నాగరిక సమాజం సిగ్గు పడాల్సిన పరిస్థితి. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఒకవైపు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనను మరిచిపోకనే మరొకటి పునరావృతమైంది. బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు పాల్పడిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించినా, మృగాళ్లలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని ఊరూరు తిరుగుతున్న మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. భర్తపై దాడి చేసి, భార్యను తీసుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనకు బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్ వేదికైంది. ఈ ఘటన గత అర్ధరాత్రి చోటు చేసుకుంది.
రేపల్లె రైల్వేస్టేషన్‌లో వలసకూలీలైన భార్యాభర్త తలదాచుకున్నారు. లోకమంతా గాఢనిద్రలో ఉండగా, పైశాచికత్వానికి దుండగలు పాల్పడ్డారు. భర్తను కొట్టి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తనపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. చట్టాలు, కోర్టులు, శిక్షలు లాంటివి కామాంధుల వైఖరిలో మార్పు తీసుకురాలేకున్నాయి. మహిళల రక్షణ సమాధానం లేని ప్రశ్నగా మిగులుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి ఘటనపై సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.