సినిమాల్లో రాక్షసులను చూపించినపుడు కొన్నిసార్లు చింపిరి గిరజాల జుట్టు, నెత్తి మీద కొమ్ములు, నోట్లో కోరలు, మెడలో పుర్రెల మాలలు, మొలకు చర్మాలు కట్టుకున్నట్లు చూపిస్తారు. నల్లగా, వికారంగా కూడా ఉంటారు. అదో రకమైన భాష కూడా మాట్లాడతారు. ఇదంతా తక్కువ స్థాయి రాక్షసులను చూపించినప్పుడు మాత్రమే. రావణుడు, మైరావణుడు, హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు, ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి.. యిలాటి వాళ్లను చూపించినపుడు యించుమించు దేవతల గెటప్‌లో ఉంటారు. విభీషణుడూ అంతే. కుంభకర్ణుణ్ని పెద్దగా చూపిస్తారు తప్ప కొమ్ములతో చూపించరు. రావణాదులు బ్రాహ్మణులు కాబట్టి అలా చూపిస్తున్నారు అనుకుందామంటే, వాళ్ల చెల్లెలు శూర్పణఖను సగటు రాక్షసి (పైన చెప్పిన వర్ణనతో)గా చూపిస్తారు.
మనకు బాగా తెలిసిన మరో రాక్షస పాత్ర ఘటోత్కచుడు. తండ్రి మానవుడైన క్షత్రియుడు. అతనికీ కోరలు, కొమ్ములూ ఉండవు. ఆహార్యంలో కాస్త ఆటవిక లక్షణాలు చూపిస్తున్నారు తప్ప, వికృతంగా ఏమీ చూపించటం లేదు. అసలు రాక్షసులలో బ్రాహ్మణులు అనే పదమే విరుద్ధంగా అనిపిస్తుంది. రాక్షస స్త్రీ క్షత్రియ మానవుణ్ని పెళ్లి చేసుకోవడమేమిటి? అనిపిస్తుంది. రాక్షసుల గురించి కాస్త తెలుసుకుంటే వాళ్లను మనం ఎలా ఊహించుకోవాలో, నాటకాల్లో, సినిమాల్లో ఎలా చూపించాలో ఒక ఐడియా వస్తుందేమో చూద్దాం.
ఎందరు పాఠకులకు తెలుసో నాకు తెలియదు కానీ, దేవతలు, రాక్షసులు యిద్దరికీ మౌలికంగా ఒకరే తండ్రి. తల్లులు మాత్రం వేరే! ఆ తండ్రి పేరు కశ్యప ప్రజాపతి. ఆయన గురించి తెలుసుకుంటే సృష్టి మొత్తం మనకు కజిన్సే అని అర్థమౌతుంది. కశ్యపుడి తండ్రి మరీచి, ఆయన బ్రహ్మ మానసపుత్రుడు. సృష్టికర్త బ్రహ్మ అంటే ఆయనే ప్రతీ ప్రాణినీ సృష్టిస్తూ కూర్చోలేదు. ఆయన డిజైన్ చేసి, సృష్టించే పనిని కశ్యపుడనే ఋషికి అప్పచెప్పి, అతనికి ప్రజాపతి పోస్టు యిచ్చాడు. అతను దక్ష ప్రజాపతి కూతుళ్లయిన 13 మందిని పెళ్లాడి వారి ద్వారా సకలజీవరాశులను కంటూ పోయాడు. వారిలో వారు కలహించుకున్నా, సంహరించుకున్నా యీయన ఎప్పుడూ చింతించినట్లు కనబడదు. తనకు అప్పగించిన పనిని విద్యుక్తధర్మంగా భావించి పూర్తి చేశాడు.
కశ్యపుడి ద్వారా అదితి అనే భార్య 12మంది ఆదిత్యులను కన్నది. ఈ ద్వాదశాదిత్యులలో విష్ణువు, శక్ర, ఆర్యమ, ధాత, విధాత, త్వష్ట, పూషా, వివస్వన, సవితా, మిత్రావరుణ, అంశ, భాగ ఉన్నారు. వీరు కాక ఇంద్రుణ్ని, వామనుణ్ని కూడా కన్నది. దితి అనే భార్య కన్నది. హిరణ్యాక్ష, హిరణ్య కశిపులనే కుమారులను, సింహిక అనే కుమార్తెను (రాహువు యీమె కొడుకే) కన్నది. కద్రువ అనే భార్య నాగులను కన్నది. వారిలో ఆదిశేషు విష్ణువుకి పాన్పు అయ్యాడు. తక్షకుడు లాటి వాళ్లు అతనికి వ్యతిరేకమయ్యారు. వినత అనే భార్య సూర్య రథసారథి ఐన అనూరుణ్ని, విష్ణువు వాహనమైన గరుడుణ్ని కన్నది. అరిష్ట అనే భార్య గంధర్వులనే గాయకజాతిని కన్నది.
దనువు అనే భార్య 100 మంది దానవులను కన్నది. ముని అనే బార్య మౌనేయులనే అప్సరలను కన్నది. సురస అనే భార్య యక్షులను, రాక్షసులను కన్నది. కుబేరుడు యక్షుడే. పృథ అనే భార్య చెట్లను, లతలను, పొదలను కన్నది. సురభి అనే భార్య గోవులను కన్నది. తామ్ర అనే భార్య గ్రద్దలను, యితర పక్షులను, గుఱ్ఱాలను, గాడిదలను, ఒంటెలను కన్నది. క్రోధ అనే భార్య పులి, సింహం వంటి క్రూరమృగాలను కన్నది. అనుగ అనే భార్య సిద్ధులను కన్నది. వీరందరితో పాటు కశ్యపుడు వైశ్వానరుడి యిద్దరు కూతుళ్లను కూడా వివాహమాడాడు. వారిలో పులోమ ద్వారా పౌలోములనే రాక్షసులను, కాల అనే ఆమె ద్వారా కాలకేయులను కన్నాడు.
ఇలా చూస్తే రాక్షసులందరూ దేవతలతో, మానవులతో నిరంతర సంబంధాలున్నవారే అని తోస్తుంది. రాక్షస గురువైన శుక్రాచార్యుడి సంగతి చూడండి. అతను బ్రాహ్మణుడైన భృగు మహర్షి కుమారుడు, తల్లి రాక్షస వంశానికి చెందిన పులోమ. నలుగురు మగపిల్లలు సత్త్వ గుణాలతో పుట్టాక (వారిలో చ్యవన మహర్షి ఒకడు) ఆమె సత్త్వ, రజో, తమో గుణాలతో ఒక కుమారుడు కలగాలని, అతను తన పుట్టింటివారైన రాక్షసులకు గురువై మార్గదర్శనం చేయాలని కోరుకుంది. అలాగే జరిగింది. శివుడికి పుత్రసమానుడయ్యాడు. ఇంద్రుడి కూతురైన జయంతిని పెళ్లాడాడు. కుమార్తె దేవయానిని క్షత్రియుడైన యయాతికి యిచ్చి పెళ్లి చేశాడు. దేవగురువైన బృహస్పతి కుమారుడు కచుడికి విద్య నేర్పాడు. నవగ్రహాల్లో ఒకడిగా ఉంటూ పూజలందుకుంటున్నాడు.
రాక్షసులు మహాకాయులై ఉంటారని ఊహిస్తాం. కానీ వాళ్లు నరులను కూడా పెళ్లి చేసుకునే సంప్రదాయం ఉంది. లేకపోతే శూర్పణఖ లక్ష్మణుణ్ని, రావణుడు సీతను వరించి ఉండరు. భీముడు హిడింబను పెళ్లాడి ఉండడు. బాణాసురుడి కూతురు ఉష, కృష్ణుడి మనుమడు అనిరుద్ధుణ్ని పెళ్లాడింది. ఇతర జాతులతో రమించగల సైజులోనే ఉంటారని అనుకోవాలి. అసలు రాక్షసులు ఎలా వుంటారని పురాణాలు వర్ణించాయి అనే సందేహం వచ్చింది నాకు. వాల్మీకి రామాయణం (వచనానువాదం శ్రీనివాస శిరోమణి గారు), వ్యాస మహాభారతం (తెలుగు వచనం), భాగవతంలో రాక్షస ప్రస్తావన ఉన్న ఘట్టాలు తిరగేశాను.
రామాయణంలో ఎక్కడా వాళ్లకు నెత్తిమీద కొమ్ములు, నోట్లో కోరలు ఉంటాయని చెప్పలేదు. భారతంలో హిడింబుడికి కోరలు ఉన్నాయి. వాళ్లు ఇష్టం వచ్చిన రూపాన్ని పొందగలరు. ఎప్పుడూ వికారంగా ఉంటారని లేదు. కావాలంటే మాత్రం భయంకర రూపం పొందగలరు. సీతను భయపెట్టడానికి కొందరు రాక్షసాంగనలను ‘మీ మీ వికృతాకారాలు, ఘోరాకారాలు ధరించండి’ అని రావణుడు ఆజ్ఞాపించాడు. వాళ్లు అలాగే ధరించారు. ఆ రూపాల్లో ఒకామెకు ఏనుగు పాదాలు, మరొకామెకు గుర్రం పాదాలు, ఇంకో ఆమెకు పాదాలకు జుట్టు ఉంది, ఇంకా ఆమెకు పెద్ద తలా మెడా ఉన్నాయి. పొడుగాటి నాలిక ఉన్నది ఒకతె, నాలుక లేనిది మరొకతె. సింహ ముఖం, గోముఖం, సూకర ముఖం ఉన్నది కూడా ఉన్నారు.
సుందరకాండలో (భాగం 2 పేజీ 380) హనుమంతుడు రావణ శయ్యామందిరంలో సీతను వెతుకుతూ మనుష్య స్త్రీ ఉందీ లేనిదీ కనుక్కోవడానికి స్త్రీల ముఖాలు వరుసగా చూశాడు. కనురెప్పలకు వెండ్రుకలు ఉన్న కన్నులను అన్నిటినీ వరుసగా చూశాడు. (రాక్షస స్త్రీలకు, మానవ స్త్రీలకు కనురెప్పల వెంట్రుకల విషయంలో తేడా ఉందా? కనుక్కోవాలి) కుంభకర్ణుడు లాగ ఒడ్డూ, పొడుగూ ఉన్న రాక్షసుడు మరొకడు లేడని విభీషణుడు రాముడితో అన్నాడు (భాగం 3 పేజీ 175) పుట్టడమే మహాబలవంతుడిగా పుట్టి సమస్త ప్రాణులను తినివేయసాగాడు. అందరు రాక్షసులూ అతనిలా ఉండరని గ్రహించాలన్నమాట.
తరచి చూస్తే నగరాలలోని రాక్షసులకు, అడవుల్లో నివసించే రాక్షసులకు తేడా కనబడుతోంది. మండోదరితో సహా రావణుడి మందిరంలో ఉన్న స్త్రీలందరూ అందగత్తెలు. అప్సరసలను ఎలా వర్ణిస్తారో వాల్మీకి వీళ్లనూ అలాగే వర్ణించాడు. కుందనపు బొమ్మలన్నాడు, మెరుపు తీగలన్నాడు. అయితే అడవుల్లో ఉన్న రాక్షస స్త్రీలను మాత్రం బానపొట్ట, పెద్ద స్తనాలు అంటూ వికారంగా వర్ణించాడు. చివరకు శూర్పణఖను కూడా రామలక్ష్మణుల వెంట పడినప్పుడు (భాగం 2 – పేజీ 35) ఆమె దుష్టముఖి, విరూపాక్షి, రాగి బొచ్చు, మహోదరము (పెద్ద పొట్ట), కురూపి, భైరవస్వరము, ముసలి డొక్కు, గ్రామ్యవాక్కు, అసహ్యదర్శన (చూడడానికి అసహ్యంగా ఉంటుంది), నరమాంస భక్షిణి అని వర్ణించాడు.
యుద్ధం, ఆయుధాలు – మారీచసుబాహులు అస్త్రవిద్యలో ఆరితేరినవారు. 2వ భాగం (పేజీ 45) ప్రకారం ఖరుడు రథం ఎక్కి రాముడిపై యుద్ధానికి వెళ్లాడు. అతని సైన్యం కవచాలు, వివిధ ఆయుధాలు ధరించి వచ్చింది. గొడ్డళ్లు, గదలు, శూలాలు, ఖడ్గాలు వాడింది. విల్లు బాణాలతో ఖరుడు యుద్ధం చేశాడు. వాళ్లు మాయాయుద్ధం చేయలేదు. మానవుల మధ్య యుద్ధం ఎలా జరుతుందో అలాగే జరిగింది. రామరావణ యుద్ధంలో కూడా రాక్షసులు మానవులు వాడే ఆయుధాలే వాడారు. ఇంద్రజిత్తు మాత్రం మాయాయుద్ధం చేశాడు. వానరులు మాత్రమే చెట్లు, రాళ్లు వాడారు.
ఆహారపు అలవాట్లు – కుంభకర్ణుడు నరమాంసం తింటాడు కానీ రావణుడు, విభీషణుడు నరమాంస భక్షకులని చెప్పలేదు. రావణుడు సీతను బెదిరిస్తూ 12 నెలల గడువులోపల ఒప్పుకోకపోతే నిన్ను నా వంటవాళ్లు ముక్కలుముక్కలుగా నరికి వేస్తారు అన్నాడు. కానీ హనుమంతుడు రావణుడి వంటింట్లో నెమలి మాంసం, జింక మాంసం, దున్నపోతుల మాంసం, అడవిపంది మాంసం వగైరాలు చూశాడు తప్ప నరమాంసం చూడలేదు. కానీ రాక్షసులలో కొందరు నరమాంస భక్షకులు ఉన్నారు. భాగం 2 – పేజీ 22 ప్రకారం వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులు కామరూపులు, నరమాంస భక్షకులు. భాగం 1- పేజీ 48 ప్రకారం తాటక ఒక యక్షుడికి పుట్టింది. వెయ్యి ఏనుగుల బలం కలది. ఆమె భర్తను అగస్త్యుడు చంపివేస్తే కుమారుడు మారీచుడితో సహా అతని పైకి పోయింది. అగస్త్యుడు మారీచుణ్ని రాక్షసుడివైపో అని శపించాడు. తర్వాత తాటకను రూపము మారిపోయి, వికృతాననముతో, వికారాకారముతో నరమాంస భక్షణము చేస్తూ మహా రాక్షసిగా తిరుగుతూ ఉండు అని శపించాడు. అంటే శాపం చేతనే వికారాకారం వచ్చి నరమాంస భక్షకి అయింది.
ఇక రావణుడు – భాగం 2 – పేజీ 65 చూస్తే శారీరక వర్ణన ఎలా చేశారో తెలుస్తుంది. వాల్మీకి ప్రకారం అతను మహా తేజోవంతుడు. ఆజ్యధారలకు జ్వలిస్తున్న అగ్నిహోత్రుడిలా కనకాసనం మీద కూర్చున్నాడు. సూర్యసమాన కాంతులతో తేజరిల్లుతున్నాడు. దేవాసుర యుద్ధంలో వజ్రాయుధం దెబ్బలకు అతని శరీరం గాట్లు పడింది. ఐరావతం దంతాలతో పోరాడినందువలన, విశాల వక్షస్థలం కాయలు కాసింది. విష్ణుమూర్తితో సహా సమస్త దేవతలు కొట్టిన దెబ్బల గుర్తులు దేహమంతా కనబడుతున్నాయి. అతడు దశగ్రీవుడు. ఇరవై భుజాలు ఉన్నవాడు. విశాల లోచనుడు. తెల్లటి పలువరుస. పెద్ద ముఖము, దీర్ఘ బాహువులు, కొండ అంతటివాడు. సమస్త రాజలక్షణ శోభితుడు. బంగారు కుండలాలు ధరించాడు.
అతడు అందగాడు. అతని రంగు నీలమేఘం (కారు మబ్బు) వంటిది. అతను పలు జాతుల స్త్రీలను ఎత్తుకుని పోయాడు. (కన్యను ఎత్తుకుపోయి పెళ్లాడడం రాక్షస వివాహం అన్నారు) కానీ వాళ్లెవరూ అతన్ని విడిచి పోలేదు. అతని సౌందర్యానికి మురిసి అతనితో ఉండిపోయారని సుందరకాండలో ఉంది. స్వభావం (భాగం1 పేజీ 28) చూడబోతే – రావణుడు లోకభీకరుడు. గర్వాంధుడు, మహా భయంకరుడు. దేవేంద్రద్వేషి. తాపసోత్తములకు కంటకుడు. మునులను నానాబాధలు పెడుతున్నాడు. అప్సరసలను హింసిస్తున్నాడు.
రావణ భవనం – లంకా పట్టణాన్ని అద్భుతంగా వర్ణించాడు వాల్మీకి. మోటుగా ఉన్నట్లు, తేడాగా ఉన్నట్లు రాయలేదు. ఒకప్పుడు అది కుబేరుడిది. రాక్షసాధిపత్యం వచ్చాక దానికి మార్పులు చేయించ లేదనుకోవాలి. రావణ భవనం వేలకొలది స్త్రీలతో, నానావిధ పక్షి సమూహాలతో, రకరకాల రత్నాలు, స్ఫటికాలు, వజ్రవైఢూర్యాలు పొదిగిన వెండి బంగారాల స్తంభాలతో ఉంది. మేలిమి బంగారంతో చేసిన ద్వారాలు. కాలు పెట్టగానే దుందుభుల చప్పుళ్లు చేసే విచిత్రమైన బంగారు మెట్లు ఉన్నాయి. కిటికీలు వెండితో, దంతాలతో చేశారు. స్తంభాలపై తోడేళ్లు మొదలైన జంతువుల బొమ్మలు నేత్రపర్వంగా చిత్రించి ఉన్నాయి. కొన్ని చోట్ల నేలమీద మణులు తాపటం చేశారు. అశోకవనంలో కాలంతో సంబంధం లేకుండా చెట్లు పూస్తూ కాస్తూ ఉంటాయి. రావణ శయ్యామందిరం అద్భుతంగా ఉంటుంది. దానిలోని స్త్రీలందరూ మదిర సేవించి, శృంగారకార్యకలాపాలలో తేలుతూంటారు. మంచి అభిరుచితో అలంకరించి ఉంటుంది.
రావణుడు పిశాచముఖాల కంచర గాడిదలు పూన్చిన బంగారు రథం ఎక్కి వెళ్తాడు. పుష్పక విమానం కూడా వాడతాడు. దాన్ని హనుమంతుడు లంకలో తిరిగేటప్పుడు (భాగం 2 – పేజీ 385) చూశాడు. అది నవరత్న ఖచితం. తప్తకాంచనంతో చేసిన బంగారు కిటికీలు. అది అంత ఎత్తు, యింత ఎత్తు అని నిర్ణయించడానికి అలవి లేకుండా ఉంది. అన్ని వైపులా మణులు పొదిగి ఉన్నాయి. అది గోపుర పద్మకాది నానావిధ విచిత్ర సన్నివేశాలతోను (ఆకారాలతోను) నిర్మించింది. ఒక్కో వైపు నుంచి ఒక్కోలా కనబడుతూ ఉంటుంది. దానిలో కూర్చున్న యజమాని ఎక్కడికి పోవాలని మనస్సులో నిశ్చయించుకుంటే అది అక్కడికి పోతుంది. యజమాని మనోభావాన్ని పట్టి వేగంగా కానీ, మందంగా గానీ పోతుంది. దాన్ని నివారించడం ఎవరి తరమూ కాదు. చిత్రవిచిత్రలైన అనేక శిఖరాలతో, స్వచ్ఛకాంతులతో, గైరికాది ధాతువులతో ధగధగలాడే అవాంతర శిఖరాల వంటి శిఖరాలతో ఆ విమానం మహాపర్వత శిఖరంలా కనిపించింది. గుండ్రంగా, వంకరగా, విశాలంగా ఉన్న కనులతో, కుండలాలతో శోభించే ముఖాలతో, మహాకాయాలతో, ఆకాశంలో సంచారం చేసే నిశాచరులూ, మహావేగంతో పోయే భూతగణాలూ వేలకొద్దీ ఆ విమానాన్ని మోస్తున్నవి.
భారతంలో ఘటోత్కచుడు గురించి చూడబోతే, తల్లి హిడింబ, మేనమామ హిడింబాసురుడు (నీలమేఘం వలె నల్లనివాడు, ఎర్రని నేత్రాలు, భయంకరమైన శరీరాకృతి, ఎనిమిది కోరలతో భయంకరమైన ముఖం, మీసాలు, వెంట్రుకలు ఎర్రగా ఉన్నాయి) యిద్దరూ రాక్షసులే, నరమాంస భక్షకులే. హిడింబ మానవకారం ధరించి, భీముడి దగ్గరకు వచ్చి కోరిక తెలిపింది. రాక్షస స్త్రీలు గర్భం ధరించిన వెంటనే ప్రసవిస్తారు. వాళ్లకు పుట్టిన ఘటోత్కచుడు శిరస్సుపై జుట్టు లేకుండా (పైకి లేచిన జుట్టుతో) పుట్టాడు. అందుకే ఆ పేరు వచ్చింది. అతడు ఉరుతర భీమరూపుడు, భయంకర వదనుడు, వికృతాక్షుడు, శంఖనిభకర్ణుడు, కాలమేఘ సదృశ దేహవర్ణుడు, వికట దారుణ దంష్ట్రుడు. కోరలున్నాయి. బకాసురుడు గురించిన వర్ణన యిలా ఉంది – పెద్ద శరీరం. ఎర్రని కళ్లు, గడ్డం మీసాలు జుట్టు ఎర్రగా ఉన్నాయి. నోరు చెవుల దాకా వ్యాపించింది. చెవులు మేకుల్లా నిటారుగా ఉన్నాయి.
భాగవతంలో హిరణ్యసోదరుల గురించి- (1-412) వాళ్లు పుట్టగానే కులపర్వతాల వంటి శరీరాలతో, లోకభీకరమైన భుజబలంతో ఒప్పుతున్నారు. వారి పాదాల తాకిడికి భూమి చలించి పోతున్నది. రత్నాలు చెక్కిన బంగారు భుజకీర్తులూ, మకరకుండలాలు, మొలనూళ్లు, కంకణాలు, ఉంగరాలు, కిరీటాలూ, కాలి అందెలూ, స్వచ్ఛమైన కాంతులు వెదజల్లగా తమ శరీరకాంతులతో మెరుస్తూ ఉన్నారు. వృత్రాసురుడు (2-462) – కొండంత దేహం కలవాడు. దానిలో నుంచి ఎర్రని సంధ్యాకాంతులు వెలువడుతున్నాయి. ఎర్రగా కాల్చిన రాగిరేకుల వంటి కరుకైన మీసాలూ, శిరోజాలూ మెరుస్తున్నాయి. వజ్రాయుధం వంటి పదునైన కోరలున్న నోరు తెరుచుకుని జన్మించాడు. శూలాన్ని ధరించి ఆడుకునేవాడు.
మురాసురుడు (3-33) – ఐదు తలలు కలవాడు, నరకాసురుడి వద్ద పనిచేసేవాడు. కృష్ణుడు చక్రంతో అతన్ని చంపాడు. పూతన (4-49) చచ్చిపోయే సమయంలో ఆమెకు నిజరూపం వచ్చింది. ఆమె కోరలు నాగేటి కొయ్యలంత ఉన్నాయి. పర్వత గుహ వంటి ముక్కురంధ్రాలు, రాతి బండల వంటి వక్షోజాలు, గాలికి రేగుతూ ఉన్న ఎర్రటి వెంట్రుకలు, చీకటి నూతుల కన్న లోతైన కన్నులు, పెద్ద దిబ్బ అంతటి విశాలమైన పిరుదు, ఆరు క్రోశముల పొడవుగా, భీకరంగా ఉంది.
ఇవన్నీ చదివితే రాక్షసులు ఒక జాతి మాత్రమేనా? స్వభావం చేత రాక్షసులుగా మారతారా? కామరూపం ధరించే శక్తి వాళ్లకు ఎలా వచ్చింది? అనే సందేహాలు కలుగుతాయి. వారిలో విద్యావంతులు, తపస్సంపన్నులు, రాజ్యాలు ఏలినవారు, దానధర్మాలు చేసినవారు, కులధర్మాలను పాటించినవారు, యుద్ధతంత్రంలో ఆరితేరినవారు, యుద్ధధర్మాలు పాటించేవారు, దేవతలతో, మనుష్యులతో నిత్యసంపర్కం కలవారు ఉన్నారని అర్థమౌతోంది. అందువలన రాక్షసుడు అనగానే ఫలానా రూపంలో ఉంటాడు అని అనుకోవడం కష్టమని తోస్తోంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2023)