కాస్త నేమూ ఫేము రాగానే సినిమా తారలు చాలా మంది తమ పేరు మీదనో, తమ బ్రాండ్ అనే పేరుతోనే ఏదో ఒక వ్యాపారం ప్రారంభిస్తూ ఉంటారు. ప్రత్యేకించి కాస్మోటిక్స్, క్లోతింగ్ బ్రాండ్స్ చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఆరంభించే వ్యాపారాలు. చాలా మంది హీరోలకూ, హీరోయిన్లకు ఇలాంటి వ్యాపారాలున్నాయి.
అయితే ఇలాంటి విషయాల్లో కూడా వారి సక్సెస్ రేటు రకరకాలుగా ఉంటుంది. చాలా మంది తారలు వాటిని ప్రారంభించినప్పుడు వాటిని వార్తల్లో నిలుపుతారు. ఆ తర్వాత చాలా వరకూ తెరమరుగు అవుతాయి. కొందరి ఫ్యాషన్ బ్రాండ్లు మాత్రమే మార్కెట్లో స్టడీగా కొనసాగుతూ ఉంటాయి.
వాటి సంగతలా ఉంటే.. ఇప్పుడొక హీరోయిన్ వ్యాపారం అతి వేగంగా వృద్ధి చెందింది. ఆమె దాన్ని ప్రారంభించిన మూడేళ్లలోనే దాన్ని టేకోవర్ చేయడానికి రిలయన్స్ వంటి పెద్ద కంపెనీ ముందుకు వచ్చింది.
కెరీర్ పరంగా దూసుకుపోతూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్స్ కు గ్లోబల్ అంబాసిడర్ గా నియమితం అయ్యే స్థాయికి చేరుకున్న అలియా భట్ ఇప్పుడు తన సొంత బ్రాండ్ ను కూడా సూపర్ సక్సెస్ ఫుల్ స్థాయికి తీసుకెళ్లింది. దీంతో దాన్ని మూడు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి టేకోవర్ చేయడానికి రిలయన్స్ ముందుకు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.
2020 సంవత్సరంలో అలియా భట్ చిన్న పిల్లల దుస్తులకు సంబంధించిన బ్రాండ్ ను ప్రారంభించింది. సరసమైన ధరల్లోనే పిల్లలు బట్టలను అందించాలనే మార్కెటింగ్ స్ట్రాటజీతో ఈ సంస్థను ఆరంభించింది అలియా భట్. మరి మూడేళ్లైనా గడవక ముందే ఇప్పుడు దాన్ని టేకోవర్ చేయడాని రిలయన్స్ ముందుకు వచ్చిందట.
ప్రస్తుతం అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. మూడు వందల నుంచి 350 కోట్ల రూపాయలు వెచ్చించి అలియా భట్ దుస్తుల బ్రాండ్ ను రిలయన్స్ తను ఓన్ చేసుకోనుందట. మరి దీన్ని ఈ ధరకు అమ్మినా అలియా భట్ ఒక స్టార్టప్ ను స్టార్ట్ చేసి దాని ద్వారా మంచి స్థాయిలో సొమ్ము చేసుకున్నట్టే అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.