సెలబ్రిటీల జీవితాలు గాజు మేడల్లాంటివి. చాలా అంటే చాలా జాగ్రత్తగా వుండాల్సిందే. లక్షల్లో సంపాదన, బి ఎమ్ డబ్ల్యూ కారు. ఒక డ్రయివర్ ను పెట్టుకుంటే ఏం పాయె? లేదా పీకల్దాకా మందు కొడతామని తెలిసినపుడయినా, డ్రయివింగ్ కు వేరే ఏర్పాట్లు చేసుకోవచ్చు కదా? కానీ ఎక్కడో ధీమా.
ఇప్పుడేమంయింది. సెలబ్రిటీ ఏంకర్ మాచిరాజు ప్రదీప్ కాస్తా కటకటాలకు కాస్త దూరంలో వున్నారు. బ్రీత్ ఎనలైజర్ పై 150పాయింట్లు రేంజ్ కు చేరేలా మందు కొట్టి, తన స్వంత బి ఎమ్ డబ్ల్యు కారును తానే డ్రయివ్ చేసారు.
బహుశా మాంచి న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి వస్తూ వుండొచ్చు. పోలీసులు చెక్ చేసారు. దొరికిపోయాడు. లక్షల ఖరీదైన కార్ ను సీజ్ చేసారు. ఇక ప్రదీప్ మీద తదుపరి చర్య వుంటుంది.
మరి అంతా పక్కా రికార్డుగా వుంది కాబట్టి, లోపాయి కారీ వ్యవహారాలు జరగడానికి లేదు. కానీ రాజు తలుచుకుంటే అన్నట్లుగా, పెద్దవాళ్లు ఎవరైనా ఇన్ వాల్వ్ అయితే వ్యవహారం మారవచ్చు. ఆ మధ్య డ్రగ్ కేసులో జరిగింది అదేగా. కానీ ఈ సంగతి ఎలా వున్నా, తాను నిత్యం కనిపించే చానెళ్లలోనే ఇప్పుడు ప్రదీప్ వార్తగా మారిపోయాడు. దాంతో సంపాదించుకున్న పరువు మొత్తం పాయె.