ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం తెలియని పెంపుడు కుక్క, అక్కడే ఎదురుచూస్తూ కూర్చుంది. తన యజమాని ఎప్పటికైనా వస్తుందనేది ఆ పెంపుడు కుక్క ఆశ. యానాంలో చోటుచేసుకుంది ఈ హృదయ విదారక ఘటన.
యానాం ఫెర్రీ రోడ్డులో ఉంటోంది కాంచన. ఆమె కొన్ని వ్యక్తిగత సమస్యలతో బాధపడుతోంది. ఆత్మహత్య శరణ్యం అని భావించింది. అనుకున్నదే తడవుగా తన పెంపుడు కుక్కను తీసుకొని యానాం-ఎదుర్లంక బాలయోగి వంతెన పైకి వెళ్లింది. బ్రిడ్జి పైనే చెప్పులు విడిచింది. కుక్కను కూడా అక్కడే ఉంచింది. వంతెన పైనుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
యజమాని నీళ్లలోకి దూకడంతో కుక్కకు ఏం జరిగిందో అర్థం కాలేదు. తన యజమాని తిరిగొస్తుందని, ఆమె చెప్పుల వద్ద రాత్రంతా ఎదురుచూస్తూ కూర్చుంది.
మరోవైపు కాంచన కనిపించడం లేదని ఆమె కుటుంబీకులు యానాం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. చాలా చోట్ల వెదికారు. చివరికి బ్రిడ్జి పైకి వచ్చారు. అక్కడే ఉన్న శునకాన్ని, దాని పక్కనే ఉన్న చెప్పుల్ని చూసి అనుమానించారు. ఆ చెప్పులతో పాటు శునకాన్ని కుటుంబీకులు గుర్తించారు.
దీంతో కాంచన నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందని గుర్తించారు. ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు. ఊహించినట్టుగానే గోదావరిలో కాంచన మృతదేహం లభ్యమైంది. కాంచన వస్తుందని, ఆ పెంపుడు శునకం ఇప్పటికీ ఎదురుచూడడం అందరి హృదయాల్ని కదిలిస్తోంది.