ఏపీలో ఏం జరిగినా ఎల్లో మీడియా గోరింతలు కొండంతలు చేయడం చూస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయనే విష ప్రచారం… జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మొదలైంది. ఇక ఏపీ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య అవాంఛనీయ గ్యాప్ కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థపై ఏపీ సర్కార్ ధిక్కరణకు పాల్పడుతోందని, జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారనే ప్రచారం కూడా కొంత కాలం ఉధృతంగా సాగింది.
ఇవన్నీ ఎలా వున్నా ఢిల్లీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఒకింత మొట్టిక్కాయ వేసినంత పని. ఇదే పరిస్థితి ఒకవేళ ఏపీకి ఎదురై వుంటే… అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగకుండా ఉండదు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహించారు. అసలేం జరిగిందంటే…
సదస్సులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర ప్రసంగిస్తూ తమ రాష్ట్ర సీఎస్ సోమేశ్‌కుమార్ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్‌లతో తాను సమావేశమై న్యాయ వ్యవస్థ సమస్యలను వివరించానన్నారు. వాటిపై కేసీఆర్ సానుకూల వైఖరితో స్పందించి, వాటి పరిష్కారానికి రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారని గుర్తు చేశారు.
అయితే రోజులు గడుస్తున్నా సీఎస్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ నిర్లక్ష్య ధోరణిపై ఎన్వీ రమణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో అలసత్వం ఏంటని ప్రశ్నించారు.
తాము వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదన్నారు. న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం తీసుకునే నిర్ణయాలను అమలు చేయడంలో నాన్చివేత ధోరణి పనికి రాదని ఆయన హితవు చెప్పారు. ఒకవేళ ఇదే పరిస్థితి ఏపీకి ఎదురై వుంటే, వామ్మో భూమి తలకిందులైందనే రేంజ్లో ఎల్లో మీడియా నానా యాగీ చేసి వుండేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.