‘కాన్సెప్ట్ బేస్డ్’ కావాలంటున్న మసాలా హీరో

మాస్ రాజాగా పేరున్న హీరో రవితేజ.. ఇప్పుడు అచ్చంగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే కోరుకుంటున్నాడుట. కెరీర్ లో సుదీర్ఘ కాలం కమర్షియల్ మాస్ మసాలా చిత్రాలను చేసిన తర్వాత.. రవితేజకు హఠాత్తుగా కాన్సెప్ట్ సినిమాల…

మాస్ రాజాగా పేరున్న హీరో రవితేజ.. ఇప్పుడు అచ్చంగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే కోరుకుంటున్నాడుట. కెరీర్ లో సుదీర్ఘ కాలం కమర్షియల్ మాస్ మసాలా చిత్రాలను చేసిన తర్వాత.. రవితేజకు హఠాత్తుగా కాన్సెప్ట్ సినిమాల మీద మోజు పుట్టినట్టుగా ఉంది.

ఏదైనా సరే ఒక సారి రుచి మరిగితే గానీ తెలియదు. అచ్చంగా అదే రీతిగా.. రవితేజ కూడా రొటీన్ ఫార్ములా చిత్రాలతో కెరీర్ చాలా భాగం నడిపించిన తర్వాత.. ‘రాజా ది గ్రేట్’ వటి కాన్సెప్ట్ చిత్రం ఆయనకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. ఆ తరహా చిత్రాల మీద మక్కువ పెరిగింది.

ఆ చిత్రం తర్వాత రవితేజ ఇప్పుడు ‘టచ్ చేసి చూడు’ చిత్రం చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇది కూడా అచ్చంగా మాస్ మసాలా కమర్షియల్ రొటీన్ చిత్రంగానే రూపొందుతోంది. హిట్ ఫ్లాప్ ల సంగతి పక్కన పెడితే.. ఎంతగానో అలవాటైపోయిన ఇంత రొటీన్ కమర్షియల్ మాస్ చిత్రం చేయడం రవితేజకే పెద్దగా సంతృప్తి ఇవ్వడం లేదుట. అందుకని నెక్ట్స్ చేయదలచుకుంటున్న ప్రాజెక్టు కోసం కాన్సెప్ట్ బేస్డ్ కథ కావాలని ఎదురుచూస్తున్నాట్ట.

రవితేజ అంటేనే మాస్ సినిమాకు పర్యాయపదంలాగా ఆయన కెరీర్ ఇప్పటిదాకా గడిచిందనే అనుకోవాలి. హీరోగా చేసిన మొత్తం సినిమాల్లో ఒకటిరెండు తప్ప అన్నీ ఫక్తు మసాలా సినిమాలే. అతి భయంకరమైన మాస్ సినిమా కథ అంటే ప్రతి రైటర్ కూడా రవితేజను ఊహించుకుంటూ సీన్లు ప్లాన్ చేసుకునే తరహాలో.. రవితేజకు మాస్ గుర్తింపు వచ్చింది.

అయితే ఈ మాస్ ఇమేజి చట్రం నుంచి రవితేజ బయటపడాలని ఆరాటంతో ఉండడం శుభపరిణామమే. ఇటీవల వచ్చిన ‘రాజా ది గ్రేట్’ లో రవితేజ చాలా డిఫరెంట్ పాత్ర పోషించాడు. లాజిక్ ను పట్టించుకోకపోతే చాలా మంది ప్రేక్షకులను చిత్రం బాగా అలరించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందింది. ఆ తరహాలో కాన్సెప్ట్ బేస్డ్ కమర్షియల్ స్టోరీలను ఎంచుకోవాలని రవితేజ అనుకుటున్నారని.. రైటర్లకు, డైరక్టర్లకు అలాంటి కథల కోసం పురమాయిస్తున్నారని వినికిడి.