మరో భారీ మల్టీ స్టారర్ కు టాలీవుడ్ లో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సీనియర్ హీరో బాలకృష్ణ, ఈ జనరేషన్ టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబులను కలిపి ఓ అద్భుతమైన మల్టీస్టారర్ ను అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 14రీల్స్ సంస్థ ఇందుకోసం ప్రయత్నిస్తోంది. బోయపాటి శ్రీనివాస్ దర్శకుడు. ఈ మేరకు ఇద్దరు హీరోలు సూత్రప్రాయంగా ఓకె చేసారు.
బోయపాటి శ్రీనివాస్ ఇద్దరు హీరోలను కలిసి లైన్ చెప్పినట్లు తెలిసింది. ఓకె అంటే కనుక, స్క్రిప్ట్ తయారీమీదకు వెళ్తానని అన్నట్లు వినికిడి. దీనికి ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత మళ్లీ మరోసారి డిస్కస్ చేద్దామని అన్నట్లు వినికిడి.
ఈ ప్రాజెక్టు కనుక మెటీరియలైజ్ అయితే మరో క్రేజీ ప్రాజెక్టుగా మారుతుంది. బోయపాటి లాంటి డైరక్టర్, బాలయ్య-మహేష్ కాంబినేషన్ అంటే ఆ రేంజ్ నే వేరుగా వుంటుంది. ఈ ఇద్దరూ మల్టీస్టారర్ లు అంటే సై అనేవారే. బాలయ్య దర్శకుడిని, స్క్రిప్ట్ ను నమ్మితే ఏవరితోనైనా చేయడానికి సై అంటారు. గతంలో మంచు మనోజ్ తో ఓ సినిమా చేసారు. అలాగే మహేష్ కూడా మల్టీస్టారర్ లకు ఓకె. గతంలో అతగాడు వెంకటేష్ తో చేసారు. అందువల్ల అన్ని విధాలా ఈ ప్రాజెక్టు ఫైనల్ కావడానికే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.
అన్నింటికి మించి 14రీల్స్ బ్యానర్ అంటే ఇటు బాలయ్యకు, అటు మహేష్ కు ఇద్దరికి బాగా కావాల్సిన బ్యానర్ నే. బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వున్నారు. ఆ సినిమా తరువాతనే ఈ ప్రాజెక్టుపై దృష్టి పెడతారు. పైగా మహేష్ కూడా వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ ల సినిమాలు చేయాల్సి వుంది.