ఏ రోటి దగ్గర ఆ పాట పాడడం అన్నది తెలుగుదేశం అంటే నరనరాన అభిమానం నింపుకున్న జర్నలిస్ట్ లకు, మేధావులకు అలవాటు. బలగం పొట్టి సీతయ్య డబుల్ స్టేట్ మెంట్ ఇచ్చినట్లు ఇచ్చేస్తుంటారు. తమకు నచ్చితే ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికి వుందంటే అది న్యాయవ్యవస్థ వల్లనే.
తమకు నచ్చకపోతే, ఈ దేశంలో ఆఖరికి న్యాయవ్యవస్థ కూడా మేనేజ్ చేయడానికి వీలుగా మారిపోతోంది. అంతే అనిపిస్తుంది ఈ వారం సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే వండి వార్చిన కొత్త పలుకు చూస్తే. చంద్రబాబు లోపల వుండిపోయారు యాభై రోజులుగా. దీనికి కారణం ఒక్కటే జగన్ న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్లనే అన్నది ఈ పలుకుల సారాంశం.
సరే, ఈ పలుకుల సంగతికేమి కానీ, కాస్త వెనక్కు వెళ్లి చూద్దాం. గడచిన నాలుగేళ్లుగా తెలుగుదేశం అను’కుల’ మీడియాలో ఒకే రకమైన హెడ్డింగ్ లు దాదాపు నిత్యం కనిపించేవి. జగన్ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయ. పభుత్వానికి కోరు చీవాట్లు, అధికారులను నిలదీసిన కోర్టు, అధికారులకు కోర్టు శిక్ష, జగన్ కు కోర్టులో ఎదురు దెబ్బ..ఇలా రకరకాలుగా. కానీ అన్నింటి సారాంశం దాదాపు ఒకటే. కోర్టులో జగన్ చేసే పనులను, తీసుకునే నిర్ణయాలకు చుక్కెదురు అవుతోంది అన్నది.
కోర్టుల వల్లే తమకు న్యాయం జరిగిందని, జరుగుతుందని అమరావతి రైతులు రోడ్డుకు ఇరుపక్కలా నిల్చుని చేసిన హంగామాలు మరిచిపోయారా? ఓ సారి జగన్ ప్రభుత్వాన్ని ఓ న్యాయమూర్తి తూర్పారపట్టిన వైనం సంగతేమిటి? అసలు శాసనసభ మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే అమలు చేయడానికి ఇప్పటి వరకు వీలు అయిందా? ఆఖరికి ప్రభుత్వానికి తమకు నచ్చిన రంగులు కూడా పంచాయతీ భవనాలకు వేసుకునే స్వేచ్ఛ లేదని తేలింది కదా?
మరి అలా జరిగినపుడల్లా కోర్టులు ముద్దు వచ్చాయా? కోర్టులను, తీర్పులను, గౌరవ న్యాయమూర్తులను సోషల్ మీడియాలో కించపరిచారని కొంతమందిని ఎన్ని రోజుల పాటు జైలులో వుంచారు. బెయిల్ రాలేదు కదా చాలా కాలం వరకు. అప్పుడంతా కోర్టులు చేసినవి అంతా శహభాష్. మరి జగన్ అప్పుడు కోర్టులను మేనేజ్ చేయలేకపోయారు అని అనుకోవాలా? ఎందుకని అప్పుడు మేనేజ్ చేయలేకపోయారు? ఎందుకని ఇప్పుడు సాధ్యమవుతోందని అనుకుంటున్నారు.
అది కూడా, ఆ సూక్ష్మం కూడా చెప్పేస్తే మరింత క్లారిటీగా వుండేది కదా? గత నాలుగేళ్లుగా కోర్టుల్లో ఎన్ని పదుల కేసులు జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా దాఖలయ్యాయి. వాటిలొ వన్ పర్సంట్ కు అయినా జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చిన దాఖలా వుందా? అప్పుడు మరి వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేసినట్లు?
అంతెందుకు వ్యవస్థలను ఎవరు ఎలా మేనేజ్ చేస్తారో జనాలకు తెలుసు. దశాబ్దాల కాలంగా చంద్రబాబు తన మీద పెట్టిన కేసులను తన మీదకు రాకుండా ఎలా చేస్తున్నారో అందరికీ తెలుసు. ఈ మధ్యనే తన కేసుకు సంబంధించే ఎలా తెలివిగా ఎక్కడకు వెళ్లాలో డిసైడ్ చేసే విధంగా ప్లాన్ చేసారో వాట్సాప్ ల్లో తెగతిరిగింది. అది చదివిన వారంతా ఇంత అద్భుతమైన ఎత్తుగడలు వేయగలరా అని ఆశ్చర్యపోవడం తప్ప మరేమీ చేయడానికి వుండదు.
ఇప్పుడు బెయిల్ ఇంకా రాలేదు. క్వాష్ కాలేదు కనుక ఇలా పలుకులు పలుకుతున్నారు. అదే వచ్చి వుంటే న్యాయం గెలిచింది. జగన్ పన్నాగాలు పారలేదు. జగన్ కుట్రలకు కోర్టు అడ్డుకట్ట వేసింది అనే రకరకాల హెడ్డింగ్ లు కనిపించేవి.
తమకు అనుకూలమైతే ఒకలా.. కాకుంటే మరోలా… అదే కదా ఈ బలగం పొట్టి సీతయ్యలకు చాతనయింది.