వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత అడిగిన వివరాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టులో ఇవాళ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే సీబీఐ తరపున అఫిడవిట్ దాఖలు కాకపోవడం గమనార్హం.
తన తండ్రి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తునకు సంబంధించి డైరీ వివరాలు ఇవ్వాలని పిటిషనర్ డాక్టర్ సునీత ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సునీత అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో కేసు డైరీని పిటిషనర్‌కు ఇచ్చే ప్రసక్తే లేదని ధర్యాసనం స్పష్టం చేయడం గమనార్హం.
హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ఏం కనిపెట్టిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్‌లో అందించాలని సుప్రీం ధర్మాసనం సీబీఐని ఆదేశించింది.
ఈ కేసులో రిప్లై పిటిషన్‌ను రెండు వారాల్లో దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీబీఐ విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని ఆయన తరపు న్యాయవాది కోరగా..ఆందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అవినాష్ రెడ్డి బెయిల్‌తో పాటు వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.