ఇక దాచేది ఏమీ లేదు.. అంతా ఓపెనప్ అయిపోయింది. అజ్ఞాతవాసి కాపీనే! లార్గోవించ్ అనే ఫ్రెంచ్ సినిమా కథేంటి? అని గూగుల్ ను అడిగితే, ఐఎండీబీని సంప్రదిస్తే.. అజ్ఞాతవాసి కథనే అవి వివరించి చెబుతున్నాయి. ‘ఒక పవర్ ఫుల్ బిలియనీర్ మర్డర్ జరుగుతుంది. అతడి సీక్రెట్ అడాప్టెడ్ సన్ తెరపైకి వస్తాడు.
తన వారసత్వాన్ని నిరూపించుకోవడానికి, శత్రువుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొంటూ.. తన తండ్రిని చంపిన వాళ్లెవ్వరో తెలుసుకోవడమే లార్గోవించ్ కథ’ అని ఆయా వెబ్ సైట్లు చెబుతున్నాయి. అజ్ఞాతవాసి సినిమాను చూసి వచ్చాకా.. సంగ్రహించుకుంటే.. లార్గోవించ్ ను కాపీ కొట్టే త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందించాడని స్పష్టం అయిపోతోంది.
మూల కథ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. తండ్రి హతమవ్వడం.. వారసుడు ఎంట్రీ ఇవ్వడం.. తండ్రిని చంపిందెవరో తెలుసుకోవడానికి అతడు వేసే ఎత్తులు.. తన వారసత్వాన్ని నిరూపించుకోవడం…ఇలా చెప్పడంలో కథను రివీల్ చేయడం ఏమీ లేదు.. ఆల్రెడీ ఫ్రెంచ్ లో వచ్చేసిన కథనే కొత్తగా మనం రివీల్ చేసేది ఏముంది ఇక్కడ? అజ్ఞాతవాసి ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలైనప్పుడు ఇది కాపీ అనే ప్రచారం మొదలైంది.
క్రమక్రమంగా అది పతాక స్థాయికి చేరింది. ఫ్రెంచి సినిమా లార్గోవించ్ ను కాపీ కొట్టి ఈ సినిమాను రూపొందించారనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో హక్కుల వివాదం తెరపైకి వచ్చింది. కానీ.. అజ్ఞాతవాసి మేకర్లు ఈ విషయమై ఎక్కడా స్పందించనే లేదు. ఆఖరికి లార్గోవించ్ డైరెక్టర్ స్పందించినా.. త్రివిక్రమ్ స్పందించనే లేదు. సినిమా ఎలా ఉంటుందనే అంశంతో పాటు.. ఇది కాపీనా, కాదా? అనే అంశం కూడా విడుదల వరకూ ఉత్కంఠను రేపింది.
ఈ నేపథ్యంలో రెండు సినిమాలనూ పోల్చి చూశాకా.. చెప్పగిలిన అంశం ఏమిటంటే.. అజ్ఞాతవాసి కాపీనే అని! మూలకథ వరకూ ఎలాంటి సందేహం లేదు. ఇక లోతుల్లోకి వెళ్తే హీరో చేతిలో ఉండే బ్రాండెడ్ నైఫ్ ని కూడా వదల్లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్! మరోసారి తను కాపీ క్యాట్ అని ఈ దర్శకుడు నిరూపించుకున్నాడు. ఈ సారి కూడా యథావిధిగా అసలు వాళ్లకు క్రెడిట్ ఇవ్వకపోవడం విశేషం!