కాపీ కొట్టుకోండి.. కానీ క్రెడిట్‌ ఇవ్వండి!

ఈ ప్రపంచంలో కొత్తది అంటూ ఏమీలేదు. చెప్పే తీరులోనే కొత్తంతా ఉంది.. అని అంటారు. కొంతమంది సినిమా వాళ్లు ఈ మాటను గట్టిగా చెప్పుకొంటూ ఉంటారు. ప్రత్యేకించి తమ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చినప్పుడు..…

ఈ ప్రపంచంలో కొత్తది అంటూ ఏమీలేదు. చెప్పే తీరులోనే కొత్తంతా ఉంది.. అని అంటారు. కొంతమంది సినిమా వాళ్లు ఈ మాటను గట్టిగా చెప్పుకొంటూ ఉంటారు. ప్రత్యేకించి తమ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చినప్పుడు.. వీళ్లు సదరు కథను, కథనాన్ని ఎక్కడ నుంచినో కొట్టేసుకుని వచ్చారు అనేమాట వినిపించినప్పుడు.. ఈ డైలాగ్‌నే వల్లె వేస్తూ ఉంటారు తెలుగు మూవీ మేకర్లు.

తెలుగు చిత్ర పరిశ్రమ వరకూ చూసుకొంటే కాపీలు కొత్త కాదు. ఈ అంశాన్ని చెప్పడమూ కొత్త కాదు. దశాబ్దాల నుంచి అనేక సూపర్‌ హిట్‌ సినిమాలను పరిశీలిస్తూ వస్తే.. వాటి మూలాలు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటాయి. తెలుగునాట ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచిన సినిమాల మూలాలు కూడా ఏ హాలీవుడ్‌లోనో… ఇటాలియనో, స్పానిషో, కొరియన్‌ భాషలోని సినిమాలు కావడం పెద్ద విచిత్రం ఏమీకాదు.

కథలు కాపీ కొట్టినవాళ్లు, కథనాలను కాపీ కొట్టినవాళ్లు, డైలాగులను కాపీ కొట్టినవాళ్లు, సీన్లను కాపీ కొట్టినవాళ్లు, పాటలను కాపీ చేసినవాళ్లు, బీజీఎంను కాపీ చేసినవాళ్లు.. ఇలా 24 క్రాఫ్ట్స్‌లోనూ కాపీదనం కనిపిస్తూ ఉంటుంది. పరీక్షల్లో కాపీ కొట్టడం తప్పేనేమో కానీ.. సినిమాల్లో కాపీ కొట్టడం ఏమాత్రం తప్పుకాదని చెప్పాలి. ఎందుకంటే.. కాపీ కొట్టినా మనకో మంచి సినిమాను చూపించాడనో, మంచి సీన్‌ను చూపించాడనో సదరు కాపీ రాయుళ్లను అభినందించాల్సి ఉంటుంది. ఒక మారుమూల పల్లెలోని తెలుగువాడు ఇటాలియన్‌ సినిమాలోని కమ్మదనాన్ని వీక్షించలేడు కదా.. మనోళ్లు దాన్ని కాపీచేసి చూపించడం అభినందించాల్సిన పనే. ఈ రకంగా చెబితే క్రియేటర్లకు కాపీ కొట్టడం ఏమాత్రం తప్పుకాదు.

మన సినిమా వాళ్లను ఇక్కడ వరకూ అభినందించవచ్చు. కానీ.. వీళ్ల చీప్‌టెక్నిక్స్‌ అంతటితోనే ఆగిపోతూ ఉన్నాయి. కాపీ కొడితే తప్పుకాదు కానీ.. వీళ్లు కాపీ కొట్టామని గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు. అక్కడే వస్తోంది ప్రాబ్లమ్‌. కాపీ కొట్టడం తప్పుకాదు అనుకున్నప్పుడు.. ఆ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పరు. కాపీ కొట్టడం తప్పుకాదు కానీ, కొట్టిన కాపీని చెప్పుకోలేకపోవడం మాత్రం తప్పే. ఒక విధమైన దివాళాకోరుతనం.

మేము మా సినిమాను ఇంకో ఫలానా సినిమా నుంచి స్ఫూర్తి పొందాం.. మా సినిమాలోని ఈ సీన్‌ ఫలానా హాలీవుడ్‌ సినిమా నుంచి తీసుకున్నాం, మా సినిమా కథనం మొత్తం ఇంకో ఇటాలియన్‌ సినిమా ఆధారంగా నడుస్తుంది.. ఈ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఫలానా ఎంటర్‌ టైనర్‌ నుంచి తీసుకున్నదే, మా సినిమాలోని పాటలు.. ఇంకో భాష ప్రేక్షకులు ఆల్రెడీ విన్నవే.. అని ఒప్పుకునే ధైర్యం సినిమా వాళ్లలో ఏ మాత్రం అగుపించడం లేదు. కాపీ చేసి కూడా.. వీళ్లు అసలు క్రెడిట్‌ను అసలు వాళ్లకు ఇవ్వకుండా.. వీళ్లు ఓన్‌ చేసుకునే ఒక దిగజారుడు తీరున వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ చీప్‌ టెక్నిక్స్‌కు పెద్ద పెద్దదర్శకులు బడా మూవీ మేకర్లు మినహాయింపు కాదు.

పాతతరం దర్శకుల్లో ఇలాంటి కాపీ కొట్టే తత్వం చాలానే ఉండేది. ప్రత్యేకించి 80లలోని చాలా తెలుగు సినిమాలు విదేశీ సినిమాల స్ఫూర్తితో వచ్చినవే. వాటి వెనుక వాస్తవాలను తక్కువ మంది దర్శకులు, రచయితలు మాత్రమే ఒప్పుకొంటూ ఉంటారు. ఇక ప్రస్తుత తరానికి వస్తే.. కాపీ కొట్టడమూ ఈజీనే పట్టుబడటమూ ఈజీనే అన్నట్టుగా మారిపోయింది దర్శకుల, రచయితల పరిస్థితి. వీళ్లు ఏ చిన్న ఫ్రేమ్‌ను కాపీ చేసుకు వచ్చినా ప్రేక్షకులే ఇట్టే పట్టేసుకుంటున్నారు. ప్రపంచంలోని ఏ భాష నుంచి వీళ్లు కాపీ చేసుకుని వచ్చినా సరే… సినిమా వాళ్లు దొరికిపోతున్నారు. విడుదల తర్వాతి సంగతెలా ఉన్నా.. విడుదలకు ముందే.. కూడా కాపీల కహానీలు వెలుగులోకి వచ్చేస్తున్నాయంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

మరి ఇలాంటి జనరేషన్లో కాపీలు కొట్టే వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉండాలి? 80లలో ఏదైనా సినిమాను కాపీ కొట్టి తీస్తే.. ఆ విషయం సదరు దర్శకులు, రచయితలు ప్రకటించుకునేంత వరకూ కూడా చాలామందికి తెలిసేది కాదు. క్రిటిక్స్‌ అప్పుడు కూడా ఉన్నప్పటికీ.. అది క్యాసెట్ల కాలం. విదేశీ సినిమాల క్యాసెట్లు అల్లాటప్పా జనాలకు దొరికే రోజులు కావు అవి. సీడీల కాలం వచ్చాకా మాత్రం పరిస్థితి మారిపోయింది. ఏ సినిమాకు మూలం ఎక్కడుందో కనుక్కోవడం జర్నలిస్టు స్థాయి వ్యక్తులకు సులభమే అయ్యింది. పత్రికల్లో అందుకు సంబంధించిన కథనాలు ధైర్యంగా రాయడం మొదలైంది.

ఇక ఇప్పుడు.. ప్రేక్షకులు చాలా అడ్వాన్స్‌ అయ్యారు. సినిమా మేకర్లకంటే.. ఎక్కువ సినిమాలను వెదికేసుకుని చూస్తున్నారు సాధారణ ప్రేక్షకులు. సిసలైన సినీ అభిమాని ఎవ్వడూ మన భాష సినిమాలే చూస్తాను, మా హీరో సినిమాలే చూస్తాను అనడు కదా.. ఇంటర్నెట్‌లోకి దూకి.. అంతర్జాతీయ సినిమాలను చూసే ఆసక్తి కొన్ని లక్షల మందిలో కనిపిస్తోందిప్పుడు. అలాంటి వారు.. టాలీవుడ్‌ దర్శకులు, రచయితల కన్నా ముందే గొప్ప గొప్ప సినిమాలను చూసేస్తున్నారు. టాలీవుడ్‌లో సదరు సినిమాలను కాపీ కొడితే.. నిమిషాల వ్యవధిలోనే మూలకథలేమిటో చెబుతున్నారు. ఇంటర్నెట్‌లో అందుకు సంబంధించిన పోస్టులు, వీడియోలు, ఆధారాలు చూపించేస్తున్నారు.

ఇలాంటప్పుడు సినిమా వాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా? కానీ.. ప్రముఖ దర్శకులే అలా ఉండటంలేదు. ఎక్కడో కొట్టుకొచ్చిన కథ క్రెడిట్‌ కూడా వీళ్లకే కావాలి. 'మర్యాదరామన్న' సినిమా టైటిల్‌ కార్డ్స్‌లో ఆ సినిమా కథ క్రెడిట్‌ తన సోదరుడు కాంచికి ఇచ్చుకున్నాడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. తీరా జనాలు అది కాపీ కథ అని తేల్చి చెప్పాకా.. అవునౌను.. అంటూ రాజమౌళి కూడా ఒప్పుకున్నాడు. ఎంత తక్కువస్థాయి పని అది? అక్కడ కూడా కాపీ కొట్టడం తప్పుకాదు.. దాన్ని ఒప్పుకోకుండా క్రెడిట్‌ను సొంతం చేసుకోవడం తప్పు కాదా?

ఇక 'కుమారి 21ఎఫ్‌'కు కథా రచయితగా తన పేరు వేసుకున్నాడు సుకుమార్‌. అంత బోల్డ్‌ కథ ఎలా రాశారు సార్‌ అని ఎవరో అడిగితే.. సుకుమార్‌ చాలానే చెప్పుకొచ్చాడు. అది తన కాలేజీరోజుల కథ అని.. ఒక అమ్మాయి స్ఫూర్తి అని ఏదేదో చెప్పాడు. కానీ.. సదరు సినిమా కథకు మూలం 'లైలా సేస్‌' అనే ఫ్రెంచ్‌ సినిమా. కుమారి సినిమా విడుదల అయిన కొన్ని గంటల్లోనే అది కార్బన్‌ కాపీ అని, కథాంశాన్ని అంతా ఒక లైలా సేస్‌ నుంచి తీసుకున్నారని, క్లైమాక్స్‌ను మరో హాలీవుడ్‌ సినిమా నుంచి లేపుకొచ్చారని ప్రేక్షకులే ఆధారాలతో సహా పట్టించారు. ఇలాకాపీ కొట్టి.. కథకు స్ఫూర్తింటి సార్‌ అని అడిగితే.. సుకుమార్‌ చెప్పిన పిట్టకథ, రచయితగా ఆయన స్థాయిని దిగజార్చేది కాదా?

ఇక హాలీవుడ్‌ నుంచి కథలను లేపుకొస్తే జనాలు కనుక్కొంటున్నారు.. లోకల్‌ మేడ్‌ అయితే కనుక్కోలేరని అనుకున్నారో ఏమోకానీ.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 'అ ఆ'ని యద్ధనపూడి నవల నుంచి తెచ్చుకున్నాడు. అలా తెచ్చుకోవడం తప్పుకాదు.. కానీ, ఆ మాటను ముందుగానే టైటిల్‌ కార్డ్స్‌లో వేసి ఉంటే? ఎంత పద్ధతిగా ఉండేది? తీరా విడుదల అయ్యాకా.. కాపీ అనే దుమారం రేగాకా.. 'యద్ధనపూడి గారితో మాట్లాడాను..' అని త్రివిక్రమ్‌ స్టైల్‌గా చెప్పుకొచ్చాడు.

రెండోరోజు నుంచి టైటిల్‌ కార్డ్స్‌లో యద్ధనపూడి పేరు వేశారు. అదే పని తొలిరోజు నుంచే వేసి ఉంటే.. విడుదల వరకూ ఆ విషయాన్ని దాచి.. టైటిల్స్‌ దగ్గర ఫలానా నవల స్పూర్తితో ఈ సినిమాను తీశాను అని ధైర్యంగా చెప్పుకుని ఉంటే.. త్రివిక్రమ్‌ స్థాయి మరింత పెరిగేది. అయితే హాలీవుడ్‌ సినిమాలను చూసి.. దొంగ చాటుగా వాటిల్లోని సీన్లను తెగ వాడేయడం అలవాటు చేసుకున్న త్రివిక్రమ్‌కు కాపీ పెద్ద తప్పని అనిపించినట్టుగా లేదు. ఏ మాత్రం షై కూడా కలిగినట్టుగా లేదు.

ఇదీ తెలుగులో టాప్‌ అనిపించుకుంటున్న దర్శకుల తీరు. వీళ్లు మేధావులే, గొప్ప సినిమా మేకర్లే, వ్యక్తిగత టాలెంట్‌తో ఎదిగిన వాళ్లే. కానీ.. కాపీ పాట్లు ఎందుకు? కాపీ కొట్టినా ఆ విషయాన్ని ధైర్యంగా ఎందుకు ఒప్పుకోలేరు? కొత్త వాళ్లు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వాళ్ల కెరీర్లే నాశనం అవుతాయి. వీళ్లు పెద్ద దర్శకులు కాబట్టి.. అంతా రైటయిపోయినట్టా? ఆ మధ్య 'స్వామిరారా' సినిమా దర్శకుడు సుధీర్‌ వర్మ తన సినిమా విడుదల అయిన మరుసటి రోజే.. తన సినిమాలోని ఏయే సీన్లను ఏ సినిమాల నుంచి లేపుకుని వచ్చానో ప్రెస్‌నోట్‌ విడుదల చేశాడు.

ఏ సీన్‌కు ఏ సినిమాలోని ఏ సీన్‌ స్ఫూర్తో అతడు కూలంకషంగా వివరించాడు. ఇటీవలే వచ్చిన 'అర్జున్‌ రెడ్డి'లో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ విషయంలో ఏ ఆల్బమ్స్‌ నుంచి ఏ నంబర్‌ను వాడుకున్నామో.. టైటిల్‌ కార్డ్స్‌లో వివరించి చెప్పారు. ఈ మాత్రం హుందాతనం పెద్ద దర్శకుల్లో కూడా కనిపిస్తే అప్పుడు వీళ్లు నిజంగానే పెద్దవాళ్లు అయినట్టు!