అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లో డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రసంగం
అభిమానులంతా క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి. ఒక్కరికి ఏమయినా కష్టం కలిగినా పవన్ కళ్యాణ్ ఫీలవుతారు. మనం అంతా పవన్ వెనుక వుండాలి. అలా వుండే వాళ్లలో ఒక్క నెంబర్ కూడా తగ్గకూడదు. అందుకే అందరూ క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి.
ఇక, అజ్ఞాతవాసి సినిమా వెనుక ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అలాంటి మహానుభావుల్లో కొందరు ఈ వేదిక మీద వున్నారు. మణికంఠన్, ప్రకాష్, అనిరుధ్, బొమ్మన్ ఇరానీ, తనికెళ్ల భరణి ఇలా అందరికీ నా కృతజ్ఞతలు. వీళ్ల అందరి దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను.
నాకు ఖర్చు ఎక్కువ. మా అమ్మ తిడుతూ వుండేది. ఇప్పుడు నిర్మాత తిట్టడంలేదు నా గడ్డం నెరసిపోయింది కాబట్టి. ఈ సినిమాకు నిర్మాత చినబాబు, ఆయన పక్కన వంశీ, పిడివి ప్రసాద్ కలిసి బోలెడు ఖర్చు చేసారు. పవన్ కళ్యాణ్ ఇటలీలో వుండగా రెండు నిమషాల్లో, ఫోన్ లో కథ చెప్పాను. ఆయన వెంటనే ఓకె చేసారు. ఆ తరువాత నేనేం చెబితే అది చేసారు. అంతే తప్ప ఏమీ అడగలేదు.
ఈ సినిమాలో పవన్ నట విశ్వరూపాన్ని చూస్తారు. అంతకన్నా ఆయన గురించి ఇంకేం చెప్పకూడదు. అమ్మ అంటే ఎంత ఇష్టం అయినా మనసులోనే వుంచుకుంటాం. మీరు అందరూ అనుకునే, ఆశించే ఉన్నత స్థాయికి పవన్ చేరుకుంటారని ఆశిస్తున్నాను.
బిఎన్ రెడ్డి దగ్గర నుంచి రాజమౌళి వరకు ఎందరో మహానుభావులు. వారందరికీ వందనాలు.