పవన్ తన అన్నగారిలా పార్టీ విలీనం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిహోదాలో రెడ్డి, బ్రాహ్మణ, కమ్మ, వైశ్య, దళిత వర్గాలవారు పరిపాలించారు. కానీ అదేంటో గానీ అత్యధిక సంఖ్యలో ఓటర్స్ ఉండి, నాయకులుండి, అధికారవాంఛ ఉండి ఇప్పటి వరకు ఒక్క కాపునేత కూడా…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిహోదాలో రెడ్డి, బ్రాహ్మణ, కమ్మ, వైశ్య, దళిత వర్గాలవారు పరిపాలించారు. కానీ అదేంటో గానీ అత్యధిక సంఖ్యలో ఓటర్స్ ఉండి, నాయకులుండి, అధికారవాంఛ ఉండి ఇప్పటి వరకు ఒక్క కాపునేత కూడా ముఖ్యమంత్రి కాలేకపోయాడు. కాపుల్లో ఐక్యత ఉండదని కొందరు, వారికి అదృష్టం ఇంకా రాలేదని కొందరు ఇలా ఏవేవో చెప్తుంటారు. వంగవీటి మోహనరంగా లాంటి నాయకుడు కూడా ఒక ప్రాంతానికి పరిమితమైపోయారు తప్ప రాష్ట్రాన్ని ఏలే స్థాయికి వెళ్లలేకపోయారు. బహుశా హత్య కావించబడకుండా ఉంటే ఆ పరిస్థితి ఉండేదేమో. 

అదలా ఉంటే రాష్ట్ర సింహాసనం చాలాకాలం రెడ్డి-కమ్మ సమాజికవర్గాల గుప్పెట్లోనే ఉంది. అసలు కాపులకి రాష్ట్రస్థాయి ప్రజాకర్షణే లేదా అంటే పొరపాటు. సినిమారంగం చిరంజీవి పుణ్యమా అని నాలుగుదశాబ్దాల తరబడి నేటికీ కాపు ఆధిపత్యం చాటుతూనే ఉంది. కానీ రాజకీయాలకొచ్చేసరికి పని జరగడంలేదు. 

2008లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టగానే కొత్త సామాజికవర్గం ఏలుబడిలోకి రాష్ట్రం వెళ్లబోతోందని చాలా గట్టిగా నమ్మారు కొన్ని వర్గాల ప్రజలు. 

కానీ వై.ఎస్.ఆర్ హవా రెండవమారు కూడా కొనసాగడంతో ప్రజారాజ్యం ఆశించిన ఫలితం చూడలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని నమ్మిన చిరంజీవి అప్పటి ఉమ్మడిరాష్ట్రంలో 294కి గాను కేవలం 18 ఎమ్మెల్యే సీట్లను గెలిచారు. తిరుపతి, పాలకొల్లు నుంచి నిలబడి కేవలం తిరుపతిలో నెగ్గి పరపతి దక్కించుకోగలిగారు. 

ఫలితం ఎలా ఉన్నా నిలబడి పోరాడే పోరాటపటిమ ఆయనలో కొరవడింది. అధికారం లేకుండా ఏమిటని అవమానం ఫీలయ్యారో, లేక అధికారం లేకుండా పార్టీని ఐదేళ్ల పాటు నడపడం ఖర్చుతో కూడుకున్న పని అని వెనకాడారో,  రాజకీయాల్లో ప్రతికూలపవనాలు వీస్తే తట్టుకునే ఆత్మస్థైర్యం తనకు లేదని గ్రహించారో తెలీదు కానీ ఆయన తన పార్టీని 2011 ఫిబ్రవరిలో కాంగ్రెస్ మహాసముద్రంలో కలిపేసి కేంద్రంలో టూరిజం మంత్రిగా కొన్నాళ్లు కొనసాగి రాజకీయాలకి స్వస్తి చెప్పేసారు. 

ఒక రకంగా తన రాజకీయస్వప్నాన్నే కాకుండా కాపు సామాజిక వర్గ కలల్ని ఆయన కాలరాసేసారు. ఆయనపై ఉన్న గౌరవంతో కాపులు చాలామంది మౌనంగా ఉన్నా, కొందరు బహిరంగంగానే విమర్శించారు. అలా కాకుండా ఆ పార్టీని అలా విలీనం చేయకుండా ఉండుంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏదైనా మలుపు తిరిగేదేమో. విభజిత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తిగా మాయమైపోయిన వేళ తెదేపాకి ఏకైక ప్రత్యర్ధిగా వైకాపా ఉంది. నిజానికి విలీనం చేయకుండా ఒక్క మూడేళ్లు ఓపిక పట్టుంటే ఆ స్థానంలో ప్రజారాజ్యం ఉండేది. మూడవ ప్రత్యామ్నాయంగా మాత్రమే వైకాపా కనపడేది. 

ఇక 2014 ఎన్నికల టైముకి పవన్ కళ్యాణ్ జనసేనతో ముందుకొచ్చారు. కానీ చిరంజీవి కొట్టిన దెబ్బని అప్పటికి ఇంకా మరిచిపోలేని కాపులు చాలామంది “ఈ కుటుంబాన్ని నమ్ముకుని ముందుకెళ్లలేం” అంటూ నిట్టూర్చారు. అయినప్పటికీ పవన్ తన అన్నలా కాకుండా కాస్తంత తెగువ చూపించి ముందుకెళ్లారు. 

2019 ఎన్నికల్లో తన ప్రయత్నం చేసినా తాను నిలబడ్డ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి ఓడిపోయారు. తన పార్టీ నుంచి కేవలం ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటుని గెలిచారు. 2009 ఎన్నికల నాటి ప్రజారాజ్యం ఫలితంతో చిరంజీవి పడ్డ అవమానం కంటే 2019లో పవన్ ఫేస్ చేసిన అవమానం చాలా పెద్దది. తానే రెండు చోట్లా ఓడిపోవడం అన్నది మరింత దారుణం. అయినా కూడా తన అన్నగారిలా పార్టీ షట్టర్ మూసేయకుండా సిగ్గు, బిడియం, అవమానంలాంటివన్నీ పక్కన పెట్టి ముందుకెళ్లారు. 

పవన్ ని పరిశీలిస్తే ఒకటర్ధమవుతుంది. రాజకీయంలో జయాపజయాలకి అతీతంగా అలా పడుండాలి, ఏదో ఒకటి చేస్తుండాలి… ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సమీకరణంలో ఫలితం రావొచ్చు. ఆయన అనుకున్నట్టే జరిగింది. ఆ ఫలితం పదవి రూపంలో కాకపోయినా చంద్రబాబుతో చేయికలపడం వల్ల చాలావరకు కలిసొచ్చింది. 

చంద్రబాబు రాజకీయ వెన్నెముకకి సొంతబలం లేదు.. వెన్నుని ఆనుకోవడానికి వేరే ఏదైనా పార్టీ కావాలి. 2019 ఎన్నికల తర్వాత పరిణామాల రీత్యా జనసేనని ఎంచుకున్నాడాయన. జగన్ ని ఓడించాలంటే వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న అభిప్రాయాన్ని చంద్రబాబు పవన్ లో బాగానే నాటారు. 

ఆ దిశగా జగన్-వ్యతిరేక కూటమిని ఏర్పరిచే పనిలో కొన్నాళ్లు నిమగ్నమయ్యారు పవన్. కానీ ముందు నుంచీ బీజేపీ ఏరకంగానూ తెదేపాతొ పొత్తుకి సిద్ధంగా లేదు. చివర్లోనైనా మనసుమారుతుందని బాబు-పవన్ ఇద్దరూ ప్రయత్నాలు చేసారు. 

ఆ చివరి స్టేజ్ వచ్చిందిప్పుడు. అయినా బీజేపీ మనసు మారలేదు. బాబుని ఎన్.డి.ఏ సమావేశానికి పిలవలేదు. కేవలం పవన్ తోటే జట్టు కట్టడానికి సిద్ధపడి పిలిచింది. 

రేపో మాపో పవన్ ని తమ పొత్తులో భాగంగా సీయం అభ్యర్థిగా భాజపా వారు ప్రకటిస్తారని వినిపిస్తోంది. ఇప్పుడు పవన్ దారి మార్చి తనకు తెదేపాతోనే పొసుగుతుందని బయటికొచ్చేస్తే ప్రమాదంలో పడినట్టే. తన గోయి తాను తీసుకున్నట్టే. ఎందుకంటే ఏ కారణం చేతనైనా చంద్రబాబు ఓడిపోతే పవన్ కచ్చితంగా తన పార్టీకి షట్టర్ మూసుకునే పరిస్థితి తీసుకొస్తారు కేంద్రం వారు. ఒకవేళ గెలిస్తే పవన్ సీయం కాడు..చంద్రబాబే అవుతాడు. అంటే ఈ మార్గంలో ఫలితం ఏదైనా కాపుల కలల్ని కాలరాయడమే అవుతుంది. 

కాంగ్రెసుని నమ్ముకుని రెడ్లు, తెదేపాని నమ్ముకుని కమ్మలు సెటిలైనట్టు జనసేనని నమ్ముకుని కాపులు నిలబడాలంటే ప్రస్తుతం వారు, పవన్ భాజపాని నమ్మాలసిందే. రాష్ట్రంలో భాజపాకి పెద్దగా ఓటర్స్ లేని విషయం కేంద్రానికి కూడా తెలుసు కనుక కీలకమైన ఏ 20-30 స్థానాల్లో మాత్రమే బీజేపీ తన అభ్యర్థుల్ని నిలబెట్టి మిగిలిన అన్ని స్థానాల్లోనూ జనసేననే నిలబడమనొచ్చు. పైగా జనసేన అభ్యర్థుల ఎలక్షన్ ఖర్చులు కూడా కొంతవరకు భాజపా భరించవచ్చు. అదృష్టం బాగుండి గెలిస్తే రాజయోగం, ఓడినా పెద్దగా ఇబ్బందులుండవు. ప్రస్తుత పరిస్థితుల్లో కాపుల సీయం కల కలలోనైనా నెరవేరాలంటే పవన్ కి ఇదొక్కటే మార్గం. మరి తొందరపడకుండా ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

శ్రీనివాసమూర్తి