అరవం నుంచి వచ్చి తెలుగులో సినిమాలు తీస్తున్న దర్శకులు కానీ, అరవం నుంచి అనువాదం అవుతున్న సినిమాలు కానీ.. అరవంలో వచ్చి తెలుగులో రీమేక్ అవుతున్న సినిమాలు కానీ.. సరైన హిట్టు కొట్టిన దాఖలాలు లేవు ఈ మధ్య. అక్కడ భారీ హైప్ తో వచ్చిన సినిమాలను ఇక్కడకు తెచ్చి మార్కెటింగ్ చేద్దామన్నా అది అంత సులువైన బిజినెస్ ఏమీ కావడం లేదు.
ఇవి అపరిచితుడు, గజనీ, మన్మథ, చంద్రముఖి రోజులు కావు. తెలుగునాట ఇండస్ట్రీ హిట్ అనిపించుకోదగిన తమిళ సినిమాలు కానీ, ఆ స్థాయి మూవీ మేకర్లు కానీ తమిళనాడు నుంచి రావడం లేదు ఈ మధ్య. ఇటీవలే స్పైడర్ అంటూ మహేశ్ బాబుకు డిజాస్టర్ ను మిగిల్చి వెళ్లాడు మురుగదాస్. ఆ సినిమా పోవడం వల్ల మురుగదాస్ కు ఎలాంటి నష్టం లేదు. ఎంచక్కా తమిళంలోనో, హిందీలోనో మరో సినిమా చేసుకొంటాడు.
అయితే తమిళ దర్శకుల మాయలో పడ్డ తెలుగు హీరోలు మాత్రం డిజాస్టర్లను ఖాతాలు జమ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడనే మాట వినిపిస్తోంది. ప్రభాస్ కు స్కెచ్ వేస్తున్నాడట అట్లీ. ఈ దర్శకుడి సినిమా రాజా- రాణి తమిళం నుంచి అనువాదమై తెలుగులో మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇతడు విజయ్ తో తీసిన ఒక సినిమా తెలుగులోకి అనువాదమైన ఫెయిల్ అయ్యింది.
ఇక ఇటీవలే వచ్చిన మెర్సల్.. భారీ వసూళ్లను సాధించినా.. అదంతా తమిళనాడు వ్యవహారమే అయ్యింది. కథా, కథనాల విషయంలో మెర్సల్ బెస్ట్ అనిపించుకోలేకపోయింది. విజయ్ మానియా మీద వసూళ్లు మాత్రం వచ్చాయి. మరి వాటికే ఫిదా అయిపోయాడో కానీ.. అట్లీతో సంప్రదింపుల్లో ఉన్నాడట ప్రభాస్. చూస్తుంటే.. ఈ హీరో అట్లీకి ఓకే చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ హీరో కూడా మరో తమిళ దర్శకుడి ట్రాప్ లో పడ్డట్టేనా?