమయం దగ్గర పడే కొద్దీ ఆదరాబాదరాగా లంచాలు మేస్తూ.. రిమైనింగ్‌ జీవితం మొత్తం స్థిరపడిపోవడానికి అడ్డగోలు సంపాదనకు ఆశపడే ఆమాంబాపతు గాళ్లు మనకు అడుగడుగునా కనిపిస్తారు. సినిమా రంగం కూడా అందుకు అతీతం కాదు. కెరీర్‌ అవసాన దశకు వచ్చేస్తున్న సమయంలో క్యారెక్టర్‌ పాత్రలని, అన్నలని, నాన్నలని, అత్తలని, ఐటం లని.. ఏదో ఒకటి చేస్తూ విచ్చలవిడిగా సంపాదించేసుకోవాలని ఆరాటపడేవారు అనేకమంది కనిపిస్తారు. వచ్చిన ప్రతిపాత్రను ఒప్పేసుకుంటూ ఉంటారు. కనీసం సినిమా విడుదల అవుతుందా లేదా కూడా పట్టించుకోరు. అడ్వాన్సులు ముడితే చాలు, డేట్స్‌ డైరీలో ఖాళీ కనిపిస్తే చాలు.. కథ కూడా అడగరు. సినిమాలు చేసేస్తూ ఉంటారు. అలాంటి వారిలో మన పరిశ్రమలో ప్రస్తుతం శాటిలైట్‌ హీరోగా వెలుగొందుతున్న రాజేంద్రప్రసాద్‌ ప్రముఖుడని చెప్పుకోవాలి. రాజేంద్రప్రసాద్‌ను కీలకపాత్రలో ఉంచి తతిమ్మా పాత్రల్లో ఆవారా కుర్రగాళ్లను పెట్టి ఓ సినిమా చుట్టేస్తే.. విడుదల చేయగలిగితే శాటిలైట్‌ అమ్మకాల రేటుతో లాభాలు వచ్చేస్తాయని  ఓ ప్రచారం ఇండస్ట్రీలో బాగా వ్యాపించింది. అది కూడా రాజేంద్రప్రసాద్‌ అనుయాయులే స్ప్రెడ్‌ చేశారో ఏమో తెలియదు గానీ.. అలాటి చిత్రాలు మాత్రం ఆయన పదుల సంఖ్యలోనే చేశారు. దాదాపుగా అన్నీ కూడా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్‌లలోనే మూలుగుతున్నాయి. 

అయితే రాజేంద్రప్రసాద్‌ మాత్రం కేవలం మూలిగే సినిమాలే కాకుండా, రిలీజయ్యే సినిమాలు కూడా చేస్తూనే ఉన్నారు.  పెద్ద హీరోల సినిమాల్లోనూ చిన్న పాత్రలు వేస్తున్నారు. అయితే పెద్ద హీరోల చిత్రాల విషయంలో ఆయనకు ఐరన్‌లెగ్‌ అని ఒక బ్రాండ్‌ పడిపోతోంది. రాజేంద్రప్రసాద్‌ అంతటి సీనియర్‌ నటుడిని సినిమాకు ప్లస్‌ కావడానికే ఎవరైనా ఎంచుకుంటారు. అయితే ఒక్క జులాయి తప్ప ఆయన లేటెస్ట్‌ ఇన్నింగ్స్‌ సినిమాలు అన్నీ ఢమాల్‌ బస్టర్లే. ప్రస్తుతానికి పైప్‌లైన్‌లో ఉన్న చిత్రాలు కూడా ఉన్నాయి. ఆగడు వంటి చిత్రాల్లోనూ ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆ చిత్రాలు ఖచ్చితంగా విజయవంతమై తన ఐరన్‌లెగ్‌ ఇమేజిని మారుస్తాయని ఆయన కోరుకుంటున్నారట.