సీమాంధ్ర ప్రాంతంలో శాంతి భద్రతలు సర్వనాశనమైపోవడానికి కారణం ఎవరు.? ఈ ప్రశ్నకు పాపం కేంద్ర ప్రభుత్వానికి తెలియదు కాబోలు, తెలిసినా తెలియనట్టే వ్యవహరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. కేంద్ర ప్రభుత్వానికి సీమాంధ్రలో పరిస్థితులు ప్రశాతంగా చూడాలని వుందంట.
‘…’ గిల్లి జోలపాడటం అంటే ఇదే మరి. సీమాంధ్రలో పరిస్థితులు ప్రశాంతంగా వుంటే, చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడితే, సీమాంధ్రుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనీ, ఎలాంటి సమస్యలైనా వాటికి పరిష్కారం చూపగలమన్న నమ్మకం తమకుందనీ కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే సెలవిచ్చారు.
అబచా.. ఎంత కామెడీ చేశారు షిండేజీ. రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేక సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నాయన్నమాట కాదనలేంగానీ, అంతకన్నా కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తమను దొంగ దెబ్బ కొట్టాయన్న కసితో అరవై రోజులుగా ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు సీమాంధ్రలోని సమైక్యవాదులు.
లేకపోతే, తెలంగాణపై క్యాబినెట్ నోట్‌ని దర్జాగా పెట్టాల్సింది పోయి, అప్పటిదాకా నానా రకాల దొంగనాటకాలూ ఆడేసి (అనగా నోట్‌పై సంతకం చేయలేదని గంట ముందు చెప్పి, గంట తర్వాత టేబుల్ నోట్ రూపంలో క్యాబినెట్ సమావేశంలో పెట్టడం) ఇప్పుడేమో, సమస్యలకు పరిష్కారం చూపాలి కాబట్టి, శాంతియుతంగా వుండాలని విజ్ఞప్తి చేసేస్తున్నారు షిండేజీ సీమాంధ్ర ప్రజలకి.
అయినా, ఈ మాట షిండే ఇప్పుడు చెప్పడం కాదు, ఇదివరకే చెప్పి వుండాలి. ఎందుకంటే, తెలంగాణ ప్రక్రియ ప్రారంభమయ్యిందని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పేసి వున్నారు గనుక, సానుకూల వాతావర ణంలో అన్ని సమస్యలకూ పరిష్కారం చూపించి, అప్పుడు రాష్ట్ర విభజనకు అనుకూలం గా నిర్ణయం తీసుకుంటే ఇప్పుడీ దుస్థితి దాపురించేది కాదు సీమాంధ్ర ప్రాంతానికి.
షిండే, సీమాంధ్రులకు చాలా విజ్ఞప్తులే చేశారు, చాలా బంపర్ ఆఫర్స్ కూడా ఇచ్చేస్తున్నట్లు హడావిడి చేశారు. హైద్రాబాద్‌లో సీమాంధ్రులకు భద్రత కల్పిస్తారట. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో సీమాంధ్రులకు నెలకొన్న అనుమానాల్ని నివృత్తి చేసేస్తారట. అంతేనా, నీటి సమస్యలు ఎదురవుతాయని భయపడుతున్న సీమాంధ్రుల భయాల్నీ తొలగించేస్తారంట.
కర్నాటక, తమిళనాడు మధ్యా, కర్నాటక ` ఆంధ్రప్రదేశ్ మధ్యా, ఆంధ్రప్రదేశ్ ` మహారాష్ట్ర మధ్య జల వివాదాలు దశాబ్దాలు గడుస్తున్నా పరిష్కారం కాలేదుగానీ, రేప్పొద్దున్న రెండు రాష్ట్రాలు కానున్న సీమాంధ్ర ` తెలంగాణల్లో తలెత్తే జల వివాదాలకు ఈ నాలుగైదు నెలల్లోనే (అంతే కదా యూపీఏ`2 కి వున్న పుణ్యకాలం) పరిష్కారమెలా దొరుకుతుంది.?
మాయమాటలు చెప్పడానికన్నా ఓ అర్థం వుండాలి. సీమాంధ్ర జనం ఎంత వెర్రి వెంగళప్పల్లా కన్పిస్తే మాత్రం, కేంద్ర హోంమంత్రిగా పనిచేస్తోన్న షిండే.. అంత తేలిగ్గా ఎలా మాయచేసేద్దామనుకున్నారు. క్యాబినెట్ నోట్ వ్యవహారాన్ని అప్పటిదాకా రహస్యంగా వుంచి, చివరి నిమిషంలో టేబుల్ నోట్‌గా పెట్టినప్పుడే కేంద్రం పెద్దరికాన్ని కోల్పోయింది సీమాంధ్ర ప్రజల దృష్టిలో.
రాష్ట్ర విభజనను తప్పు పట్టలేం. అదే సమయంలో రెండు ప్రాంతాల్నీ ఒకేలా చూడలేకపోకపోవడమే ఇక్కడ అందరూ తప్పుపడ్తున్న విషయం. తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని ఎలాగైతే గౌరవించారో, అంత గొప్పగా సీమాంధ్రలోని సమైక్య ఉద్యమాన్ని గౌరవించకపోయినా, సీమాంధ్రుల భయాలకైనా నివృత్తి కలిగించి వుండాల్సింది ఈ పాటికే.
ఇప్పుడు చిలకపలుకులు పలికితే, అవి మభ్యపెట్టే మాటలకిందే పరిగణిస్తారెవరైనా. అర్థమవుతోందా షిండేజీ.?