ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన మంత్రి రోజా..!

పాపం రోజా.. మంత్రి పదవి వచ్చిన కొత్తల్లో కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగారు. అది ఈరోజు ఫిక్స్ అయింది. కానీ ఆమె బ్యాడ్ లక్ ఏంటంటే.. కేసీఆర్ ని వెళ్లి కలిసే రోజు.. సరిగ్గా…

పాపం రోజా.. మంత్రి పదవి వచ్చిన కొత్తల్లో కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగారు. అది ఈరోజు ఫిక్స్ అయింది. కానీ ఆమె బ్యాడ్ లక్ ఏంటంటే.. కేసీఆర్ ని వెళ్లి కలిసే రోజు.. సరిగ్గా కలిసే లోపే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ మాటల మంటలు రేపారు. దీంతో టీఆర్ఎస్ వెర్సెస్ వైసీపీ మాటల యుద్ధం మొదలైంది. దీంతో రోజా బాగానే ఇబ్బంది పడ్డారు. 

ప్రగతి భవన్ బయటకొచ్చాక కేటీఆర్ ని ఏమీ అనలేక, అలాగని ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇవ్వలేక రోజా తెగ ఇబ్బంది పడ్డారు. కేటీఆర్ పొరుగు రాష్ట్రాలన్నారు కానీ ఏపీ అనలేదని, ఆయన్ను ఆ స్నేహితుడెవరో తప్పుదోవ పట్టించి ఉంటారని కవర్ చేశారు.

కేటీఆర్ పై వైసీపీ ఫైర్..

కేటీఆర్ వ్యాఖ్యలకు వైసీపీ గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. మంత్రులు, ఇతర నేతలు ఇలా ఎవరికి వారు కేటీఆర్ ని ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆదిమూలపు సురేష్ లాంటి వాళ్లయితే టీవీ చర్చల్లో, లైవ్ లోనే చెడుగుడు ఆడుకున్నారు. ఇక నెటిజన్లు ఊరుకుంటారా..? టీఆర్ఎస్ డబుల్ బెడ్ రూమ్ హామీతో వెటకారాలాడుతున్నారు. ఏపీలో జగనన్న హౌస్ సైట్స్ అందరికీ ఇచ్చారని, తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ అవకాశాన్ని చేజేతులారా మిస్ చేసుకున్నది మాత్రం ఒక్క రోజానే. మామూలుగా రోజాకి ఇలాంటి అవకాశాలు దొరికితే.. కేటీఆర్ నే కాదు, కేసీఆర్ ని కూడా కలిపి విమర్శించేవారు. గతంలో కూడా గులాబీ బాస్ ని ఇలాగే ఓ ఆట ఆడేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు సహకరించలేదు. 

ఈరోజు రోజా కుటుంబ సమేతంగా.. కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడ కేసీఆర్ కుటుంబం కూడా బొట్టు పెట్టి ఆమెకు ఆహ్వానం పలికింది. సారె పెట్టి సాగనంపింది. ఇలాంటి సందర్భంలో కేటీఆర్ పై విమర్శలు చేయడం మర్యాదగా ఉండదు. అందుకే రోజా మొహమాటానికి ఏదో మమ అనిపించేశారు.

అదే సమయంలో కేటీఆర్ కి కౌంటర్ ఇవ్వకపోయినా ఇబ్బందే. అందుకే ఆమె కేటీఆర్ కి ఓ సవాల్ విసిరారు. ఆయన ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తే అప్పుడు ఏపీ మొత్తం తిప్పి చూపిస్తానని, ఆయనతో పాటు, ఆ స్నేహితుడెవరో కూడా వస్తే వారికి కూడా ఏపీలోని అభివృద్ధి చూపిస్తానని, ఇక్కడి పాలన చూసి తెలంగాణలో కూడా ఇలాంటి పథకాలు తీసుకొచ్చే అవకాశముందని చెప్పారు రోజా.

పాపం కేటీఆర్ ని పల్లెత్తు మాట అనకుండానే ఆ తప్పు మొత్తం ఆ ఊరూ పేరు లేని స్నేహితుడిపై వేశారు రోజా. ఒక విధంగా ఈరోజు మంత్రి హోదాలో తెలంగాణలో రోజాది రాంగ్ ఎంట్రీ అనే చెప్పాలి.