అనవసరంగా నానిని లాగుతున్నారు

కంపారిజన్ అన్నది హీరోలకు ఓ సమస్యే. ఎవరి టాలెంట్ వారిది. ఎవరి బిజినెస్ వారిది. కానీ ఫ్యాన్స్ కావచ్చు, యాంటీ ఫ్యాన్స్ కావచ్చు అలా ఊరుకోరు. ఏదో ఒకటి పీకుతుంటారు. దాంతో హీరోలు ఇబ్బందుల్లో…

కంపారిజన్ అన్నది హీరోలకు ఓ సమస్యే. ఎవరి టాలెంట్ వారిది. ఎవరి బిజినెస్ వారిది. కానీ ఫ్యాన్స్ కావచ్చు, యాంటీ ఫ్యాన్స్ కావచ్చు అలా ఊరుకోరు. ఏదో ఒకటి పీకుతుంటారు. దాంతో హీరోలు ఇబ్బందుల్లో పడతారు ఒకోసారి. నాని నాన్ కాంట్రావర్సీ హీరో. అతగాడికి ఇండస్ట్రీలో బ్యాకింగ్ లేదు. అలా అని ఒంటరి కాదు. అందరూ మిత్రులే. తన పాజిటివ్ నేచర్ తో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ వస్తున్నాడు.

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో నాని సినిమా ఎంసిఎ కలెక్షన్లు, అఖిల్ సినిమా హలో కలెక్షన్లు కంపార్ చేయడం, అవి ఇవి కలిపి పోస్ట్ చేయడం, కామెంట్ లు చేయడం వంటివి హుషారుగా సాగుతున్నాయి. నాని సినిమా ఎంసిఎ నిస్సందేహంగా తొలి రోజు మంచి కలెక్షన్లు నమోదు చేసింది. అందులో సందేహం లేదు. దానికి కేవలం నాని మాత్రమే కారణం కాదు.

నాని క్రేజ్ తో పాటు సాయి పల్లవి క్రేజ్ నైజాంలో భయంకరంగా పే చేసింది. ఫిదా సినిమా నైజాంలో ఏ రేంజ్ లో ఆడిందో తెలిసిందే. అలాగే దిల్ రాజు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మంచి స్ట్రాటజిస్ట్. నైజాంలో చాలా ఎక్కువ సంఖ్యలో థియేటర్లు వేసి, నాని, సాయిపల్లవి క్రేజ్ ను తొలి రోజే క్యాష్ చేసుకునే ప్లాన్ చేసారు. ఇవన్నీ పని చేసి మంచి కలెక్షన్లు నమోదు చేసాయి.

ఇక అఖిల్ మీద ఏ అంచనాలు లేవు. ఎందుకంటే తొలిసినిమా విఫలమైంది. ఇక డైరక్టర్ విక్రమ్ కుమార్ మీదనే ఆశలు. అంచనాలు. విక్రమ్ కుమార్ క్లాస్ డైరక్టర్ కానీ మాస్ డైరక్టర్ కాదు. అలాంపుడు ఓపెనింగ్స్ కుమ్మేస్తాయని అనుకోవడానికి లేదు. స్లోగా పికప్ కావడం అన్నది విక్రమ్ కుమార్ సినిమాలకు తప్పని సరి.

కానీ ఈలోగానే నాని-అఖిల్ సినిమాల కలెక్షన్లు చూపిస్తూ, కంపార్ చేస్తూ, కామెంట్లు చేస్తూ, సోషల్ మీడియాలో హడావుడి మొదలయింది. దీనివల్ల అనవరంగా హీరో నాని కాస్త ఇబ్బందికర సిట్యువేషన్ లో పడతాడు. నిజానికి నాని తన సినిమాతో పాటు అఖిల్ సినిమా కూడా బాగా ఆడాలని తొలి నుంచి విష్ చేస్తున్నాడు. ఆ విధంగా మాట్లాడుతున్నాడు. కానీ నాని ఫ్యాన్స్ నో, మరి అఖిల్ యాంటీ ఫ్యాన్స్ నో ఈ ఫ్రెండ్లీ వాతావరణాన్నికాస్త పాడుచేస్తున్నట్లు కనిపిస్తోంది.