పవన్‌ ఎందుకు సైలెంట్‌ అయ్యాడు?

తాట తీస్తా – అంటూ పైరసీ దారులకు చమటలు పట్టించాడు పవన్‌ కల్యాణ్‌. అత్తారింటికి దారేది కృతజ్ఞతల సభలో పవన్‌ వాడీ వేడీ ప్రసంగం చూసి మరికొద్ది రోజుల్లో ఎవరికో మూడడం ఖాయం అనుకొన్నారంతా.…

తాట తీస్తా – అంటూ పైరసీ దారులకు చమటలు పట్టించాడు పవన్‌ కల్యాణ్‌. అత్తారింటికి దారేది కృతజ్ఞతల సభలో పవన్‌ వాడీ వేడీ ప్రసంగం చూసి మరికొద్ది రోజుల్లో ఎవరికో మూడడం ఖాయం అనుకొన్నారంతా. ఈ కుట్ర వెనుక ఎవరున్నారు??  అనే విషయంపై జోరుగా చర్చించుకొన్నారు. పవన్‌ నోటి నుంచి ఎవరిదో ఒకరి పేరొస్తుంది – అంటూ ఎదురుచూశారు. అయితే ఇవేం జరగలేదు. సరికదా.. పవన్‌ ఎప్పట్లా సైలెంట్‌ అయిపోయాడు. దాంతో ఎన్నో ప్రశ్నలు. పవన్‌ ఏం చేయబోతున్నాడు?  ఇప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు??  అంటూ ఆరా తీస్తున్నారు పవన్‌ అభిమానులు.

నిజానికి పవన్‌ ఉద్దేశం వేరు. ఈ కుట్ర వెనుక సినిమా రంగానికి చెందిన కొంతమంది పెద్దల హస్తం ఉందని తన అభిమానులకు, మీడియాకూ చెప్పాలనుకొన్నాడు. చెప్పాడు. కాకపోతే కాస్త ఆవేశ పడ్డాడు. ఎవరినో బజారుకి ఈడ్చే తత్వం కాదు పవన్‌ది. ఎందుకంటే ఏం చేసినా జరగాల్సిన నష్టమేదో జరిగిపోయింది. పైగా అత్తారింటికి దారేది సినిమా నష్టాల బాట పడితే,  నిర్మాత బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ ఈ పైరసీ వల్ల తీవ్రంగా నష్టపోతే – అప్పుడు పవన్‌ రియాక్షన్‌ వేరుగా ఉండేది. కానీ అలా జరగలేదు. పైరసీ సానుభూతి కెరటంలా పనిచేసింది. కోట్లు గుమ్మరించేలా చేసింది. 

దాంతో పవన్‌ ఆవేశం చల్లబడింది. అయితే పైరసీ చేసినవాళ్లని వదిలేస్తాడా..?  అంటే అదీ చెప్పలేం. పవన్‌ ఇప్పుడు కట్టుదిట్టమైన సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నాడట. పైరసీ దారుల్ని చట్టపరంగా శిక్షించాలి తప్ప… ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అనుకొంటున్నాడు. అలా చేస్తే.. ఆకాశం అంత ఉన్న తన ఇమేజ్‌ డామేజ్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఒక్కటి మాత్రం నిజం. పవన్‌ అందరికీ తగిన బదులిస్తాడు. కానీ ఇప్పుడే కాదు. తాట తీయాల్సిన రోజు మాత్రం  అందరి పేర్లు స్వయంగా ప్రకటిస్తాడు. అంత వరకూ ఓపిగ్గా ఎదురుచూడాలంతే.?