పాత బాస్‌పై మోజు తీర‌లేదు!

పార్టీ మారినా చంద్ర‌బాబుపై ఆ మాజీ మంత్రికి మోజు తీర‌లేదు. ఒక‌వైపు కుటుంబ పార్టీల‌ని రాష్ట్ర‌స్థాయి మొద‌లుకుని జాతీయ స్థాయి పార్టీ వ‌ర‌కూ టీడీపీని దూరం పెట్టాల‌ని భావిస్తున్నా, ఆయ‌న మాత్రం త‌న పాత…

పార్టీ మారినా చంద్ర‌బాబుపై ఆ మాజీ మంత్రికి మోజు తీర‌లేదు. ఒక‌వైపు కుటుంబ పార్టీల‌ని రాష్ట్ర‌స్థాయి మొద‌లుకుని జాతీయ స్థాయి పార్టీ వ‌ర‌కూ టీడీపీని దూరం పెట్టాల‌ని భావిస్తున్నా, ఆయ‌న మాత్రం త‌న పాత బాస్‌పై అభిమానం చంపుకోలేక‌పో తున్నారు. త‌మ‌తో క‌లిసి ప‌ని చేసేందుకు రావాల‌ని ఆహ్వానించ‌డం ఏపీలో రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

అనంత‌పురంలో బీజేపీ రాయ‌ల‌సీమ జోన‌ల్‌స్థాయి స‌మావేశం శ‌నివారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి జాతీయ‌, రాష్ట్ర‌స్థాయి బీజేపీ ప్ర‌ముఖులంతా హాజ‌ర‌య్యారు. స‌మావేశంలో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ కుటుంబ పార్టీల‌ను సాగ‌నంపి బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు పార్టీని ప‌టిష్టం చేయాల‌ని పిలుపునిచ్చారు. 

జ‌న‌సేన‌తో పొత్తు ఉన్న‌ప్ప‌టికీ, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌క్క చూపులు చూస్తుండ‌డంతో ఆయ‌నపై బీజేపీ ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టుంది. ఇటీవ‌ల జ‌న‌సేన‌తో సంబంధం లేకుండానే నిర్ణ‌యాల‌ను బీజేపీ ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. రాయ‌ల‌సీమ జోన‌ల్‌స్థాయి స‌మావేశానికి వెళ్లిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పాత బాస్ చంద్ర‌బాబుపై ప్రేమాభిమానాలు చూపారు. రాష్ట్రంలో అరాచ‌క‌, దోపిడీ పాల‌న సాగుతోంద‌ని విమ‌ర్శించారు. 

జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌మ పార్టీతో క‌లిసి రావాల‌ని పిలుపునివ్వ‌డం విశేషం. ఏ పార్టీ అయినా బీజేపీతో క‌లిసి రావాల్సిందే అని తేల్చి చెప్పారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆదినారాయ‌ణ‌రెడ్డి సొంత అన్న కుమారుడు భూపేష్ టీడీపీ ఇన్‌చార్జ్‌. దీంతో త‌న కుటుంబం నుంచి ఎవ‌రో ఒక‌రు మాత్ర‌మే పోటీ చేయాల్సిన ప‌రిస్థితి. పొత్తు పెట్టుకుంటే విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఉండ‌ద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి ఆలోచ‌న‌. 

అంతేకాకుండా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిస్తే త‌ప్ప‌, వైఎస్సార్‌సీపీని గ‌ద్దె దింప‌లేమ‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి న‌మ్ముతున్నారు. ఉమ్మ‌డి శ‌త్రువైన జ‌గ‌న్‌ను అధికారం నుంచి సాగ‌నంపేందుకు రానున్న రోజుల్లో ఏపీలో ఎన్నెన్ని ర‌కాల రాజ‌కీయాల‌ను చూడాల్సి వ‌స్తుందో!