రాజకీయాలంటే అంతే మరి. తాము కోరుకున్నట్టు రాజకీయ పంథా లేకపోతే వామపక్షాల నేతలు ఎంత మాటైనా తిడ్తారు. అది వారి నైజం. బీజేపీతో జత కట్టిన జనసేనాని పవన్‌కల్యాణ్‌పై గతంలో కూడా వామపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. తాజాగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి పవన్ వెళ్లారు. పవన్ వైఖరి సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణకు తీవ్రమైన కోపం తెప్పించింది.
చంద్రబాబునాయుడి మిత్రుడిగా పేరున్న నారాయణ జనసేనానిపై ఘాటు విమర్శ చేయడం చర్చనీయాంశమైంది. పవన్‌కల్యాణ్ ఒక దళారీ అని తీవ్ర విమర్శ చేశారు. అందుకే టీడీపీ, బీజేపీ మధ్య అనుసంధానం చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. ఇలాంటి మధ్యవర్తిత్వం అసలు మంచిది కాదని ఆయన హితవు చెప్పారు. గతంలో పవన్ ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చడాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో పవన్ ఎలా అంటకాగుతారని నారాయణ నిలదీశారు. బీజేపీతో కలవడం లౌకిక వాదానికి ప్రమాదకరమని పవన్‌ను హెచ్చరించారు.
ఒకవైపు చేగువేరా బొమ్మ పెట్టుకుని అతివాద విప్లవ రాజకీయాలను స్మరిస్తూ, మరోవైపు సావర్కర్ మితవాద రాజకీయాల వైపు వెళ్లడం ఏంటని నారాయణ ప్రశ్నించారు. రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకు సిద్ధమవుతాడని వెటకరించారు. అసలు పవన్‌కు నిలకడ లేదని తూర్పారపట్టారు. కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడగలిగితే.. ఆ తర్వాత పవన్ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చని నారాయణ ఎద్దేవా చేశారు.
ఇవేమైనా రాజకీయాలా? ఇంకేమైనానా అని ఆయన ప్రశ్నించారు. భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. రాజకీయ నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసే రాజకీయాలకు మద్దతుగా పవన్ రావడం ఏంటని నారాయణ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తీరు బాధాకరమని, ఈ తీరు సరికాదని ఆక్షేపించారు.