తమిళనాడులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన పిల్లల చదువు కోసం ఓ తల్లి తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసింది. తమ పిల్లల చదువు కోసం డబ్బులు లేక.. తను చనిపోతే ప్రభుత్వం నుండి సాయం అందుతుందని భావించి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ బస్సుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్లితే.. పాపతి అనే మహిళ సేలం జిల్లా కలెక్టరేట్లో కాంట్రాక్ట్ క్లీనర్‌గా పనిచేస్తోంది. నెలకు ₹ 10,000 జీతం పొందుతోంది.15 ఏళ్ల క్రితం భర్త విడిపోవడంతో పాపతి తన ఇద్దరు పిల్లలను, వృద్ధ తల్లిని పోషిస్తోంది. ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న కుమార్తెకు, ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారుడికి ట్యూషన్ ఫీజు కట్టాలనే ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో ఫీజు చెల్లించేందుకు అప్పు కోసం తెలిసిన వ్యక్తులను సంప్రదించగా వారు డబ్బులు ఇవ్వకపోగా.. తాను చనిపోతే ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందనే సలహా ఇచ్చారు. దీంతో తాను చనిపోతే తన కుటుంబం అయిన బాగుపడుతుందని భావించి బస్సుకు ఎదురెళ్లి అత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన గత నెల చివర్లో జరిగిన.. ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయడంతో తన పిల్లల చదువుకు సహాయపడే నష్టపరిహారం వస్తుందనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాకపోతే ఆ తల్లి చేసిన త్యాగం ఫలించకపోవడం బాధకరం. ప్రమాద కేసు కాస్తా ఆత్మహత్య కేసుగా మారడంతో ప్రభుత్వం నుండి వచ్చే పరిహారం వారికి రాలేదు. ప్రమాద బాధితులకు మాత్రమే ప్రభుత్వ పరిహారం అందుతుందని అధికారులు అంటున్నారు.
కాకపోతే ఈ ఘటన గురించి తెలిసిన వారు మాత్రం ప్రభుత్వం మండిపడుతున్నారు. లక్షల కోట్లు ఉచితలు ఇస్తున్నామంటూ చెప్పుకుంటున్న ప్రభుత్వాలు.. ఈ ఘటనను చూసి సిగ్గు పడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.