కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ గడచిన రెండు మూడు నెలలుగా ఒకటే పాట పాడుతున్నారు. ‘రాష్ట్రంలోని అన్ని పార్టీలూ రాష్ట్ర విభజనకు అంగీకరించాయిగా..’ అనేదే ఆ పాట తాలూకు అసలు సారాంశం. నిజమే, మజ్లిస్, సీపీఎం తప్ప.. మిగతా అన్ని రాజకీయ పార్టీలూ రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపాయి. మజ్లిస్ కొంచెం సర్దుకుపోతున్నట్లే విభజన గురించి మాట్లాడిరది. సీపీఎం మొదటి నుంచీ రాష్ట్ర విభజనకు ససేమిరా అంటోందనుకోండి.. అది వేరే విషయం.
విపక్షాలు ఎన్నయినా మాట్లాడతాయి. రాజకీయ పార్టీలంటేనే రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా మారేవి. కానీ, అధికారంలో వుండే పార్టీ కూడా అలా వ్యవహరిస్తే ఎలా.? రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టలేంగానీ, విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తోన్న వైఖరి నూటికి నూరుపాళ్ళూ దుర్మార్గమైనదే. అరవయ్యేళ్ళుగా ఒకే రాష్ట్రంగా వున్న ఆంధ్రప్రదేశ్‌ని విభజించేటప్పుడు ఇరు ప్రాంతాల ప్రజల అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. తెలంగాణలో ప్రజలకెలాగూ విభజన విషయంలో అభ్యంతరాల్లేవు.
సీమాంధ్రలో మాత్రం అభ్యంతరాలు కాదు, భయాలున్నాయి. నీటి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విద్య, వైద్యం వంటి రంగాల్లో ఆందోళనలు.. ఒకటేమిటి.? రాసుకుంటూ పోతే ఓ లక్ష భయాలున్నాయి. వాటన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత పాలక పక్షానిదే. కాదూ, మేమూ మామూలు రాజకీయ పార్టీలాగే.. ఓ సాధారణ విపక్షంగానే వ్యవహరిస్తామంటే, విభజనపై నిర్ణయం ప్రకటించి అధికారంలోంచి తప్పుకుని వుండాల్సింది.
అధికారంలో వున్న పార్టీగా, ఆరు కోట్ల మంది సీమాంధ్రులూ తెలంగాణ వారితోనూ, దేశంలోని ఇతర రాష్ట్రాల వారితోనూ సమానమేనని భావించాల్సి వుంటుంది. కానీ, అదే కన్పించడంలేదిక్కడ. పార్టీలు నిర్ణయం చెప్పాయి కదా.. అంటే సరిపోతుందా.? ఆ రాజకీయ పార్టీలేమన్నా ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా అధికారంలో వున్నాయా.? ఎంత సేపూ పాత పాటే పాడితే, అలా విభజనకు ఒప్పుకున్న పార్టీల పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగాలనేదే కదా కాంగ్రెస్ వ్యూహం.
అవును, అప్పుడు ఒప్పుకున్నాయి.. ఇప్పుడు విభజన నుంచి కొన్ని పార్టీలు వెనక్కి తగ్గాయి. మరిప్పుడేమంటారు.? పార్టీలు ఒప్పుకోవట్లేదు కాబట్టి, విభజన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గొచ్చుకదా. అక్కడికేదో తాము మాటకు కట్టుబడి వుంటామని గొప్పలు చెప్పుకోవడం కాకపోతే. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ని ఒక్క రాహుల్‌గాంధీ చించి పారేయమంటే చించి పారేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాంటప్పుడు రాష్ట్ర విభజన విషయంలో మాటమీద నిలబడ్డామంటే, కాంగ్రెస్ పార్టీ అభాసుపాలైపోతుంది తప్ప, జనంలో గొప్ప సంపాదించుకోదు.
మొదటి నుంచీ సీమాంధ్రలో సమైక్య ఉద్యమాన్ని పరోక్షంగా రెచ్చగొడ్తున్నది దిగ్విజయ్‌సింగ్ మాత్రమే. వెనక్కి తగ్గం.. వెనక్కి తగ్గం.. ఇదే మాట. వెనక్కి తగ్గరు సరే.. ఎప్పుడూ లేని విధంగా విజయనగరం జిల్లాలో కర్ఫ్యూ వాతావరణానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా.? అరవై రోజులపాటు ఆరు కోట్ల మంది సీమాంధ్రులు రోడ్డెక్కినా పట్టించుకోకపోవడం వల్లే కదా, రైల్వేకు సైతం విద్యుత్ కష్టాలు మొదలైంది. రేప్పొద్దున్న సదరన్ గ్రిడ్ కుప్ప కూలిపోతే, ఐదు రాష్ట్రాలు అంధకారంలోకి వెళ్ళిపోతే దానికీ కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాల్సి వుంటుంది.
వెనక్కి తగ్గకపోతే తగ్గకపోయారు.. కనీసం విభజన విషయంలో సీమాంధ్రుల భయాలకైనా కాస్తంత సాంత్వన కలిగించే మాటలు చెప్పలేకపోతున్నారంటే, బహుశా సీమాంధ్ర అనే ప్రాంతంతో తమకేమీ సంబంధం లేనట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని అనుకోవాలి. కేంద్రం సైతం, సీమాంధ్ర అనే ప్రాంతం భారతదేశంలో లేనట్టుగా వ్యవహరిస్తోందనే అనుమానమూ కలుగుతోంది.
చివరగా.. డిగ్గీ రాజా తెలుసుకోవాల్సిందొకటుంది. మొత్తం 13 జిల్లాల్లో ప్రజానీకమంతా కేసీఆర్‌నో, చంద్రబాబునో, జగన్‌నో, ఇంకొకర్నో విమర్శించడంలేదిప్పుడు. కాంగ్రెస్ పార్టీని దోషిగా భావించి నడి రోడ్డుపై ఆ పార్టీని తగలబెట్టేస్తున్నారు, కడిగి పారేస్తున్నారు. డిగ్గీరాజా.. సీమాంధ్రకు హెలికాప్టర్‌లో అయినా వెళ్ళి అక్కడి పరిస్థితిని చూస్తే, ‘అందరూ అంగీకరించారుగా’ అన్న మాట ఇంకెప్పుడూ మీ నోట రాదేమో.!