రాష్ట్రవిభజన పర్వం అత్యంత గందరగోళంగా సాగిపోతోంది. అసలా జీఓఎమ్ ఏమిటో, దాని తీరుతెన్నులేమిటో ఎవరికీ తెలియటం లేదు. విభజన చేసి తీరతాం, ఎలా చేయాలో సూచనలు యివ్వండి అని అడుగుతున్నారు. ఎవరైనా కమిటీ వేసేముందు సలహాలు తీసుకుంటారు. ఇలా మధ్యదారిలో వుండగా ఎటు వెళ్లాలి అని అడగరు. అప్పుడే సిటింగ్స్ అయిపోయాయి. ఇంకో ఒకటి రెండు మీటింగుల్లో అన్నీ తేల్చిపారేయబోతున్నారు. ఇప్పుడు కొన్ని పార్టీలు యిచ్చిన పేజీల పేజీల సలహాలు చదివేటంత తీరిక కూడా వాళ్లకు లేదు. ఇప్పటిదాకా అందరు సభ్యులూ -పదిమంది నుండి ఆరుగురికి తగ్గించేసినా – కలిసి ఒక్కసారీ కూర్చోలేదు. తక్కిన మీటింగుల్లో కూడా కూర్చుంటారన్న నమ్మకం లేదు. ఏదో ఒకటి తట్ట తగలేసినట్టు అవగొడదామని చూస్తున్నారు. మొదట్లో సలహాలు తీసుకోని పక్షంలో తాము చర్చించుకుని తేల్చుకున్న విషయాలు తెలియబరచి, వాటిపై సలహాలు, సూచనలు అడగవచ్చు. ఇప్పటిదాకా విషయాలు తేల్చుకోలేదు అనుకుంటే ఆంటోనీ కమిటీ నివేదికను పరికించి, దాన్నే ప్రాతిపదికగా చూపవచ్చు. ఎందుకంటే ఆంటోనీ కమిటీ యిప్పటికే యిరుప్రాంతాల కాంగ్రెసు నాయకుల దగ్గర్నుంచి తీసుకుంది కాబట్టి వారి అభిప్రాయాలపై యితర పార్టీల అభిప్రాయలు కోరినా సరిపోయేది.
చర్చల జోలికి పోని జిఓఎమ్
ఆంటోనీకేం తెలుసు, మాకింకా కొమ్ములు తిరిగాయి అనుకుంటే యిప్పుడు యీ మూడు మీటింగుల్లో మేం ఏర్పరచుకున్న అభిప్రాయం యిది అని డ్రాఫ్టు ముందు పెట్టవచ్చు. అదీ చేయడం లేదు. మీరేమనుకుంటున్నారో చెప్పండి అంటూ అదే దంపుళ్ల పాట. కాంగ్రెసు పార్టీ అఖిలపక్ష సమావేశాలు ఏర్పరచినపుడు కూడా యిదే కథ నడిచింది. వాళ్లేమనుకుంటున్నారో చెప్పకుండా అన్ని పార్టీలను యిద్దరేసి నాయకులను పంపమనడం, వాళ్లు చెరో అభిప్రాయం చెపితే విని ఊరుకోవడం, తన పార్టీ అభిప్రాయం చెప్పకపోవడం. ఎవరైనా ఏదైనా అభిప్రాయం చెపితే, దాన్ని వ్యతిరేకించినవారి కేసి చూసి, ‘మరి దీనికేమంటారు?’ అని ముఖాముఖీ అడగడమే లేదు. అసలు అలాటి చర్చ అనేదే లేదు. ఇప్పుడు అఖిలపక్షం అని పిలిచి విడివిడిగా మాట్లాడతారట. అంటే చర్చ అనేదే జరగదు. చర్చ అనేది జరిగితే గిరిగితే అసెంబ్లీలోనే జరగాలి. కానీ అసెంబ్లీలో మాట్లాడేది మేం విననే వినం అంటున్నారు. ‘మీ బోడి అభిప్రాయం ఎవడికి కావాలి? పంపాలని రాజ్యాంగంలో వుంది కాబట్టి పంపుతున్నాం. మీరేం చెప్పినా మేం చేసేది చేస్తాం’ అని ఓపెన్‌గా చెప్తున్నారు. ఇక చర్చంటూ జరిగితే పార్లమెంటులో జరగాలి. ఇవన్నీ యింత అడ్డదిడ్డంగా అఘోరిస్తూంటే అది మాత్రం లక్షణంగా వుంటుందని అనుకోగలమా?
సీమాంధ్ర ప్రజలు, నాయకులు దీన్నే తప్పుపడుతున్నారు. సీమాంధ్రలో తక్కువ సంఖ్యలో వున్నా విభజన కోరే జనమూ కొందరున్నారు! బిజెపి, సిపిఐ పార్టీల వారు కావచ్చు, లేదా దళిత సంఘాలు కావచ్చు, ఏ రాజకీయ సంబంధమూ లేకపోయినా వ్యక్తిగతంగా కూడా విభజన కోరుకోవచ్చు. అది తెలంగాణపై ప్రేమ చేత కాదు, తెరాసవారు ఆంధ్రుల్ని తిడుతున్న తిట్లను ఆమోదించడం చేత కాదు. ‘సమైక్యాంధ్ర వున్నంతకాలం హైదరాబాదు తప్ప మన ప్రాంతాలు బాగుపడటం లేదు. విడిపోతే అప్పుడు చచ్చినట్టు మన ప్రాంతంలోనూ పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాల కోసం హైదరాబాదు వెళ్లనవసరం లేదు’ అనే ఆలోచనతో వాళ్లు విభజన కోరుతున్నారు. వాళ్లు కూడా విభజన జరిగే తీరును హరాయించుకోలేక పోతున్నారు. తెలంగాణలో విభజన కోరుకునేవారు కూడా తమకు రాష్ట్రం రావాలని కోరుకుంటున్నారు కానీ, యిలా అపసవ్యమార్గంలో, అసంబద్ధంగా రావాలని కోరుకోవడం లేదు. సీమాంధ్రకు సంబంధించిన అంశాలన్నీ పరిష్కరించి, పేచీలు లేని రాష్ట్రం రావాలని వారి అభిమతం. కేంద్రంలోని యుపిఏకు యివేమీ పట్టటం లేదు. ఎవరి సెంటిమెంట్లు పట్టించుకోకుండా బ్రేక్‌నెక్ స్పీడుతో వెళ్లిపోతోంది.
సమైక్యవాదుల ప్రశ్నలకు జవాబుల్లేవు
‘అలా ఎలా వెళతారు? ఓ పద్ధతీ పాడూ వుండనక్కరలేదా? గతంలో మూడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు అసెంబ్లీ తీర్మానాలు తెప్పించుకున్నారు కదా’ అని సమైక్యవాదులు ప్రశ్నిస్తే విభజనవాదులు ‘అది ఆనవాయితీ కాదు. అంతకుముందు రాష్ట్రాలు చీల్చినపుడు కొన్ని కేసుల్లో అసెంబ్లీ తీర్మానాలు లేవు.’ అంటున్నారు. ఎవరైనా తాజా ఉదాహరణలు లెక్కలోకి తీసుకుంటారు కానీ, పాతవి తీసుకోరు. విభజనవాదులకు యిది అనువుగా వుంది కాబట్టి యిలా వాదిస్తున్నారు. ‘అసెంబ్లీ తీర్మానాలు పాస్ అయిన విదర్భ, యుపిలను మీరు విభజించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం విడదీస్తున్నారు ఎందువలన?’ అని అడిగితే కేంద్రం వద్ద సమాధానం లేదు. చిదంబరంగారు తమిళనాడు విభజన ఉద్యమాలను మొగ్గలోనే తుంచేయలంటారు. ఆజాద్ గారు జమ్మూను కశ్మీర్ నుండి విడగొట్టడానికి ఒప్పుకోరు. విదర్భ విడగొడతారా అని అడిగితే షిండేగారు యీ పుణ్యకార్యం తర్వాత ఇంకే విభజన డిమాండ్‌ను అంగీకరించం అంటున్నారు. మొయిలీ గారు ఉత్తర కర్ణాటకను విడగొట్టం, ప్యాకేజీ యిచ్చి ఊరుకోబెట్టాం అంటున్నారు.
మీ మీ రాష్ట్రాల్లో విభజన వుద్యమాలను అణచివేస్తూ కేవలం మా పట్లనే యింత కరుణ ఎందుకు చూపుతున్నారు స్వామీ అంటే ఇది 50 ఏళ్లగా నడుస్తున్న ఉద్యమం కాబట్టి అంటున్నారు. మరి గూర్ఖాల్యాండ్ వుద్యమం యింకా పాతది కదా అంటే దానికి సమాధానం లేదు. ‘అయినా 1973-2001 మధ్య తెలంగాణ ఉద్యమం లేదు కదా, వుండి వుంటే సీమాంధ్రులు తెలంగాణలో పెట్టుబడి పెట్టేటంత పిచ్చివాళ్లు కాదు కదా’ అంటే దానికీ సమాధానం చెప్పరు. ఉద్యమం వుందని మేం అనుకున్నాం అంతే అంటారు. గట్టిగా రొక్కించి అడిగితే ‘అన్ని పార్టీల వాళ్లూ ఒప్పుకున్నారు కాబట్టి తలపెట్టాం..’ అంటారు. ‘ఒప్పుకున్న పార్టీల్లో వైకాపా అభిప్రాయం మార్చుకుంది. టిడిపి విభజన తీరును తప్పుపడుతోంది. వేరే పార్టీల గోల ఎందుకు, మీ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు. విడగొట్టమని ఓ లేఖ, సమైక్యం అని మరో లేఖ రెండూ గుండుసూదితో గుచ్చి యిచ్చాడు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. గతంలో యిచ్చిన లేఖలు చూపడం దేనికి? లేటెస్టుగా వాళ్లు లేవనెత్తిన అభ్యంతరాలను లెక్కలోకి తీసుకుని మరీ ముందుకు కదలండి. మెజారిటీ అభిప్రాయం (కాన్సెన్సస్) తీసుకున్నాకే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామంటూ ఏళ్లూ పూళ్లూ గడిపిన మీరు చివరకు ఎవరినీ ఒప్పించకుండానే ముందుకు ఎలా వెళతారు?’ అంటే ‘మేం ఆల్‌రెడీ నిర్ణయం తీసేసుకున్నాం. ఇంకెవ్వరూ నోరెత్తడానికి వీల్లేదు’ అంటున్నారు.
గొంతెమ్మ కోరికలు
మొత్తమంతా కేంద్రం చేతిలోనే వుంది, దానికో రేషనేల్ లేదు అనగానే యిక నాయకులు రెచ్చిపోతున్నారు. ఏవేవో హిరణ్యాక్ష వరాలు కోరుతున్నారు. సీమాంధ్ర నాయకుల డిమాండు చూస్తే – ఐఐటి, ఐఐఎమ్, ఎయిమ్స్, ఐటిఐఆర్, పోలవరం కాకుండా ఇంకో రెండు జలప్రాజెక్టులు, వైజాగ్‌కు మెట్రో, మా గ్యాస్ మాకే, వాల్తేరు డివిజన్, హైదరాబాదులో వున్న ప్రభుత్వ సంస్థల్లో సగం వాటి తరలింపు, సింగరేణిలో వాటా, రెండు యింటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, హైదరాబాదు ఆదాయంలో పదేళ్లవరకు జనాభా నిష్పత్తిన వాటా, కొత్త రాజధాని కట్టుకునేందుకు 20 ఏళ్ల పాటు ఏటా 40 వేల కోట్ల రూ.ల భారీ ప్యాకేజి (20 ఏళ్ల దాకా రాజధాని కట్టరా?), కొత్త రాష్ట్రంలో టాక్స్ హాలిడేస్ – వగైరా వగైరాలు కాక హైదరాబాదును యుటీ చేసేసి అక్కడకు కూడా తమ రాకపోకలకు, వ్యాపారవ్యవహారాలకు అడ్డు లేకుండూ చూడడం! కొసరుగా భద్రాచలం! ఇక తెలంగాణ నాయకుల డిమాండు చూస్తే – సింగరేణి మొత్తం మాకే, కెజిబేసిన్‌లో వాటా, స్టీల్ ఫ్యాక్టరీ, పవర్ ప్లాంట్లు, 2 జాతీయ జలప్రాజెక్టులు, ఆంధ్ర ఉద్యోగులను తరిమేయడం, ప్లస్ ఇన్నాళ్ల ఆంధ్రుల దోపిడీకి పరిహారంగా 4.53 లక్షల కోట్ల నిధులు వగైరా వగైరా. ఇవి కాక హైదరాబాదు యుటీ, గీటీ,కేంద్రం చేతిలో శాంతిభద్రతలు ఎట్సెట్రాలు కుదరవు. ఉమ్మడి రాజధాని జాన్తానై, ఓన్లీ తాత్కాలిక రాజధాని. అదీ పదేళ్లు కాదు రెండేళ్లు. కొసరుగా ఢిల్లీ ఎపి భవన్ మాకివ్వడం, హైదరాబాదులో మెట్రో కూల్చడం!
ఈ విభజన సందర్భంగా తండ్రి – యిద్దరుకొడుకుల పోలిక తెగ వాడుతున్నారు. తండ్రి కొడుకుల మధ్య వాటా వేసే స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే కొడుకులు ఎదిగి వచ్చి ‘మా కాళ్లపై మేం నిలబడగలం. బతుకు మేం బతకగలం. ఉమ్మడి కుటుంబంలో వుండవలసిన అవసరం యిక ఏ మాత్రమూ లేదు. ఉమ్మడి ఆస్తిలో నువ్వు కాస్త వుంచుకుని మాకు రావలసిన ఆస్తిలో మాకు వాటా యిచ్చేస్తే అది పెట్టుబడిగా పెట్టుకుని మేం యింకా బాగా ఎదుగుతాం.’ అని చెప్పినపుడు! ఇక్కడ కొడుకుల స్థితి అది కాదు. ‘మేం విడిగా వెళ్లి బతకలేం. నువ్వే మమ్మల్ని పోషించాలి. మేం పెట్టబోయే భారీ ఖర్చులకు డబ్బు పట్టుకురా. దానికి మా ఉమ్మడి ఆస్తి ముట్టుకోవద్దు. బయటనుండి సంపాదించి పట్టుకురా, మా ఎదాన పొయ్యి.’ అంటున్నారు. ‘విడిపోతే నష్టపోతాం, కలిసే వుందాం’ అని వాదించే కొడుకు యిలా వాదించాడంటే కాస్త అర్థం వుంటుంది. తమాషా ఏమిటంటే విడిపోదామని పేచీ పెడుతున్న కొడుకూ యిలాగే వాదిస్తున్నాడు. వీళ్ల వరస చూసి తండ్రి చేతులెత్తేసి ‘నాయనా, మీ కోర్కెలు తీర్చడం నా వల్ల కాదు. మీకోసం వేరేవాళ్ల పొట్ట కొట్టి అంత డబ్బు పట్టుకుని రాలేను. మీరు విడిపోనేల, నాకీ తలనొప్పేల? అందరూ ఒకే చోట కలిసి వుండండి’ అనేయాలి. అయితే ప్రస్తుతం తండ్రి స్థానంలో వున కేంద్రాన్ని పాలిస్తున్న కాంగ్రెసు అధినేత్రి సోనియా గాంధీకి యిది ప్రెస్టేజి క్వశ్చన్ అయిపోయింది. అందుకని యిలా చేతులెత్తేయకుండా యిద్దరి మాటలూ వింటున్నట్టు తెగ నటించేస్తోంది. ఆవిడ నిజంగా వింటోందేమోననుకుంటూ యిద్దరూ తమ కోర్కెల జాబితా పెంచుకుంటూ పోతున్నారు.
సీమాంధ్రుల సందేహాలు – టి ఉద్యమకారుల సమాధానాలు
వాటితో పాటు సీమాంధ్రులకు సందేహాలు మరీ పెరిగిపోతున్నాయి. ఉద్యోగుల సమస్య ఏమిటి, నీటి సమస్య ఏమిటి, ఉమ్మడి రాజధాని అంటే ఏమిటి..? అసలు మీకు మాకేం యివ్వబోతున్నారు? అని ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ పోతున్నారు. సోనియమ్మ ఏమీ మాట్లాడదు, జిఓఎమ్ నోరు విప్పదు, తన ప్లాను ఏమిటో చెప్పదు. వీళ్ల సందేహాలు విని వాళ్లు కన్‌ఫ్యూజ్ అయిపోయి, విభజనను ఆపడమో, వాయిదా వేయడమో చేస్తారన్న భయం తెలంగాణ నాయకులకు లోలోపల వుంది. అందుకని ‘ఏమిటీ వెధవ సందేహాలు, ఇంతకుముందు రాష్ట్రాల విభజన ఎలా జరిగిందో యిదీ అలాగే జరుగుతుంది’ అని విసుక్కుంటున్నారు. ‘వాటికీ, దీనికీ పోలిక లేదు. అవన్నీ రాజధాని లేని ప్రాంతాలు విభజన కోరాయి. రాజధాని ఒళ్లో పెట్టుకున్న తెలంగాణ వాళ్లే విభజన కోరడం విపరీతం.’ అని సీమాంధ్రులు అంటున్నారు. ‘అవును, తెలంగాణది ప్రత్యేక పరిస్థితి. మిగతా వాటితో పోలిక లేదు’ అంటారు మళ్లీ తెలంగాణ నాయకులు. అంటూనే ‘హైదరాబాదును యుటీ చేయడమేమిటి, గతంలో విభజన చేసినపుడు మద్రాసును యూటీ చేశారా?’ అని కూడా అంటారు. ‘చండీగఢ్‌ను చేశారుగా’ అంటే ‘ఆ పోలిక తేకండి’ అంటారు.
ఇక హైదరాబాదుపై కేంద్ర అజమాయిషీ, పదేళ్ల ఉమ్మడి రాజధాని అనేవి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంలోనే వున్నాయి. తెలంగాణ ప్రకటిస్తూనే దానికి యీ (స్ట్రింగ్స్) చిక్కుముళ్లు వేసి మరీ యిచ్చారు. తెలంగాణ కావాలి కానీ యీ చిక్కుముళ్లు వద్దు అంటున్నారు యిప్పుడు తెరాస నాయకులు, టి-జాక్. దానికి ఒప్పుకుంటే టి-కాంగ్రెసు నేతలు తెలంగాణ ద్రోహులే అంటున్నారు. దేశంలో ఏ రాష్ట్ర విభజనలోనూ తేని యీ రెండు అంశాలు యిక్కడెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎక్కడ జరిగినా మెజారిటీ జనుల ఆమోదంతో జరిగింది, యిప్పుడు అడ్డగోలుగా జరుగుతోంది కదా అంటే తెలంగాణది ప్రత్యేక పరిస్థితి అంటారు. ఇలా తెలంగాణ కేసులో పోలికలు, తేడాలు ఏ అంశానికి ఆ అంశానికి చిత్తం వచ్చినట్టు వాడుకుంటున్నారు.
వాటర్ బోర్డుల అజమాయిషీ సరిగ్గా వుండదని, ట్రైబ్యునల్స్ మాట వినకపోతే కేంద్రం ఏమీ చేయలేకపోతోందని, జలయుద్ధాలు జరుగుతాయని సీమాంధ్రులు భయాలు వ్యక్తం చేసినపుడు ‘అలా ఏం జరగవు. వాటి గురించి విభజన మానేస్తామా? గతంలో విభజనలు జరిగాయి కదా’ అంటారు. ఓ పక్క బాబ్లీ వివాదం చూస్తున్నాం. మొన్న కంతెనపల్లి గురించి రెండు జిల్లాల తెలంగాణ నాయకులు ఎలా ఘర్షణ పడ్డారో చూశాం. వీటిని చూడడానికి నిరాకరిస్తూ ‘అన్నీ రాజ్యాంగప్రకారమే జరుగుతాయి.’ అనే ఒక్క మాట పదేపదే అంటున్నారు టి-నాయకులు. ఉమ్మడి రాజధాని అనే మాట ఏ రాజ్యాంగంలో వుంది మహానుభావా అంటే దానికి సమాధానం లేదు. రాజ్యాంగం యిచ్చిన కాలపరిమితులను ఎక్కడి కక్కడ కుదించేస్తున్నారు. జిఓఎమ్‌లో సభ్యుల సంఖ్య, అసలైనవారి తొలగింపు, అసెంబ్లీ తీర్మానం అక్కరలేదనడం.. అన్నీ కేంద్రం తమ చిత్తం వచ్చినట్టు చేస్తూ పోతోంది. ప్రజా ఉద్యమాన్ని పట్టించుకోవటం లేదు. కృష్ణ కమిటీ రిపోర్టును పార్లమెంటు సభ్యులకు చూపించలేదు. దీన్ని దేనితో పోల్చగలం?
చిన్న పార్టీకి, పెద్ద పార్టీకి అందరికీ ఒకటే స్థాయి ఎలా యిస్తారు?
అసెంబ్లీలో, పార్లమెంటులో చర్చలు జరిపితే మెజారిటీ సభ్యుల అభిప్రాయం తెలిసేది. అలా కాకుండా అఖిలపక్ష సమావేశం అంటూ ఒక్క ఎమ్మెల్యే వున్న పార్టీకి, (ఓటర్లలో 2% మంది ఓట్లేసి వుంటారు వారికి) 150 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి (కనీసం 30% ఓట్లు తెచ్చుకుని వుంటారు వీళ్లు) సమాన ప్రాధాన్యత యివ్వడం కూడా తెలంగాణ అంశం ప్రత్యేకత. ఇలా అందర్నీ ఒకే పంక్తిలో కూర్చోబెట్టి 8 మందిలో 5 యిచ్చేమంటున్నారు కాబట్టి.. అని మెజారిటీ అభిప్రాయంగా చూపడం పూర్తి దగా. తెచ్చుకున్న ఓట్ల శాతం బట్టి ప్రతీ పార్టీకి వెయిటేజి యిచ్చి అప్పుడు మెజారిటీ ఎటు వుందో చూడాలి. మొదటి అఖిలపక్షం ఏర్పాటు చేసినపుడు యనమల రామకృష్ణుడు అప్పటి హోం మంత్రిని అడిగారు – ‘ఇకపై ఏ రాష్ట్రం విభజించినా, యిదే పద్ధతిలో లేఖలతోనే వ్యవహారం నడిపిస్తారా?’ అని. చిదంబరంగారు ‘దేని కదే. తెలంగాణ విషయంలో యీ పద్ధతి అవలంబిస్తున్నాం.’ అన్నారు.
అందువలన మనం గ్రహించవలసినది ఏమిటంటే – దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ విభజన అనేది యిప్పటివరకు కనీవినీ ఎరగని పద్ధతిలో, పద్ధతీ పాడూ లేకుండా అయోమయంగా, గందరగోళంగా జరుగుతోంది. తెలుగువారి కర్మ యిలా కాలింది. ఇంకెవరికీ యిటువంటి దుర్గతి పట్టకూడదని దేవుణ్ని ప్రార్థిద్దాం. మనం చెడ్డాం కాబట్టి యితరులూ చెడాలి అని కోరుకోవద్దు. ఎందుకంటే మన విభజన యింతటితో ఆగుతుందని గ్యారంటీ లేదు. సీమాంధ్ర రాష్ట్రం నుండి కొన్నాళ్లలో ఉత్తరాంధ్రో, రాయలసీమో విడిపోతామనవచ్చు. తెలంగాణ రాష్ట్రం నుండి హైదరాబాదు విడిపోతామనవచ్చు. ఉత్తర, దక్షిణ తెలంగాణలు విడిపోవచ్చు. ఇవన్నీ ఫార్‌ఫెచ్‌డ్ ఐడియాస్ అని కొట్టి పారేయకండి. అంతా కేంద్రం చిత్తం. మన ప్రాప్తం. వారి చేతిలో ఆర్టికల్ 3 ఒకటి వుంది. అది పెట్టుకుని వాళ్లు యిష్టం వచ్చినట్టు ఆడవచ్చు. ఇవాళ జరుగుతున్నది రేపూ, ఎల్లుండీ కూడా జరగవచ్చని గ్రహించండి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2013)