తెలుగుదేశం పార్టీ దుస్థితికి ఇది దర్పణం ‘రోడ్డెక్కిన అమ్మ’

‘అమ్మ’ రోడ్డు మీదకు వచ్చారు. ఇన్ని దశాబ్దాల చరిత్రలో ఇది ప్రథమం. ఎందుకొచ్చారు? భర్త జైల్లో పడినందుకు- ఆత్మత్యాగాలు చేసిన అభిమాన దురంధరుల కుటుంబాలను పరామర్శించి.. వారిని ఊరడించి.. ప్రతి కుటుంబానికి మూడేసి లక్షల…

‘అమ్మ’ రోడ్డు మీదకు వచ్చారు. ఇన్ని దశాబ్దాల చరిత్రలో ఇది ప్రథమం. ఎందుకొచ్చారు? భర్త జైల్లో పడినందుకు- ఆత్మత్యాగాలు చేసిన అభిమాన దురంధరుల కుటుంబాలను పరామర్శించి.. వారిని ఊరడించి.. ప్రతి కుటుంబానికి మూడేసి లక్షల రూపాయల వంతున సాయం అందించి.. తమ ఔదార్య ప్రదర్శనకు తద్వారా యావత్తు సమాజం నుంచి జాలి, సానుభూతిని గడించడానికి వచ్చారు. అయితే, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే తాను ‘నిజం గెలవాలి’ యాత్ర చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ఆమె చేస్తున్న పనిలో, యాత్రలో ఇమిడిఉన్న ‘రాష్ట్రప్రయోజనాలు’ ఏమిటి? మనకెవ్వరకూ కనిపించని వాటిని ఆమె ఎలా చెప్పగలుగుతున్నారు? తాను ఎందుకోసం ఈ యాత్ర చేస్తూ, దానికి ఎలాంటి రంగులు పులమాలని అనుకుంటున్నారు.. అనే అంశాల సాధికారిక విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘రోడ్డెక్కిన అమ్మ’

నారా భువనేశ్వరి తనను తాను రాష్ట్ర ప్రజలకు అమ్మగా ప్రకటించుకున్నారు. స్వయంప్రకటిత దేవుళ్ల మాదిరిగా ఆమె స్వయం ప్రకటిత అమ్మ అన్నమాట. నారా చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లిన తరువాత.. ఇటీవల ఒక సందర్బంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రదర్శనగా రాజమండ్రికి వెళ్లి, భువనేశ్వరికి సంఘీభావం మద్దతు తెలియజేయాలని అనుకున్నప్పుడు.. పోలీసులు అంత సుదీర్ఘమైన యాత్రకు అనుమతులు నిరాకరించారు. ఆ నేపథ్యంలో ఆమె పోలీసులమీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మను కలవడానికి బిడ్డలను రానివ్వరా? ప్రజలు వచ్చి వారి అమ్మకు మద్దతు తెలియజేయాలని చూస్తే దాన్ని కూడా అడ్డుకుంటారా? అని ఆమె ఆగ్రహించారు.

నిజానికి రాజమండ్రిలో ఉన్నంత కాలమూ ఆమె నిత్యం సందర్శకులను కలుస్తూనే ఉన్నారు. పోలీసులు ఆమెను ఎవరూ కలవకుండా నియంత్రించదలచుకుంటే గనుక.. అదంతా ఎలా సాధ్యం అవుతుంది. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా ప్రదర్శనలు ఊరేగింపులను తిరస్కరించినప్పుడు ఆమె ఇంతలేసి ఆరోపణలు చేయడం విశేషం. శాంతి భద్రతల కోసం తీసుకునే నిర్ణయాలను కూడా రాజకీయ నిందారోపణల కోసం వాడుకోవడం అలవాటు చేసుకున్న తరువాత, ఆమె మాటలతో విస్తుపోవాల్సిన అవసరమేం లేదు. చంద్రబాబు మార్కు నిందా రాజకీయం ఆమెకు కూడా అలవాటైందని అనుకోవచ్చు. కానీ ఈ స్వయం ప్రకటిత అమ్మ.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్ధమయ్యారు. ‘నిజం గెలవాలి’ అనే టైటిల్ తో ఆమె సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

ఇంత వరకు వచ్చిన తర్వాత.. కొన్ని కోణాల్లోంచి సమీక్షించుకోవడం మాత్రం అవసరం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి.. ప్రజలతో మమేకం అవుతూ యాత్రలు సాగించడానికి ఎవ్వరికైనా హక్కు ఉంటుంది. ఈ దేశంలో ఎవ్వరి హక్కును కూడా మనం కాదనలేం. వారికి ఉండే ఆర్థిక వనరులను బట్టి.. ఆ యాత్ర సాగేస్థాయి కూడా నిర్ణయం అవుతుంది. యాత్రల జయాపజయాలు అనేవి ప్రస్తుతానికి ఎవరికి ఎలా కనిపించినప్పటికీ.. స్పష్టంగా చెప్పాలంటే.. ఈ దశలో నిర్ణయించగలిగేవి కాదు. కేవలం ఎన్నికల నాటికి మాత్రమే స్పష్టమైన, మాయలు లేని, మానిప్యులేషన్ లేని ప్రజాబలం.. ఆ తీర్పులో వెల్లడవుతుంది. కాబట్టి ఈ దశలో మనం కేవలం యాత్రల ప్రయత్నాల్ని మాత్రం సమీక్షించుకోగలం.

యాత్రాహేతువులో నిజాయితీ ఉందా?

ఈ యాత్రకు పెట్టిన పేరు ‘నిజం గెలవాలి’ అనేది! ఆ టైటిల్ లో నిజం ఉన్నదా? నిజాయితీ ఉన్నదా? అన్నదే తొలి సందేహం. చంద్రబాబునాయుడు పరాన్నభుక్కు నాయకుడు అనే సంగతి అందరికీ తెలుసు. కనీసం ఆలోచనలను కూడా సొంతంగా చేయలేని.. పరాయి ఆలోచనలను కాపీ కొట్టి.. వాటికి కొంత జోడించి.. తన తెలివిగా ప్రచారం చేసుకోవడం ఆయన నైజం. ఇలాంటి పరిస్థితుల్లో తన అరెస్టును కూడా యావత్తు తెలుగు ప్రజల శోకంగా అభివర్ణించడానికి ఆయన బుర్రలో పుట్టిన అయిడియా ఇది. జననేతగా ప్రజల ఆదరాభిమానాలను ఇప్పటికీ పుష్కలంగా కలిగి ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని మించి.. తనకోసం ప్రజలు ప్రాణాలొడ్డేవారున్నారని చాటుకోవడం ఆయన వ్యూహం. అందుకోసమే ఇలాంటి స్కెచ్ వేశారు.

గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణానికి, చాలా శోచనీయమైన రీతిలో, గురైనప్పుడు.. తెలుగుజాతి మొత్తం శోకించింది. ఎంతో మంది ఆయన మరణం కలిగించిన శోకాన్ని తట్టుకోలేక వారు కూడా హఠాన్మరణానికి గురయ్యారు. గుండెలు ఆగాయి. ఆత్మత్యాగాలు జరిగాయి. ఇలాంటివి అనేకం. వైఎస్ఆర్ మరణమే హఠాత్తుగా, అనూహ్యంగా జరిగినది గనుక.. అది ఆయన అభిమానులకు కలిగించే షాక్ వేరు. కానీ.. ఇక్కడ చంద్రబాబునాయుడు విషయానికి వస్తే.. ఆయన అరెస్టు హఠాత్పరిణామం అనుకోవడానికి ఏ రకంగానూ అవకాశం లేదు. 

ఎందుకంటే.. తనను అరెస్టు చేయబోతున్నారని.. తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నదని, అందుకు కుట్ర జరుగుతున్నదని.. చాలా కాలం ముందునుంచే చంద్రబాబునాయుడు ఎక్కడ మీటింగు పెడితే అక్కడ టముకు వేసుకుంటూ సాగుతున్నారు. అలాంటి నేపథ్యంలో అరెస్టు అనేది ఆయన వీరాభిమానులకు కూడా పెద్ద ‘షాక్’ కలిగించదు. ‘ఇది జగన్ కుట్ర’ అని వారు నిందించగలరు తప్ప.. గుండె ఆగేంత షాక్ ఉండదు. పైగా.. చంద్రబాబునాయుడు సుమారు 250 కోట్ల రూపాయలు అడ్డగోలుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్వాహా చేసిన అవినీతి కేసులో అరెస్టు అయ్యాక.. సీఐడీ అధికారులు ఆ అవినీతి బాగోతానికి సంబంధించిన అన్ని ఆధారాలను, కోర్టుకు, మీడియా ద్వారా ప్రజలకు తెలియజెబుతున్న తరువాత.. ఇక ప్రజలు ‘షాక్’ కు గురవుతారని అనుకోవడం భ్రమ.

కానీ.. చంద్రబాబునాయుడు స్కెచ్ ను కార్యరూపంలో పెట్టడానికి ఆయన వందిమాగధులైన పచ్చమీడియా నిత్యం ఉత్సాహపడుతూ ఉంటుంది. అరెస్టు అయిన నాటినుంచి.. తెలుగునేలపై చోటు చేసుకున్న.. ప్రత్యేకించి.. ప్రలోభ పెడితే ఒప్పుకోగల వారి ఇళ్లలో ప్రతి మరణాన్నీ ఆత్మత్యాగంగా అభివర్ణించడం ప్రారంభం అయింది. అదే స్కెచ్ కు సీక్వెల్ గా.. అసువులు బాసిన కుటుంబాలకు పరామర్శ పర్వం ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రస్తుతం నడుస్తోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు భువనేశ్వరి స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. వారి కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారి కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని ఒక హామీ కూడా ఇస్తున్నారు. 

ఈ ఓదార్పు.. అచ్చంగా వైఎస్ మరణానంతరం జగన్ సాగించిన ఓదార్పు యాత్రకు కాపీ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అప్పుడు జగన్ కేవలం ఓదార్పుకు మాత్రం పరిమితం కాగా.. నారా భువనేశ్వరి.. తన కంటితుడుపు యాత్రలను అచ్చంగా రాజకీయ ప్రచార సభలుగా కూడా వాడుకుంటున్నారు. రాజకీయంగా తెలుగుదేశానికి ఒక సరికొత్త మైలేజీ తీసుకురావడానికి, ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఆమె కూడా ఆరాటపడుతున్నారు. 

ఈ కోణంలో పరిశీలించినప్పుడు.. భువనేశ్వరి సాగిస్తున్న ‘నిజం గెలవాలి’ అనే యాత్రలోనే ఏమాత్రం నిజాయితీ లేదనే సంగతి మనకు అర్థమవుతుంది. 

భువనేశ్వరి అర్హత ఏమిటి?

వారు చెప్పుకుంటున్నట్టుగా చంద్రబాబునాయుడు అరెస్టు వలన ప్రజలు విలపిస్తున్నారని, గుండెలు ఆగిపోయిన మాట వాస్తవమే అని అనుకుందాం. కానీ.. ఆ సందర్భంగా ప్రజల కన్నీళ్లు తుడవడానికి, పనిలోపనిగా సభలు పెట్టి ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి, ప్రభుత్వాన్ని నిందించడానికి నారా భువనేశ్వరికి ఉన్న అర్హత ఏమిటి? ఏ యోగ్యతలను నిరూపించుకుని ఆమె ప్రజాక్షేత్రంలో ఇలా పర్యటనలు సాగిస్తున్నారు. ఈ అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది.

భువనేశ్వరి ఈ రాష్ట్రానికి కొత్త తరహా రాజకీయాలను పరిచయం చేసిన నందమూరి తారక రామారావుకు స్వయంగా కూతురు అయినప్పటికీ, ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ముందుగానే ఆమె వివాహం జరిగిపోయింది. పెళ్లి అయ్యేనాటికే నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలలో ఒక స్థాయికి చేరుకుని ఉన్నారు. ఆమె వైవాహిక జీవితానికి ఉన్నంతటి సుదీర్ఘమైన వయస్సు, చరిత్ర ఆమె రాజకీయ నాయకుడి భార్య గానే గడుపుతున్నారు. తెలుగు రాష్ట్రానికి అతి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు భార్య ఆమె. ఒక స్థాయిని మించి ఎదిగిన రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులకు..  ప్రత్యేకించి భార్యకు రాజకీయేతర వ్యక్తిగత జీవితం ఉంటుందని అనుకోవడం భ్రమ. వారు క్రియాశీలంగా రాజకీయాలలో లేకపోయినా సరే, ఎన్నికల గోదాలో, ప్రచార పర్వంలో కీలకంగా తిరిగేవారు కాకపోయినా సరే ప్రచ్ఛన్నంగా వారి జీవితం రాజకీయాలతో ముడిపడే సాగుతూ ఉంటుంది. ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే నారా భువనేశ్వరి ది కూడా సుమారు నాలుగు దశాబ్దాల పైచిలుకు ప్రచ్చన్న రాజకీయ అనుభవం, జీవితం కలిగి ఉన్నారు.

ఇంత సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నారా భువనేశ్వరి ఎన్నడైనా ప్రజల కోసం నోరు మెదిపారా? ప్రజల సమస్యల గురించి ఆమె ప్రస్తావించారా? వాటి గురించి మాట్లాడడానికి, ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని తీర్చి జాతిని ఉద్ధరించడానికి తన భర్త నారా చంద్రబాబు నాయుడుని మించిన వారు లేరని ఆమె అనుకుంటూ ఉండవచ్చు గాక.  అంత మాత్రాన ఈ నలభై ఏళ్ల ప్రస్థానంలో భువనేశ్వరి తాను ప్రజల ముందుకు వచ్చి నోరు తెరిచి మాట్లాడవలసిన సందర్భం ఒక్కటైనా ఆమెకు కనిపించలేదా అనే సందేహాలు ఇప్పుడు సామాన్యులను, ప్రత్యేకించి పార్టీ పెద్దలను కూడా ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తున్నాయి. ఏదో ఒక సందర్భంలో ప్రజల సమస్యలను గురించి మాట్లాడే అలవాటు ఉన్న వ్యక్తి అయితే.. ఈనాడు కూడా యాత్ర రూపంలో ప్రజల వద్దకు వెళ్లడంతో పాటు, ప్రభుత్వాన్ని నిందించడానికి ఆమెకు అర్హత ఉంటుంది.

నారా భువనేశ్వరి ఈ నాలుగుదేశాబ్దాలలో కేవరం ‘వ్యాపారాలు’ మాత్రమే చూసుకున్నారు.  ఆమె ‘వ్యాపార సామర్థ్యం’ వారి కుటుంబానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు పెరగడానికి ఉపయోగపడి ఉండవచ్చు. అయితే ఆమె ఇన్నేళ్లలో ప్రజల గురించి ఆలోచించిన సమయం ఎంత? వారిని పట్టించుకున్నది ఎంత? ఏ విషయాల్లో? ఇన్ని ప్రశ్నలు మిగిలి ఉండగా.. చంద్రబాబునాయుడు జైల్లో ఉన్నారు గనుక.. జనంలో సానుభూతి సంపాదించవచ్చునని దాన్ని ఓట్లరూపంలోకి మార్చుకోవచ్చునని.. తాను జనం వద్దకు వెళ్లడం వల్ల, ప్రయోజనం అనేది తెలుగుదేశాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందనే స్వార్థం తప్ప.. ప్రస్తుతయాత్రకు ఇంకేదైనా ప్రేరణ ఉన్నదా అనేది కీలకంగా గమనించాలి.

జాలికోసం ఆరాటం.. చంద్రబాబు దురలవాటు!

ప్రజలు తనను విశ్వసించి, తాను మంచి పాలన, అభివృద్ధికి నిదర్శనమైన పాలన అందిస్తానని నమ్మి గెలిపించాలనే వ్యూహం చంద్రబాబునాయుడుకు ఎప్పుడూ ఉండదు. అవకాశం చిక్కితే చాలు వారి జాలిని పొందడం ద్వారా.. గెలవాలని ఆయన ఆరాటపడతారు. ప్రజల జాలి, సానుభూతిని నిచ్చెనమెట్లుగా వాడుకుని కుర్చీ ఎక్కాలనుకుంటారు. ఇది ఆయన కొత్త లక్షణం కాదు. గతంలో ఆయన మీది అలిపిరి క్లెమోర్ మైన్ల దాడి జరిగినప్పుడు .. ఉన్నపళంగా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వెనుక కారణం కూడా అదే. ఆయన మీద హత్యా యత్నం జరిగినప్పుడు.. ఆయన చావు తప్పించుకుని అత్యంత విషమ స్థితిలో చావునుంచి బయటపడినప్పుడు.. రాష్ట్రంలో ఒక్క గుండె కూడా ఆగలేదెందుకు? ఒకవేళ అలా ఎవరైనా మరణించి ఉంటే.. వారిని ఓదార్చలేదెందుకు? వారి ఓదార్పు కంటె.. తాను చావు తప్పించుకున్నాననే అంశమే ఎక్కువ మైలేజీ తెస్తుందని.. ఆ జాలితో మళ్లీ ముఖ్యమంత్రి కావొచ్చునని ఆయన కుట్ర రచన చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

ప్రజల జాలితో గెలవాలని, సానుభూతితో రాజకీయం చేయాలని ఆయన కోరుకోవచ్చు గానీ.. అంత జాలి, సానుభూతి ప్రజల్లో ఉండాలి కదా! వాస్తవంలో అవేమీ లేకపోవడం వలన.. ఆయన దారుణంగా దెబ్బతిన్నారు. అంత ప్రాణాపాయం గల దాడి జరిగినా కూడా.. రాష్ట్రంలో ఓడిపోయారు. ఇప్పుడు కేవలం అవినీతి కేసులో అరెస్టు అయినందుకు ప్రజల్లో ఆయనను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలనేంత జాలి, సానుభూతి పుడతాయా? సాధ్యమేనా?

మామూలు పరిస్థితుల్లో అంతటి జాలి, సానుభూతి పుట్టే అవకాశం లేదనే క్లారిటీ ఉన్న నాయకుడు గనుకనే.. తన అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రంలాగా ఆయన ఇందుకోసం తన భార్యను ప్రయోగించారు. ఇన్నాళ్లూ వ్యాపారాలు చూసుకుంటున్న ఆమెను ప్రజల ఎదుటకు తీసుకు వెళితే.. ఎన్టీఆర్ కూతురిగా, తన భార్యగా ఆమెను ఆదరించే ప్రజలు.. ఓట్లు కురిపిస్తారని ఆయన ఆశ. ఆమె ఎవరి కన్నీళ్లు తుడవగలదని ఆయన అనుకున్నారో తెలియదు గానీ.. ఆమె కార్చే కన్నీళ్లు ఓటు బ్యాంకును నిర్మిస్తాయని ఆయన ఆలోచన.

భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర కూడా ఈ వ్యూహానికి అనుగుణంగానే సాగుతున్నది. ఆమె సభల్లో ఏ మాటలు చెబితే.. ప్రజల నుంచి సానుభూతిని పొందవచ్చో అది మాత్రమే చెబుతున్నారు. సెంటిమెంటును ప్లే చేయాలని అనుకుంటున్నారు. ‘‘చంద్రబాబు అరెస్టు గురించి.. ఇప్పటిదాకా దేవాన్ష్ కు చెప్పనేలేదు. తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నాం’’ అని భువనేశ్వరి ప్రజల ఎదుట అంటూ వారి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఏ టీవీలో ఏ న్యూస్ ఛానెల్ పెట్టినా.. నిత్యం చంద్రబాబు అరెస్టు గురించే వార్తలు ప్రసారం అవుతున్న ఈ రోజుల్లో, కమ్యూనికేషన్ యుగం విచ్చలవిడిగా ఉన్న రోజుల్లో బడికి వెళ్లే వయసులోని ఎనిమిదేళ్ల కుర్రవాడికి తాతయ్య అరెస్టు సంగతి తెలియకుండా దాచడం అంత ఈజీనా? అనే సందేహం పలువురికి కలుగుతోంది. ఇదంతా కేవలం సానుభూతి కోసం చెబుతున్న మాటలు, ఆడుతున్న డ్రామా అనే అభిప్రాయాలే సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ చేవచచ్చి ఉందా?

కీలకమైన ఇంకో అంశాన్ని ప్రస్తావించాలి. చంద్రబాబునాయుడు వంటి పార్టీ సారథి అరెస్టు అయితే.. (ఎందుకు అరెస్టు అయ్యారనేది పక్కన పెట్టండి) ఆ పార్టీ ఆందోళనలు నిర్వహించి, ఆ అరెస్టు అక్రమం అని ప్రజల్లో చాటుకుని.. పార్టీకి పొలిటికల్ మైలేజీ సాధించాలని చూడడం చాలా సాధారణమైన సంగతి. అది తప్పదు కూడా. ఎవ్వరు అరెస్టు అయినా.. అలాంటి పని తప్పదు. కానీ.. చంద్రబాబునాయుడు అరెస్టు అయితే.. అలాంటి ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడానికి, దానికి సారథ్యం వహించడానికి, పూనిక తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీలో ఒక్కరంటే ఒక్క నాయకుడు లేరా? ఇది నలభయ్యేళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ పార్టీకి సిగ్గు చేటు కాదా? చంద్రబాబు పరోక్షంలో పార్టీని సమర్థంగా ప్రజల ముందు ఆవిష్కరించడానికి ఒక్క మనిషికి దిక్కులేక.. ఏదో నిమ్మళంగా వ్యాపారాలు చూసుకుంటున్న ఆయన భార్యను తీసుకువచ్చి ఈ రొంపిలోకి దించుతున్నారా? అనే ప్రశ్నలు కూడా ప్రజలనుంచి వ్యక్తం అవుతున్నాయి.

ఇదే అంశాన్ని ఇంకో కోణంలో ఆలోచించినప్పుడు.. తెలుగుదేశంలో నాయకులు లేకపోవడం వల్ల, ఆ పార్టీ చేవచచ్చి ఉండడం వల్ల కాదని, ఇలాంటి  సమయంలో ఇతర నాయకులు ఎవరైనా ప్రజాందోళనలకు కేంద్రబిందువుగా సారథ్యం వహిస్తే వారు ఏకు మేకై పార్టీలో పెత్తనం చేయగల పెద్దగా అవతరిస్తారేమోనని చంద్రబాబుకు భయం. ఆయనలోని పిరికితనమే తెలుగుదేశానికి చేవ చచ్చిందనే భావనను ప్రజల్లో కలిగిస్తున్నదని అందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు మామూలుగానే తన నీడను కూడా నమ్మని వ్యక్తి. అలాంటిది.. కనీసం బెయిలు మీదనైనా ఎఫ్పుడు బయటకు వస్తారో తెలియని విధంగా అవినీతి కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉంటుండగా.. ఆయన మరొకరికి సారథ్యం చాన్స్ ఇస్తారనుకోవడం భ్రమ. కేవలం చంద్రబాబు పిరికితనం, భయమే.. ఆ పార్టీని మరింత పిరికిగా తయారుచేస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

మొత్తానికి నారా భువనేశ్వరి చేస్తున్న ‘నిజం గెలవాలి’ యాత్ర ఏకపక్షంగా ప్రజల్లో సానుభూతిని పుట్టించే అవకాశం లేనేలేదు. ఆమె రోడ్డెక్కిన మాట నిజమే. కానీ ఆమె పడుతున్న ఈ కష్టం.. కేవలం పార్టీ తన భర్త పట్టునుంచి మరొకరి చేతుల్లోకి జారిపోకుండా ఉండడానికి కుట్రపూరిత ఆలోచన తప్ప.. ప్రజల కోసం పాటుపడడం కాదనే స్పష్టత అందరికీ ఉంది. ఆమె యాత్రలో నిజాయితీ లేదు. ప్రయత్నంలో చిత్తశుద్ధి లేదు. అందుకే ప్రజలు హర్షించడం లేదు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి వారు బహుశా ఎన్నికల ఫలితాల దాకా వేచిచూడాల్సి ఉంటుంది. 

..ఎల్ విజయలక్ష్మి