ఎన్టీఆర్ గోల్డెన్ టచ్ తో దాదాపు 3నెలల పాటు ఏకథాటిగా నంబర్ వన్ స్థానంలో కొనసాగింది స్టార్ మా. బిగ్ బాస్ ఇలా కంప్లీట్ అయిందో లేదో వెంటనే స్థానం కోల్పోయింది. ఈ లెక్కల మాట అటుంచితే ఎన్టీఆర్ మరోసారి బిగ్ బాస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
త్రివిక్రమ్ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో తారక్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలకు ఫుల్ గా టైం కేటాయించాలి. మరీ ముఖ్యంగా రాజమౌళితో సినిమా చేస్తున్నప్పుడు ఇతర వ్యవహారాలు పెట్టుకుంటే అస్సలు కుదరదు. ఇలాంటి రెండు పెద్ద సినిమాల మధ్య బిగ్ బాస్ సీజన్-2చేయడం అవసరమా అనే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్.
ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్ ను వెనక్కి ఇచ్చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంటున్న వ్యక్తులపై ఎన్టీఆర్ కు అభ్యంతరాలున్నాయి. మరీ చిన్న చిన్న సెలబ్రిటీలతో కార్యక్రమం పెట్టి దానికి తనను వ్యాఖ్యాతగా నిలబెట్టడం ఏమాత్రం బాగాలేదని ఎన్టీఆర్ గట్టిగా ఫీలవుతున్నాడు. ఇప్పుడు కత్తి మహేష్ లాంటి వాళ్లు సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్నారంటే దానికి కారణం ఒక విధంగా ఎన్టీఆరే కదా.
మరోవైపు స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ సీజన్-2 కోసం సన్నద్ధమౌతోంది. పూణె విల్లాలో షూటింగ్ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఈసారి హైదరాబాద్ లోనే షో ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ నుంచి మాత్రం వాళ్లకు కాల్షీట్లు ఇవ్వలేదు. డైరక్ట్ గా వద్దని చెప్పలేక చూద్దామంటూ విషయాన్ని నానుస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకటి మాత్రం వాస్తవం. మొదటి సీజన్ చూసిన తర్వాత ఎన్టీఆర్ కు ప్రత్యామ్నాయంగా మరో హీరోను మాత్రం ఎవరూ ఊహించుకోలేరు. ఎలాంటి భేషజాలకు పోకుండా కంటెస్టంట్స్ తో కలిసిపోయి ఎన్టీఆర్ షోను రక్తికట్టించిన విధానం, తనే స్వయంగా వాళ్ల కోసం వంట చేయడం, ప్రతి ఒక్కర్ని ఆయన సంభోదించిన తీరు.. ఇవన్నీ చూసిన తర్వాత ఎన్టీఆర్ కు ఆల్టర్నేట్ వెదకటం చాలా కష్టం.
ఇప్పుడు ఎన్టీఆర్ ను బిగ్ బాస్ కు రప్పించాలంటే ఒకటే మార్గం. సీజన్-1లా కాకుండా ఈసారి కాస్త దమ్మున్న సెలబ్రిటీల్ని రంగంలోకి దించాలి. అప్పుడు ఆటోమేటిగ్గా ఎన్టీఆర్ కు కూడా ఉత్సాహం వస్తుంది. అన్నట్టు సీజన్-2కోసం ఇంతకుముందు ఇచ్చిన ఎమౌంట్ కంటే ఎన్టీఆర్ కు ఇంకాస్త ఎక్కువ ఇవ్వడానికి కూడా రెడీ అవుతోంది స్టార్ మా.