రేపట్నుంచే వరుణ్ తేజ్ పెళ్లి వేడుక

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకకు సర్వం సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, రేపట్నుంచే ఈ పెళ్లి వేడుక మొదలుకాబోతోంది. ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట, రేపట్నుంచి వివాహ వేడుకల్ని ప్రారంభించబోతున్నట్టు…

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకకు సర్వం సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, రేపట్నుంచే ఈ పెళ్లి వేడుక మొదలుకాబోతోంది. ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట, రేపట్నుంచి వివాహ వేడుకల్ని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.

ముందుగా పెళ్లికి వచ్చిన బంధువులందరికీ కాక్ టైల్ పార్టీ ఇవ్వబోతున్నారు. అలా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మొదలుపెట్టి, ఆ మరుసటి రోజు హల్దీ, మెహందీ ఫంక్షన్లను నిర్వహించనున్నారు. ఇక 1వ తేదీన అసలైన పెళ్లి వేడుక షురూ అవుతుంది. హిందూ సంప్రదాయ పద్ధతిలో లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు వరుణ్ తేజ్.

పెళ్లి తర్వాత వధూవరులతో పాటు అందరూ ఇండియా వచ్చేస్తున్నారు. హైదరాబాద్ లో 5వ తేదీన గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 5వ తేదీన హైటెక్స్ లో జరగనున్న రిసెప్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు, కొంతమంది మెగా ఫ్యాన్స్ హాజరుకాబోతున్నారు.

ఇటలీ చేరుకున్న చిరంజీవి కుటుంబం, అక్కడ అందమైన లొకేషన్ లో గ్రూప్ ఫొటో దిగింది. రామ్ చరణ్, ఉపాసనతో పాటు.. ఉపాసన తల్లిదండ్రులతో దిగిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పెళ్లికి పవన్ కల్యాణ్ కూడా తన భార్య అన్నాతో కలిసి హాజరయ్యాడు.

మరోవైపు ఈ పెళ్లికి రావాల్సిందిగా రేణుదేశాయ్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే ఆమె వెళ్లడం లేదు. వరుణ్ తేజ్ తన కళ్ల ముందు పెరిగాడని, తన ఆశీస్సులు వరుణ్ తేజ్ కు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. గతంలో నిహారిక పెళ్లికి కూడా తనకు ఆహ్వానం అందిందని, కానీ తను వెళ్లలేదని, పిల్లల్ని పంపించానని చెప్పుకొచ్చారు. 

టుస్కానీలోని బోర్గోశాన్ రిసార్ట్ లో వరుణ్-లావణ్య పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ రిసార్ట్ కు వందేళ్ల చరిత్ర ఉంది. అందమైన ద్రాక్ష తోటలు, సెలయేర్లు, చిన్న కొండల మధ్య ఈ రిసార్ట్ ఉంది. ఇందులో మొత్తం 29 సూట్ రూమ్స్, 2 పూల్ విల్లాస్ ఉన్నాయి. ఒక రాత్రికి ఇందులో బస చేయాలంటే 40వేల రూపాయల నుంచి ధరలు ప్రారంభమౌతాయి. ఇక పూల్ విల్లాలో ఉండాలంటే, ఒక రాత్రికి లక్ష రూపాయలకు పైగానే వెచ్చించాలి. ఇక్కడే చరణ్-చిరంజీవి కుటుంబ సభ్యులు ఫొటో దిగారు.