టీడీపీకి కడు భారం.. ఉత్తరాంధ్రా ఆమడ దూరం

ఉత్తరాంధ్రా కంచుకోటలు అన్నది తెలుగుదేశానికి ఒకప్పటి మాట. 2019 తరువాత మొత్తానికి మొత్తం రాజకీయ సన్నివేశం మారిపోయింది. వైసీపీ అనే మరో బలమైన ప్రాంతీయ పార్టీ టీడీపీని చాలా గట్టిగా ఢీ కొట్టింది.  Advertisement…

ఉత్తరాంధ్రా కంచుకోటలు అన్నది తెలుగుదేశానికి ఒకప్పటి మాట. 2019 తరువాత మొత్తానికి మొత్తం రాజకీయ సన్నివేశం మారిపోయింది. వైసీపీ అనే మరో బలమైన ప్రాంతీయ పార్టీ టీడీపీని చాలా గట్టిగా ఢీ కొట్టింది. 

తెలుగుదేశం ఏ రకమైన వ్యూహాలూ సామాజిక సమీకరణల మద్దతుతో గెలుస్తోందో వాటినే చాలా తెలివిగా సరికొత్తగా వైసీపీ తిరిగి ప్రయోగించడంతో టీడీపీకి ఉత్తరాంధ్రాలో గెలుపు సందేహాలు మొదలయ్యాయి. 

2014లో మొత్తం 34 శాసనసభ సీట్లకు గానూ మిత్రపక్షమైన బీజేపీతో కలుపుకుని పాతిక సీట్లను గెలుచుకున్న టీడీపీ 2019 నాటికి కేవలం అర డజన్‌ సీట్లకు పడిపోయింది. 2024 ఎన్నికలలో ఎన్ని సీట్లు గెలుచుకుంటామన్నది ఇదమిద్దంగా తేలని వైనంగా ఉంది. 

2014 నాటి హవాను ప్రదర్శిస్తేనే తప్ప ఆంధ్రాలో టీడీపీకి అధికారం దక్కదు. ప్రస్తుతానికి చూస్తే సగానికి పైగా సీట్లలో టీడీపీకి గెలుపు ఆశలు అణగారి ఉన్నాయని తెలుస్తోంది. 

అనేక ఎన్నికలు చూసుకుంటే ఉత్తరాంధ్రాలో దాదాపుగా ఎనిమిది సీట్ల వరకూ టీడీపీ కొత్తగా ఖాతా తెరచిన సందర్బం కూడా లేదు. అంటే ఈసారి కూడా అలాంటి సీట్లను వదిలేసుకోవాల్సిందేనా అన్నదే చర్చగా ఉంది. 

ఉదాహరణకు చూసుకుంటే ఏజెన్సీలోని పాలకొండ, సాలూరు, కురుపాం, పార్వతీపురం, అరకు, పాడేరు, అలాగే విశాఖ  జిల్లాలోని మాడుగుల, శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం సీట్లలో గడచిన పదేళ్ల కాలంలో టీడీపీ జెండా ఎగరలేదు. కొన్ని చోట్ల రెండు దశాబ్దాలుగా కూడా టీడీపీ గెలిచిన పాపాన పోలేదు. ఇపుడు కూడా ఆయా సీట్లు కచ్చితంగా వైసీపీకే అన్నది అంతా అంటున్న మాట. ఆ విధంగా చూస్తే టీడీపీ వైసీపీల మధ్యన ముఖాముఖీ పోరు 26 సీట్లకే పరిమితం అయింది అనుకోవాలి. ఇందులో కూడా సగం సీట్లలో గెలుపు గ్యారంటీ లేదు అన్నది పసుపు శిబిరాన్ని కలవరపెడుతున్న అంశంగా ఉంది. అలాంటి వాటిలో విశాఖ జిల్లాలో చూసుకుంటే ఉత్తరం, దక్షిణం, పశ్చిమ, తూర్పులలో ఈసారి భీకరమైన యుద్ధమే సాగనుంది. 2019లలో ఈ సీట్లు తెలుగుదేశానివే అయినా ఈసారి వైసీపీ గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది. 

అదే విధంగా ఎలమంచిలి, చోడవరం, నర్శీపట్నంలలో రెండు పార్టీలకూ సమానమైన గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. గాజువాక, పెందుర్తి, అనకాపల్లిలలో మాత్రం టీడీపీకి సానుకూలత ఉందని తెలుస్తోంది. విజయనగరం జిల్లా తీసుకుంటే చీపురుపల్లి, నెల్లిమర్లలలో వైసీపీకి అనుకూలంగా ఉంది. ఎస్‌ కోట, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలిలలో హోరాహోరీ పోరు సాగనుంది. 

శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే నరసన్నపేట,  పాతపట్నం, శ్రీకాకుళం అసెంబ్లీ స్ధానాలలో వైసీపీకి అనుకూలత ఉంటే ఆముదాలవలస, టెక్కలి, ఇచ్చాపురంలలో టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. ఎచ్చెర్ల, పలాసాలలో  నున్వా నేనా అన్నట్లుగా పోరు సాగనుంది. రాజాంలో చూసుకుంటే రెండుసార్లు వైసీపీ గెలిచింది. దాంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంబాల జోగులు పట్ల కొంత వ్యతిరేకత ఉంది. అదే సమయంలో 2009లో గెలిచిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహనరావు మీద కొంత సానుభూతి ఉంది. ఇక్కడ టీడీపీ కంటే కోండ్రు బలంగా ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి మార్పు విషయంలో నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మారుతుంది. 

అదే విధంగా ఎచ్చెర్ల నియోజకవర్గం తీసుకుంటే వైసీపీలోనూ, టీడీపీలోనూ వర్గపోరు సమానంగానే ఉంది. దాంతో రెండు పార్టీలకు అంతర్గత సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించి ఎవరు గెలుస్తారు, అలాంటి సమర్ధులైన అభ్యర్ధులు ఎవరు అన్నది ఆయా పార్టీలు నిర్ణయించిన మీదటనే ఫలితం తేలనుంది. 

మొత్తానికి ఉత్తరాంధ్రాలో రాజకీయ పరిస్థితులు చూస్తే వైసీపీకి ఈ రోజుకూ 17 నుంచి 20 సీట్ల దాకా గెలుపు అవకాశాలు ఉంటే టీడీపీకి 14 దాకా ఉన్నాయన్నది ఒక విశ్లేషణ. అంటే ఢీ అంటే ఢీ అన్న పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. ఈ రోజుకూ మెజారిటీ సీట్లు వైసీపీకే దక్కుతాయని అంటున్నారు. అయితే అభ్యర్ధుల ఎంపిక అన్నది ఇక్కడ కీలకమైన పాత్ర పోషించనుంది. 

వైసీపీ పట్ల సానుకూలత ఉన్నా ఎమ్మెల్యేల మీద చాలా చోట్ల వ్యతిరేకత ఆ పార్టీకి ఇబ్బందిని కలుగచేస్తుందన్నది ఓ నిష్టురమైన నిజం. అదే సమయంలో తెలుగుదేశానికి ఇంకా అవసరమైన రాజకీయ భరోసా అయితే జనాల నుంచి దక్కడంలేదు. పార్టీ ఇంకా నిస్తేజం నుంచి పూర్తిగా కోలుకోవడంలేదు. ఈ పరిణామాల నుంచి ఆ పార్టీ కోలుకోకపోతే గతం కంటే సీట్లు పెరుగుతాయేమో తప్ప 2014 నాటి మ్యాజిక్‌ను మాత్రం కొనసాగించే ప్రసక్తే లేదు అని అంటున్నారు. 

సామాజిక సమీకరణలను తీసుకుంటే బీసీల ఓట్లు ఇపుడు పూర్తిగా ఏకపక్షంగా టీడీపీకి పడిపోయే పరిస్థితులు లేకపోవడమే అసలైన మార్పు. తూర్పు కాపులు, కాళింగులు, వెలమలలో ఒక వర్గం ఇతర బీసీ కులాలు వైసీపీకి అండగా ఉండగా, వెలమలలో మెజారిటీ వర్గం, తూర్పు కాపులలో ఒక వర్గం, ఇతర బీసీ కులాలు టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నాయి. 

దశాబ్దాల నాటి పార్టీ కాబట్టి టీడీపీలో జనాలకు తెలిసిన బీసీ నాయకులు చాలామంది ఉన్నారు. ఒక విధంగా సానుకూలం అయితే మరో విధంగా మైనస్‌గా కూడా ఉంటోంది. ఇన్ని దశాబ్దాల కాలంలో తమకు ఆయా పెద్ద బీసీ నాయకులు  ఏమి మేలు చేశారన్నది జనాల నుంచి వస్తున్న ప్రశ్న. వైసీపీ యువతరానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ వైపుగా బీసీలు కదులుతున్న నేపధ్యం ఉంది. 

రాజకీయంగా చూస్తే వైసీపీకి ఉద్దండులైన నాయకులు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌, తమ్మినేని సీతారామ్‌, బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, గుడివాడ అమరనాధ్‌ వంటి వారు ఉన్నారు. అదే టీడీపీలో ఏకంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడితో పాటు మాజీ మంత్రులు పూసపాటి అశోక్‌గజపతిరాజు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి వంటి వారు కనిపిస్తారు. అయితే టీడీపీలో సీనియర్లు పార్టీకి భారంగా ఉన్నారా లేక భారం మోస్తున్నారా అన్నది ఈ ఎన్నికలలో తేలిపోతుంది అని అంటున్నారు.