సినిమా రివ్యూ: దూసుకెళ్తా

రివ్యూ: దూసుకెళ్తా రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ తారాగణం: మంచు విష్ణు, లావణ్యా త్రిపాఠి, కోట శ్రీనివాసరావు, పంకజ్‌ త్రిపాఠి, బ్రహ్మానందం, అన్నపూర్ణ, మాస్టర్‌ భరత్‌, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, అలీ…

రివ్యూ: దూసుకెళ్తా
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌:
24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ
తారాగణం: మంచు విష్ణు, లావణ్యా త్రిపాఠి, కోట శ్రీనివాసరావు, పంకజ్‌ త్రిపాఠి, బ్రహ్మానందం, అన్నపూర్ణ, మాస్టర్‌ భరత్‌, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, అలీ తదితరులు
కథనం: వీరు పోట్ల, గోపీమోహన్‌
సంగీతం: మణిశర్మ
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి
నిర్మాత: డా॥ ఎం. మోహన్‌బాబు
కథ, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల
విడుదల తేదీ: అక్టోబర్‌ 17, 2013

వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందిన ‘దూసుకెళ్తా’తో మరోసారి ‘దేనికైనా రెడీ’ రిజల్ట్‌ని రిపీట్‌ చేయాలని విష్ణు ఆశ పడుతున్నాడు. గత ఏడాది దసరా సీజన్‌లోనే వచ్చిన ‘దేనికైనా రెడీ’ విష్ణుకి కాస్త ఉత్సాహాన్నిచ్చే విజయాన్ని అందించింది. ఈసారి కూడా సెంటిమెంట్‌గా దసరాకే తన కొత్త సినిమా రిలీజ్‌ చేశాడు. మరి ఈసారి ఫలితం ఎలాగుంటుందో?

కథేంటి?

చిన్నతనంలో వెంకటేశ్వరరావు అలియాస్‌ చిన్నా (విష్ణు) చేసిన పొరపాటు కారణంగా అలేఖ్య (లావణ్య)  తన తండ్రికి దూరమవుతుంది. పెద్దయిన తర్వాత చిన్నా ఆమె ప్రేమలో పడతాడు. చిన్నప్పుడు తన కారణంగా కుటుంబానికి దూరమైన అమ్మాయే అలేఖ్య అని తెలుసుకుని ఆమెని తన కుటుంబంతో కలపడానికి నిర్ణయించుకుంటాడు. అది చేయడానికి చిన్నా ఏం చేశాడనేదే మిగతా కథ. 

కళాకారుల పనితీరు!

విష్ణు ఇంతకుముందు చేసిన తరహా పాత్రనే పోషించాడు. అయితే మునుపటి చిత్రాల్లో ఎక్కువగా కమెడియన్స్‌పై ఆధారపడ్డ విష్ణు ఈ చిత్రంలో అన్నీ తానే అవ్వాలని చూశాడు. నటన పరంగా కాస్త మెరుగైనా కానీ వాచకంలో ఇంకా చాలా బెటర్‌ కావాలి. లుక్స్‌ పరంగా చేసిన మార్పు చేర్పులు కూడా అంత కుదిరినట్టు లేవు. అతని హెయిర్‌ స్టయిల్‌, కాస్టూమ్స్‌ ఆకట్టుకోవు. 

‘అందాల రాక్షసి’ ఫేమ్‌ లావణ్య ఈ చిత్రంలో అంత అందంగా కనిపించలేదెందుకో. ఆ సినిమాలో నేచురల్‌గా కనిపించి ఆకట్టుకున్న లావణ్య ఇందులో ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. నటన కూడా అంతంతమాత్రమే. మెయిన్‌ విలన్‌గా పంకజ్‌ తేలిపోయాడు. తెలుగు సినిమా విలన్‌కి ఉండాల్సిన పర్సనాలిటీ లేకపోవడంతో అతని పాత్రకి ఎంత వెయిట్‌ ఇచ్చినా కానీ ఇంపాక్ట్‌ లేకుండా పోయింది. కోట శ్రీనివాసరావు గురించి కొత్తగా చెప్పేదేముంది? బ్రహ్మానందంని ఈ చిత్రంలో సరిగా వాడుకోలేకపోయారు. అతనికి లెంగ్తీ క్యారెక్టర్‌ అయితే ఇచ్చారు కానీ నవ్వించింది చాలా తక్కువ. వెన్నెల కిషోర్‌ క్యారెక్టర్‌ నిడివి తక్కువే అయినా ఉన్నంతలో అతని సీన్లే పండాయి. అతని కాంబినేషన్‌లో విష్ణు, భరత్‌ల ‘నీకో కథ చెప్తా’ సీన్స్‌ బాగున్నాయి. మాస్టర్‌ భరత్‌ ఫర్వాలేదనిపించాడు. అతని టైమింగ్‌కి తగ్గ పంచ్‌లు పడలేదు. రఘుబాబు కూడా చేసింది తక్కువే. అలీ క్యారెక్టర్‌కి అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదు. 

సాంకేతిక వర్గం పనితీరు:

వీరు పోట్ల సంభాషణలు అక్కడక్కడా నవ్వించాయి. ఓవరాల్‌గా చూస్తే మాత్రం డైలాగ్‌ రైటర్‌గా యావరేజ్‌ అవుట్‌పుట్‌ ఇచ్చాడు. కథా రచయితగా కూడా అతను అంతగా రాణించలేదు. చాలా సాధారణ కథ రాసుకుని దానిని నేటి ట్రెండ్‌కి తగ్గట్టు మలిచేందుకు ప్రయత్నించాడు. శ్రీను వైట్ల సినిమాలకి ఆస్థాన రచయిత అయిన గోపీమోహన్‌ కథనంలో వీరుతో పాటు ఓ చెయ్యి వేశాడు. దాని వల్ల దీంట్లో కూడా వైట్ల సినిమాల శైలి కనిపించింది. 

మణిశర్మ స్వరపరిచిన పాటలేం బాలేదు. వెటరన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాటల్తో రాణించకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ బాగానే అందించాడు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. సినిమా నిడివి మరీ ఎక్కువ ఉంది. ఎడిటర్‌ జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు వీరు పోట్ల తన తొలి చిత్రం ‘బిందాస్‌’ ఫార్మేట్‌ని ఫాలో అయ్యాడు. కథ, కథనాలు సాధారణంగా ఉండడంతో వినోదం మీద డిపెండ్‌ అయ్యాడు. అయితే కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు రూపొందించడంలో విఫలమయ్యాడు. 

హైలైట్స్‌:

  •  సెకండాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్‌

డ్రాబ్యాక్స్‌:

  •  కథ, కథనం
  •  పాటలు
  •  విసిగించే ప్రథమార్థం

విశ్లేషణ:

శ్రీను వైట్ల ‘ఢీ’ వచ్చిన దగ్గర్నుంచి చాలా మంది ఆ ఫార్ములాని ఫాలో అవుతూ సినిమాలు తీస్తున్నారు. శ్రీను వైట్ల కూడా ‘బాద్‌షా’ వరకు అదే పంథాని అనుసరించి కొన్ని విజయాలు కూడా అందుకున్నాడు. విష్ణు కూడా ఢీ తర్వాత వేరే టైప్‌ సినిమాలు ట్రై చేసి చివరకు మళ్లీ అదే లైన్‌లోకి వచ్చేశాడు. ‘దేనికైనా రెడీ’ తర్వాత ఇంకోసారి అదే తరహా సినిమాతో ముందుకొచ్చాడు. 

ఇప్పటికే బోర్‌ కొట్టిన ఈ ఫార్మేట్‌లో ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసే ట్విస్టులు గట్రా ఏమీ ఉండవు. ప్రథమార్థం అంతా ఏదో అలా అలా కాలక్షేపం చేసేసి, ద్వితీయార్థంలో హీరోని విలన్‌ ఇంట్లో ప్రవేశ పెట్టేసి, కామెడీతో నెట్టుకొచ్చి, చిన్న యాక్షన్‌ క్లయిమాక్స్‌తో ముగించేయడం మినహా ఇక ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు. కాబట్టి ఈ ఫార్మేట్‌లో సక్సెస్‌ కావాలంటే తప్పనిసరిగా కామెడీ చాలా బాగా పండాలి.

‘దూసుకెళ్తా’లో కామెడీ చేయడానికి చాలా ప్రయత్నించారు కానీ ఫలితం మాత్రం చాలా తక్కువ సీన్లకి వచ్చింది. బ్రహ్మానందం చాలా సేపు ఉన్నా కానీ నవ్వించింది తక్కువ. కేవలం బ్రహ్మానందం ఉంటే నవ్వేస్తారనుకుంటే పొరపాటు. అతడిని ‘వాడుకోవడం’ తెలియాలి. పూర్తిగా శ్రీను వైట్ల పంథాని అయితే ఫాలో అయ్యారు కానీ అతని స్థాయిలో వినోదాన్ని పండిరచలేకపోయారు. 

దర్శకుడు వీరు పోట్ల ఎప్పుడూ యావరేజ్‌ సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తుంటాడా అనిపిస్తుంది. అతని మూడు చిత్రాలు చూసిన తర్వాత వీరు పోట్ల మరీ ఎక్కువ సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాడనే ఫీలింగ్‌ తప్పక కలుగుతుంది. ఎలాగైనా హిట్‌ కొట్టాలని తీసే వారి నుంచి ఎప్పుడో అప్పుడు పెద్ద హిట్లు వచ్చేస్తాయి కానీ ఏదో విధంగా గట్టెక్కాలి అనుకునే వారి నుంచి కేవలం సాధారణ సినిమాలు మాత్రమే వస్తాయి. వీరు పోట్ల దర్శకుడిగా తనకి తానే పెద్ద బెంచ్‌ మార్క్‌లు సెట్‌ చేసుకోకపోతే అతని సినిమాలు ఇలా యావరేజ్‌ మార్కు దాటలేక అతి మామూలు చిత్రాలుగా మిగిలిపోతాయి. 

ప్రేక్షకుల్ని తనివి తీరా నవ్వించే కామెడీ లేని ఈ చిత్రం వారిని థియేటర్ల వరకు రాబట్టడంలో ఎంతవరకు సక్సెస్‌ అవుతుందనేది వేచి చూడాలి. విష్ణు అప్పుడు ‘ఢీ’కి ప్రయత్నించి అంతకంటే తక్కువ స్థాయి ‘దేనికైనా రెడీ’ ఇచ్చాడు. ఈసారి ‘దేనికైనా రెడీ’ స్థాయిని అందుకుంటే చాలనుకుని దాని కంటే దిగువ స్థాయి ఫలితం మాత్రమే అందుకున్నాడు. 

బోటమ్‌ లైన్‌:    దూసుకెళ్లడం కష్టమే!

 ఏ.ఆర్‌.